AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: తెలంగాణపై తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

మొంథా తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. ఇప్పటికే ఏపీపై తీవ్ర ప్రభావాన్ని చూపిన తుఫాన్.. ఇప్పుడు తెలంగాణపై కూడా పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంపై మొంథా తుఫాన్ ప్రభావం ఎలా ఉంది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశాలపై అధికారులను ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం వరి కోతల స‌మ‌యం కావ‌డం.. ప‌లు చోట్ల క‌ళ్లాల్లో ధాన్యం ఆర‌బోసిన నేప‌థ్యంలో ఎటువంటి న‌ష్టం వాటిల్లకుండా త‌గిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

CM Revanth Reddy: తెలంగాణపై తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Cm Revanth Reddy
Anand T
|

Updated on: Oct 29, 2025 | 3:24 PM

Share

తెలంగాణపై మొంథా తుపాన్ ప్రభావం, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మొంథా తుఫాన్ ప్రభావంపై అధికారులను ఆరా తీశారు. తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. వ‌రి కోత‌ల స‌మ‌యం కావ‌డం.. ప‌లు చోట్ల క‌ళ్లాల్లో ధాన్యం ఆర‌బోసిన నేప‌థ్యంలో ఎటువంటి న‌ష్టం వాటిల్లకుండా త‌గిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. ధాన్యం, ప‌త్తి కొనుగోలు కేంద్రాల్లోనూ త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సీఎం సూచించారు. మొంథా తుపాను ప్రభావం ఉమ్మడి ఖ‌మ్మం, ఉమ్మడి వ‌రంగ‌ల్‌, ఉమ్మడి న‌ల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండ‌డం.. హైద‌రాబాద్ స‌హా ఇత‌ర జిల్లాల్లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్రమ‌త్తంగా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మ‌హ‌బూబాబాద్ జిల్లా డోర్నక‌ల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమ‌డుగు స్టేష‌న్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోవ‌డం.. ప‌లు రైళ్లను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు దారి మ‌ళ్లించిన నేప‌థ్యంలో ప్రయాణికుల‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల‌ని సీఎం ఆదేశించారు. మొంథా తుపాన్ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు స‌మ‌న్వయం చేసుకోవాల‌ని.. జిల్లా కలెక్టర్లు ఆయా బృందాల‌కు త‌గిన మార్గద‌ర్శక‌త్వం వ‌హించాల‌ని సీఎం సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోత‌ట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

నీటి పారుద‌ల శాఖ అధికారులు, సిబ్బంది రిజ‌ర్వాయ‌ర్లు, చెరువులు, కుంట‌ల నీటి మ‌ట్టాన్ని ఎప్పటిక‌ప్పుడు ప‌రిశీలిస్తూ నీటి విడుద‌ల‌పై ముందుగానే క‌లెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవ‌ల్ బ్రిడ్జిలు, కాజ్‌వేల‌పై నుంచి రాక‌పోక‌లు పూర్తిగా నిషేధించాల‌న్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి స‌మీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ప‌ర్యవేక్షణ చేయాల‌ని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావంతో వ‌ర్షపు నీరు నిల్వ ఉండి దోమ‌లు, ఇత‌ర క్రిమికీట‌కాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున న‌గ‌ర‌, పుర‌పాల‌క‌, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటిక‌ప్పుడు పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు.

వైద్యారోగ్య శాఖ త‌గినంత మందులు అందుబాటులో ఉంచుకోవాల‌ని.. అవ‌స‌ర‌మైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప‌శు న‌ష్టం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వ‌హించాల‌ని సీఎం సూచించారు. రెవెన్యూ, విద్యుత్‌, పంచాయ‌తీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్‌, అగ్నిమాప‌క శాఖ‌లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స‌మ‌న్వయంతో సాగాల‌ని సీఎం సూచించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్రజ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల‌కు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క శాఖ సిబ్బంది త‌క్షణ‌మే స్పందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.