Covid Prevention: కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్.. కేటీఆర్ కార్యాచరణ ఇదే!

Covid Prevention: కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్.. కేటీఆర్ కార్యాచరణ ఇదే!
Ktr On Corona

కరోనా సెకెండ్ వేవ్ తీవ్రస్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ మునిసిపల్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసుల...

Rajesh Sharma

|

Apr 17, 2021 | 6:44 PM

Covid Prevention steps by municipal department of Telangana: కరోనా సెకెండ్ వేవ్ తీవ్రస్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ మునిసిపల్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసుల సంఖ్య పెద్ద సంఖ్యలో వుండడంతో ప్రత్యేక కార్యాచరణ ప్రకటించారు రాష్ట్ర మునిసిపల్ పరిపాలన శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. క్షేత్ర స్థాయిలో అమలు కావాల్సిన చర్యలపై కేటీఆర్ అధికార యంత్రాంగానికి శనివారం (ఏప్రిల్ 17న) కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గార్బేజ్ తొలగింపు, డిస్ఫెక్షన్ స్ప్రేయింగ్‌ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నారు.

రానున్న నాలుగు రోజుల్లో గార్బేజ్ తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, కరోనా కట్టడిలో భాగంగా ముమ్మరంగా డిస్ఫెక్షన్ స్ప్రే చేయాలని కేటీఆర్ ఆదేశాలిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేరుకుపోయిన చెత్తను రానున్న నాలుగు రోజుల్లోగా పూర్తిస్థాయిలో తొలగించాలని కె.టి.రామారావు ఆదేశించారు. ప్రతి సర్కిల్ లోని మెడికల్ ఆఫీసర్, డిప్యూటి కమిషనర్, సంబంధిత పారిశుధ్య అధికారులు ప్రతిరోజు ఉదయం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి పూర్తిస్థాయిలో గార్బేజ్‌ను తొలగించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకుగాను అవసరమైన అదనపు వాహనాలు, డంపర్లు, టిప్పర్లను సమకూర్చుకోవాలని మంత్రి ఆదేశించారు.

పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై  ప్రతిరోజు ఉదయం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు డిస్ఫెక్షన్ స్ప్రేయింగ్ ముమ్మరంగా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి నిర్దేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాజా పరిస్థితిపై మంత్రి.. మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌తో సమీక్ష నిర్వహించారు. మునిసిపల్ శాఖ మంత్రి ఆదేశాల మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం సాయంత్రం జిహెచ్ఎంసి జోనల్, డిప్యూటి కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ… సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనలను అనుసరించి నగరంలో డస్ట్ బిన్ లను తొలగించడం జరిగిందని, అయితే ఈ కేంద్రాల్లో ఏర్పడ్డ చెత్తను తొలగింపు సంతృప్తికరంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుండి (ఆదివారం) ఉదయం జోనల్, డిప్యూటి కమిషనర్లు, ఏ.ఎం.హెచ్.ఓ లు క్షేత్రస్థాయిలో పర్యటించి గార్బేజ్ ను తొలగించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలైన మార్కెట్లు, బస్ స్టేషన్లు, పార్కులు, వ్యాపార ప్రాంతాల్లో గార్బేజ్ కనిపించకూడదని పేర్కొన్నారు.

బిన్ ఫ్రీ సిటీగా చేపట్టిన చర్యల వల్ల ఇంటింటి నుండి గార్బేజ్ సేకరణ మరింత పెరగాలని, ఇందుకుగాను అవసరమైన అదనపు స్వచ్ఛ ఆటోలను పొందేందుకు మహీంద్ర కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించారు. రహదారులు, వీధుల్లో చెత్త కనిపిస్తే ఏ మాత్రం సహించేదిలేదని, ఇందుకుగాను సంబంధిత ఏ.ఎం.హెచ్.ఓ లు, డిప్యూటి కమిషనర్లను బాధ్యులను చేయడం జరుగుతుందని ముఖ్య కార్యదర్శి హెచ్చరించారు. ప్రధానంగా గార్బేజ్ వల్నరబుల్ కేంద్రాలపై ప్రధాన దృష్టి సాధించాలని పేర్కొన్నారు. చెత్త తొలగించిన కేంద్రాల వద్ద డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ చేపట్టాలని తెలిపారు. శానిటేషన్ సిబ్బందికి హ్యాండ్ గ్లోవ్స్ లు , శానిటైజర్, మాస్కులను తప్పనిసరిగా అందించాలని అన్నారు. డంపింగ్ యార్డ్ లు, ఇంటర్ మీడియట్ ట్రాన్స్ ఫర్ స్టేషన్లలో గార్బేజ్ ఎత్తివేతలో ఏవిధమైన సమస్యలు తలెత్తకుండా వాటి స్థాయిని పెంచాలని సూచించారు. రానున్న నాలుగు రోజులు ఉద్యమరూపంలో గార్బేజ్ తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా నగరంలోని ప్రధాన కూడళ్లు, జనసంవర్థ ప్రాంతాలు, మార్కెట్లు, పార్కులు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ ను చేపట్టాలని ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. డస్ట్ బిన్ లను తొలగించిన ప్రాంతాల్లో కూడా చెత్తను తొలగించిన అనంతరం స్ప్రేయింగ్ చేయాలని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు గాను ఒక శాతం సోడియం హైపోక్లోరైట్ ద్రావకంతో కూడి స్ప్రేయింగ్ ను క్రమం తప్పకుండా చేపట్టాలని అన్నారు. ఇందుకుగాను సోడియం హైపోక్లోరైట్ తో పాటు అవసరమైన డిస్-ఇన్ఫెక్షన్ మందులను తగు మొత్తంలో ముందస్తుగా సేకరించాలని ఆదేశించారు. మృతదేహాల వల్ల ఏవిధమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాను శ్మశానవాటికల్లో తగు నీటి లభ్యత, సరైన లైటింగ్ తదితర సౌకర్యాలను ఉండేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కాగా నేడు ఉదయం నుండే నగరంలో ముమ్మర పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, గార్బేజ్ తొలగింపుపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిహెచ్ఎంసి కమిషనర్ వివరించారు. ప్రతి రోజు ఉదయం గార్బేజ్ తొలగింపుకు నియమించిన వాహనాలు సక్రమంగా వస్తున్నాయా… లేనిది సంబంధిత జోనల్, డిప్యూటి కమిషనర్లచే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అన్ని మునిసిపాలిటీల్లో…

రాష్ట్రంలో కోవిడ్ వైరస్ మళ్లీ శరవేగంతో విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు అన్ని మునిసిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ ద్రావకం స్ప్రే చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. మునిసిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, కమీషనర్ ఎండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సత్యనారాయణ, జీ.హెచ్.ఎం.సీ కమీషనర్ లోకేశ్ కుమార్ లతో మంత్రి శనివారం సాయంత్రం కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా అన్ని పురపాలికల్లో వెంటనే శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, క్రిమిసంహారక ద్రావకాన్ని పిచికారీ చేయాలని మంత్రి ఆదేశించారు.

ప్రస్తుతం మునిసిపల్ శాఖ వద్ద ఉన్న వాహనాలతో పాటు అవసరమైన చోట ప్రత్యేకంగా వాహనాలను అద్దెకు తీసుకుని సోడియం హైపోక్లోరేట్ ద్రావకం పిచికారీ చేయాలని మంత్రి చెప్పారు. పై పనుల కోసం పట్టణ ప్రగతి నిధులు వినియోగించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఈ క్రిమిసంహారకాల స్ప్రే జరగాలని మంత్రి అన్నారు. కరోనా తీవ్రత ఉన్నందున శాఖ పరిధిలో ఉన్న ఎంటమాలజిస్టులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, శాఖలో ఉన్న అందరు ఉద్యోగులు విధిగా విధులకు హాజరు కావాలని, సెలవులు రద్దు చేయాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. ఆరోగ్య శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని కూడా మంత్రి కేటీఆర్ కోరారు. దీనితో పాటు కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో అవగాహన కూడా కల్పించాలని, ప్రజలందరూ ఎల్లవేళలా మాస్కు ధరించేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు.

ఫ్రంట్‌లైన్ సిబ్బందికి 100 శాతం వాక్సినేషన్

మునిసిపల్ శాఖ సిబ్బంది కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్నందున శాఖ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులకు సూచించారు. జీ.హెచ్.ఎం.సిలో రేపటికల్లా వందశాతం ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని, మిగతా పురపాలికల్లో కూడా ఇంకో 2-3 రోజుల్లో ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తామని అధికారులు మంత్రికి తెలియజేశారు.

ALSO READ: కేలండర్‌తోపాటు మారిన కరోనా.. మ్యూటెంట్ వెర్షన్ మహా డేంజర్.. ఏ రాష్ట్రంలో ఎలా?

ALSO READ: త్వరలో నీరవ్ మోదీ అప్పగింత.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యుకే.. డిపోర్టేషన్‌కు రంగం సిద్ధం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu