శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్.. 3 విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్..
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో హైఅలర్ట్ ప్రకటించారు. అధికారులు అప్రమత్తమై విమానాలను సురక్షితంగా ల్యాండింగ్ చేయించి, విస్తృత తనిఖీలు చేపట్టారు. రెండు అంతర్జాతీయ, ఒక దేశీయ విమానానికి బెదిరింపులు వచ్చాయి. దీని వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మూడు విమానాలను సురక్షితంగా ల్యాండింగ్ చేయించి, విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపులకు గురైన మూడు విమానాల్లో రెండు అంతర్జాతీయ సర్వీసులు కాగా, ఒకటి దేశీయ సర్వీస్ ఉంది. కన్నూర్-హైదరాబాద్ ఇండిగో విమానానికి, జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుండి వస్తున్న లుఫ్తాన్సా విమానానికి, లండన్ నుండి హైదరాబాద్‌కు వస్తున్న మరో విమానానికి బెదిరింపు వచ్చింది.
బెదిరింపు మెయిల్ అందిన వెంటనే అధికారులు ఈ విమానాలు ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ల్యాండింగ్ అయిన వెంటనే, ప్రయాణీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి, మూడు విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి బాంబులు లేవని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అవి ఫేక్ మెయిల్స్‌గా సమాచారం. అయితే బెదిరింపు మెయిల్స్‌ను ఎవరు పంపారు, దీని వెనుక ఉద్దేశం ఏమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
