Andhra Pradesh: మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 48గంటల్లోనే అకౌంట్‌లో రూ.8లక్షలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు కీలక నిర్ణయం తీసుకుంది. స్త్రీ నిధి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు తక్కువ వడ్డీకి రూ.1 లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణాలు అందిస్తోంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మీ పథకాలతో పిల్లల విద్య, వివాహాలకు ఆర్థిక చేయూత లభిస్తుంది. 48 గంటల్లోనే ఖాతాల్లో జమ, రుణగ్రహీత మరణిస్తే రద్దు సౌకర్యం వంటివి మహిళలకు పూర్తి ఆర్థిక భరోసా కల్పిస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి, స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి తక్కువ వడ్డీకి రుణాలు, సబ్సిడీ కార్యక్రమాలను అందించనుంది. స్త్రీ నిధి పథకం కింద మరో రెండు నూతన పథకాలను ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకాల ద్వారా స్వయం సహాయక సంఘాలలోని ఒక్కో మహిళకు లక్ష రూపాయల నుంచి గరిష్టంగా 8లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
48గంటల్లోనే అకౌంట్‌లో డబ్బులు
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మీ అనే రెండు పథకాలను అందించడానికి సిద్ధమైంది. ఈ పథకాల ద్వారా డ్వాక్రా గ్రూపు సభ్యుల పిల్లల ఉన్నత విద్య, వారి వివాహాల కోసం ఆర్థికంగా చేయూత లభించనుంది. ఈ రుణాల పంపిణీ వేగంగా జరగనుంది. స్త్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు జీవనోపాధి కోసం ఎనిమిది లక్షల రూపాయల వరకు, కుటుంబ ఖర్చుల కోసం ఒక లక్ష రూపాయల వరకు రుణాలను పొందవచ్చు. ఈ రుణాలు నేరుగా 48 గంటల్లోనే మహిళల బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయి. అంతేకాకుండా రుణగ్రహీత మరణిస్తే, ఆ కుటుంబంపై భారం పడకుండా స్త్రీనిధి సురక్ష యోజన కింద రుణాన్ని రద్దు చేసే వెసులుబాటు కూడా ఉంది.
పనితీరు ఆధారంగా గ్రేడ్ల వారీగా లోన్లు
స్వయం సహాయక సంఘాల పనితీరు, ఆర్థిక బలోపేతమైన విధానాన్ని బట్టి వాటిని A, B, C, D గ్రేడ్లుగా వర్గీకరించి రుణాలను అందిస్తున్నారు. ఉదాహరణకు.. ఏ గ్రేడ్ సంఘానికి కోటి రూపాయల వరకు, బి గ్రేడ్ సంఘానికి 90 లక్షల రూపాయలు, సి గ్రేడ్ సంఘానికి 80 లక్షల రూపాయలు, డి గ్రేడ్ సంఘానికి 70 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం..
పిల్లల ఉన్నత విద్య, వివాహాలు వంటి పెద్ద ఖర్చులకు అధిక వడ్డీకి అప్పులు చేయకుండా ఉండటానికి ఈ సౌకర్యం మహిళలకు ఎంతగానో తోడ్పడుతుంది. మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధించి, గౌరవంగా తలెత్తుకు నిలిచేలా చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి కుటుంబాల ఉన్నతికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




