AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవికి ముందే షాక్‌.. భారీగా పెరిగిన AC ధరలు! ఏ కంపెనీ ఎంత పెంచిందంటే?

వేసవికి ముందు ఎయిర్ కండిషనర్ల ధరలు 5-15 శాతం పెరిగాయి. డైకిన్, వోల్టాస్, LG వంటి ప్రముఖ కంపెనీలు ముడి పదార్థాల ధరల పెరుగుదల, రూపాయి విలువ తగ్గడం, కొత్త ఇంధన సామర్థ్య నిబంధనల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాయి. పాత స్టాక్ ఉన్నా, ఏప్రిల్ నాటికి ధరల ప్రభావం పూర్తిస్థాయిలో కనిపిస్తుంది.

వేసవికి ముందే షాక్‌.. భారీగా పెరిగిన AC ధరలు! ఏ కంపెనీ ఎంత పెంచిందంటే?
Ac
SN Pasha
|

Updated on: Mar 09, 2026 | 7:42 AM

Share

వేసవి కాలం దగ్గరపడుతున్న వేళ ఎయిర్‌ కండిషనర్ కొనాలనుకునే వారికి బ్యాడ్‌ న్యూస్‌. ప్రముఖ రూమ్ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను 5 నుంచి 15 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, సరఫరా గొలుసు ఖర్చులు అధికమవడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు వెల్లడించాయి. ప్రముఖ బ్రాండ్లు అయిన డైకిన్, వోల్టాస్, బ్లూ స్టార్, LG, హైయర్, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ ఇప్పటికే ధరల పెంపును అమలు చేయడం ప్రారంభించాయి. ఈ పెంపులు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య దశలవారీగా అమల్లోకి వస్తున్నాయి. సాధారణంగా వేసవిలో డిమాండ్ పెరిగే ముందు ఈ ధరల మార్పులు రావడం పరిశ్రమలో సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు.

డైకిన్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కన్వల్జీత్ జావా తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి కొన్ని మోడళ్లపై 12 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా రాగి వంటి కీలక ముడి పదార్థాల ధరలు పెరగడం, భారత రూపాయి బలహీనపడటం, కొత్త ఇంధన సామర్థ్య ప్రమాణాలు అమల్లోకి రావడం వంటి అంశాలు ఖర్చులను పెంచాయని ఆయన తెలిపారు. అదే సమయంలో బ్లూ స్టార్ కంపెనీ ఇప్పటికే 8–10 శాతం వరకు ధరలు పెంచింది. అయితే పాత ధరలతో ఉన్న స్టాక్ ఇంకా మార్కెట్లో ఉండటంతో వినియోగదారులకు వెంటనే పెద్ద మార్పు కనిపించకపోవచ్చు. డీలర్లు ముందుగానే ఎక్కువగా స్టాక్ కొనుగోలు చేయడంతో కొత్త ధరల ప్రభావం కొంత ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంది.

ఇక వోల్టాస్ కంపెనీ కూడా 5 నుంచి 15 శాతం వరకు ధరలు పెంచనుంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ముకుందన్ మీనన్ ప్రకారం.. రాగి ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం, కొత్త ఇంధన సామర్థ్య ప్రమాణాల అమలు వల్ల తయారీ ఖర్చులు పెరిగాయని తెలిపారు. LG ఎలక్ట్రానిక్స్ ఇండియా కూడా ధరలు పెంచింది. కంపెనీ ప్రకారం 3-స్టార్ మోడళ్లపై సుమారు 7 శాతం, 5-స్టార్ మోడళ్లపై 9–10 శాతం వరకు పెంచింది. అయితే కొత్త మోడళ్లు మరింత ఇంధన పొదుపు కలిగినవిగా ఉండటంతో వినియోగదారులు విద్యుత్ బిల్లుల్లో దీర్ఘకాలంలో ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఇదిలా ఉండగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం కొత్త 5-స్టార్ ఎసీలు పాత మోడళ్లతో పోలిస్తే సుమారు 10 శాతం ఎక్కువ శక్తి సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం భారత్‌లో రూమ్ ఎయిర్ కండిషనర్ మార్కెట్ సుమారు 13.5 మిలియన్ యూనిట్లుగా అంచనా వేయబడుతోంది. ఇందులో వోల్టాస్, LG, డైకిన్, బ్లూ స్టార్, హిటాచీ, పానాసోనిక్, లాయిడ్ వంటి సంస్థలు గట్టి పోటీ పడుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం ఈ సంవత్సరం వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ధరలు పెరిగినా ACల అమ్మకాలు పెరిగే అవకాశమే ఎక్కువ అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us