Andhra: మీసాల పెద్దాయన…. ఈయన మీసాల పొడవు ఎంతో తెలిస్తే అవాక్కే..!
తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ మీసకట్టుకు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లే, ఏలూరు జిల్లా అచ్చియ్యపాలెంకి చెందిన పొగాకు రైతు మీసాలు రెడ్డియ్య కూడా తన విలక్షణమైన మీసాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. 1982 నుంచి హాబీగా పెంచుకున్న ఆయన మీసాలు ఒక సమయంలో మూడు అడుగుల దాకా ఉండేవి. ప్రస్తుతం ...

మీసాలు పౌరుషానికి చిహ్నంగా పురుషులు భావిస్తుంటారు. వీటి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరో నందమూరి బాలకృష్ణ మీసకట్టు ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి మీసకట్టును చాలా మంది అనుకరిస్తున్నారు. ఇక వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న “మన శంకర వరప్రసాద్” సినిమాలో హీరో చిరంజీవి హీరోయిన్‌ను ఉద్దేశించి ఓ మీసాల పిల్లా అంటూ పాడే సాంగ్ ఇపుడు వైరల్ అవుతుంది కదా. మీసాలకు ఇంత ప్రాధాన్యత ఉండబట్టే చాలా మంది ఇవి ప్రత్యేకంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. రాజకీయాల్లో నర్సాపురం మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు మీసాలు విలక్షణంగా ఉంటాయి. చాలా మంది ఆయన్ను ఆయన మీసాలు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. ఇక ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం అచ్చియ్యపాలెంకు చెందిన రెడ్డియ్య కూడా మీసాలకు పెట్టింది పేరు. ఈయన పొగాకు వ్యాపారి. 1982 నుంచి మీసాలు పెంచటాన్ని హాబీగా మార్చుకున్నారు. దీంతో అందరూ అతడిని మీసాలు రెడ్డియ్య అంటూ ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నుంచి చాలా మంది సినీ నటులు రెడ్డియ్యను అభినందించారు. గతంలో ఈయన మీసాలు మూడు అడుగుల వరకు ఉండేవి. వయస్సు పెరగడంతో అవి తగ్గిపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం రెండున్నర అడుగులు వరకు వీటి పొడవు ఉంది.
మీసంపై నిమ్మకాయ నిలబెట్టే వారట …!
ఈ మీసాల రెడ్డియ్య అందరికీ సుపరిచితులు. ఈయన మీసాలు చూసి ఆశ్చర్యపోని వ్యక్తులు ఉండరు. ఈయన మీసంపై నిమ్మకాయ నిలబెట్టేవారట. 1982 నుండి మీసాలు అంటే మక్కువతో పెంచడం మొదలుపెట్టి సుమారు మూడు అడుగుల రెండు అంగుళాల వరకు పెంచారు. దీంతో ఈయన ఎక్కడికి వెళ్లినా ఓ గుర్తింపు వచ్చింది. రాజకీయంగా, సినీ పరిశ్రమలో గుర్తింపుతో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా నటించారు. సినీ పరిశ్రమలో చిరంజీవి , కృష్ణ , భానుచందర్ , రాజశేఖర్ , చలపతిరావు వంటి నటులతో పరిచయాలు ఉండేవి. అలాగే, రాజకీయంగా ఎన్టీ రామారావు గారి ద్వారా పొగాకు ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. తన మీసం చూసి ముచ్చటపడి డిసిసిబి ప్రెసిడెంట్ పదవిని సైతం ఇచ్చారని ఆయన చెబుతారు. అలాగే ఆంధ్ర షుగర్స్ పెండ్యాల అచ్చిబాబు , ఎర్రం నాయుడు వంటి ప్రముఖ రాజకీయ నాయకులు తన మీసం వల్లే పరిచయం అయ్యారని గర్వంగా చెబుతారు. వ్యవసాయంతో పాటు తన కుటుంబం అంటే ఎంత ప్రేమో, నా మీసం కూడా అంతే ప్రేమ అని ఆయన చెబుతున్నారు. తన మీసం అంటే తన కుటుంబ సభ్యులకు చాలా ఇష్టమని.. వాళ్లు ఎక్కడున్నా ఎలా ఉన్నావు నీ మీసం ఎలా ఉంది జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంటారు అని గర్వంగా చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
