Nagarjuna Sagar By Election: సాగర్ ఉప ఎన్నిక పోరు ప్రశాంతం.. మే 2న కౌటింగ్.. గెలుపు అంచనాల్లో పార్టీలు

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ 84.32 శాతం మంది ఓటర్లు ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 8:14 pm, Sat, 17 April 21
Nagarjuna Sagar By Election: సాగర్ ఉప ఎన్నిక పోరు ప్రశాంతం.. మే 2న కౌటింగ్.. గెలుపు అంచనాల్లో పార్టీలు
Nagarjuna Sagar By Election

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 7 గంట‌ల‌కు పోలింగ్ ముగిసే స‌రికి 88 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు తెలిపారు.  కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రజలంతా ఓట్లు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌ పైలాన్ కాలనీలో పర్యటించి పోలింగ్ సరళిని, ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి హిల్‌ కాలనీలోని పోలింగ్‌ కేంద్రంలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్‌ త్రిపురారం మండలం పలుగు తండా ప్రాథమిక పాఠశాలలో కుటుంబసభ్యులతో పాటు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సాగర్ ఉప ఎన్నికల ఓటింగ్ ప్రారంభం కాగానే… ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారుయ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ అనుముల మండలం ఇబ్రహీంపేటలో ఓటు వేశారు. గుర్రంపోడ్ మండలం వట్టికోడ్‌ బూత్‌ నంబర్‌-13లో ఈవీఎం మొరాయించడంతో ఓటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ అధికారులతో పాటు మిగతా సిబ్బంది అంతా కోవిడ్ నిబంధనలు పాటించారు. మాస్క్ పెట్టుకోని ఓటర్లను పోలీసులు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు

సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదంటున్నాయి ప్రధాన పార్టీలు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో గేమ్‌ ఛేంజర్ అనే భావన ఉంది. అధికార టీఆర్‌ఎస్‌ గెలిస్తే ఆ పార్టీకి కొత్త ఊపు రావడంతోపాటు.. తెలంగాణ చాంపియన్లం తామేనని నిరూపించుకున్నట్టవుతుందని అంటున్నారు. జానారెడ్డి గెలిస్తే ఇటీవలి ఎన్నికల్లో పేలవ ప్రదర్శనతో దాదాపు నిస్తేజంగా మారిన కాంగ్రెస్‌ పార్టీ ఆశలు 2023 వరకు సజీవంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు గాలివాటం కాదని రుజువు చేయాలంటే.. ఇక్కడ గెలిచి చూపించాలని బీజేపీ భావిస్తోంది. ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి.

నాగార్జున సాగర్‌లో 2018లో  86.44 శాతం ఓటింగ్ జరిగింది. 2014 ఎన్నికల్లో 80.01 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో నోముల దాదాపు 7 వేల 771 ఓట్ల తేడాతో జానారెడ్డి మీద గెలిచారు. ఆయనకు 46.34 శాతం ఓట్లు వచ్చాయి. జానారెడ్డి 42.04 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఈసారి కూడా ఓటింగ్ శాతం భారీగా ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితం మే 2న రానుంది.

Read Also…  ముగిసిన తిరుపతి ఉప ఎన్నిక.. వైసీపీ అక్రమాలకు పాల్పడిందన్న ప్రతిపక్షాలు.. ఎన్నిక రద్దుకు డిమాండ్