AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి ఆస్తిపై పెద్ద కొడుక్కే ఎక్కువ హక్కు ఉంటుందా? చట్టాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి..

ఇళ్లల్లో తండ్రి ఆస్తి పంపిణీ అనగానే అందరి దృష్టి ముందుగా ఇంట్లో పెద్ద కొడుకు పైనే పడుతుంది. పెద్దవాడికి ఎక్కువ ఇవ్వాలా? లేదా అందరికీ సమానంగా పంచాలా? అనే అంశంపై తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి. కానీ భారత చట్టాల ప్రకారం పెద్ద కొడుక్కి ఆస్తిలో అర్హత ఎంత? చట్టం ముందు వారసులందరికీ ఉన్న హక్కులేంటి? అనే నిజాలు చాలామందికి తెలియవు.

తండ్రి ఆస్తిపై పెద్ద కొడుక్కే ఎక్కువ హక్కు ఉంటుందా? చట్టాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి..
Father Property Rights
Krishna S
|

Updated on: Aug 06, 2026 | 1:43 PM

Share

మన దేశంలో ఆస్తి పంపిణీకి సంబంధించి ఎన్నో సందేహాలు, అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి ఆస్తిపై ఇంట్లో పెద్ద కొడుకుకే మొదటి హక్కు లేదా ఎక్కువ వాటా ఉంటుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే భారతీయ వారసత్వ చట్టాల ప్రకారం ఇది నిజమేనా? పెద్ద కొడుక్కి ఏమైనా ప్రత్యేక ప్రాధాన్యత ఉందా? అనే విషయాలు చాలా మందికి తెలియవు. భారత చట్టాల ప్రకారం.. పెద్ద కొడుకుకి ఆస్తిలో ఎలాంటి ప్రత్యేక లేదా అదనపు హక్కులు ఉండవు. పిల్లలందరూ చట్టం ముందు సమానులే. కేవలం ఇంట్లో పెద్దవాడైనంత మాత్రాన తండ్రి ఆస్తిలో ఎక్కువ వాటా కోరే అర్హత చట్టపరంగా లభించదు.

ఆస్తి రకాన్ని బట్టి హక్కులు ఎలా మారతాయి?

తండ్రి ఆస్తిని ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు. ఆస్తి స్వభావాన్ని బట్టి వారసుల హక్కులు ఆధారపడి ఉంటాయి.

స్వయార్జిత ఆస్తి

తండ్రి తన సొంత కష్టార్జితంతో, సంపాదనతో కొనుగోలు చేసిన ఆస్తిని ‘స్వయార్జిత ఆస్తి’ అంటారు. ఈ ఆస్తిపై తండ్రికి సంపూర్ణ హక్కులు ఉంటాయి. తన ఆస్తిని ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకూడదు? అనేది పూర్తిగా ఆయన ఇష్టం. తండ్రి తన ఆస్తిని ఎవరికైనా అమ్మేయవచ్చు లేదా వీలునామా ద్వారా తను అనుకున్న వారికి రాసివ్వవచ్చు. ఒకవేళ తండ్రి ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే.. ఆ ఆస్తి చట్టబద్ధమైన వారసులకు సమానంగా పంపిణీ అవుతుంది.

పిత్రార్జిత ఆస్తి

తరతరాలుగా సంక్రమించిన ఆస్తిని పిత్రార్జిత ఆస్తి అంటారు.ఈ ఆస్తిపై పిల్లలందరికీ పుట్టుకతోనే సమాన హక్కు వస్తుంది. ఇందులో పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, కుమార్తెలందరికీ సమాన వాటా లభిస్తుంది. తండ్రి ఒకే ఒక్క కొడుక్కి లేదా పెద్ద కొడుక్కి మాత్రమే ఈ ఆస్తిని ఇవ్వడానికి వీల్లేదు.

కూతుళ్ల హక్కులు ఏమిటి?

2005 లో సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. కుమారులతో పాటు కుమార్తెలకూ పిత్రార్జిత ఆస్తిలో సమాన హక్కులు కల్పించబడ్డాయి. కొడుకులతో సమానంగా కూతుళ్లకు కూడా సమాన వాటా లభిస్తుంది.

వీలునామా లేకపోతే ఆస్తి పంపిణీ ఎలా జరుగుతుంది?

హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే.. ఆయన ఆస్తి క్లాస్-1 వారసులకు చెందుతుంది.

క్లాస్-1 వారసులలో తల్లి, భార్య, కుమారులు, కూతుళ్లు ఉంటారు. వీరందరికీ ఆస్తిలో సమాన వాటా లభిస్తుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంటే.. ఆస్తి 4 సమాన భాగాలుగా పంపిణీ అవుతుంది.

భారతీయ చట్టాల ప్రకారం తండ్రి ఆస్తి విషయంలో పెద్ద కొడుక్కి ప్రత్యేక హక్కులేవీ ఉండవు. స్వయార్జిత ఆస్తి అయితే తండ్రి నిర్ణయమే ఆఖరిది, ఒకవేళ పిత్రార్జిత ఆస్తి అయితే పిల్లలందరికీ సమాన వాటా లభిస్తుంది.

Follow Us