Tirumala: అక్రమాలకు చెక్.. ఏఐతో టెండర్లు.. టీటీడీ కొనుగోళ్లలో సరికొత్త అధ్యాయం
తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోళ్ల వ్యవహారంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. భక్తుల సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండటంతో పాటు వస్తువుల సేకరణలో ఎక్కడా అవినీతికి తావులేకుండా ఉండేందుకు అధికారులు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. అత్యాధునిక ఏఐ సాంకేతికతతో కూడిన డిజిటల్ ప్రోక్యూర్‌మెంట్ టెండర్ పోర్టల్ ద్వారా ఇకపై టెండర్ల ప్రక్రియ అంతా సాగనుంది.

శ్రీవారి భక్తులకు నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా, టీటీడీ తన కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వస్తువుల సేకరణలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా, వేగంగా టెండర్లు నిర్వహించేందుకు సరికొత్త డిజిటల్ ప్రోక్యూర్‌మెంట్ టెండర్ పోర్టల్‌ను తీసుకువస్తోంది. ఇటీవలే టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, రేడియంట్ ఇన్ఫోనెట్ ప్రతినిధులు, అధికారులతో కలిసి ఈ పోర్టల్ అభివృద్ధిపై సుదీర్ఘంగా సమీక్షించారు. వెబ్‌సైట్ ప్రోటోటైప్, డిజైన్‌ను పరిశీలించిన ఆయన భవిష్యత్తులో కొనుగోళ్లన్నీ పూర్తిస్థాయిలో డిజిటల్ మయం కావాలని ఆదేశించారు.
ఈ కొత్త వ్యవస్థతో వచ్చే కీలక మార్పులు ఇవే
టెండర్లలో పాల్గొనే సరఫరాదారులు తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు కావాలి. వారి నేపథ్యం, గత అనుభవం, అర్హతలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతి ఇస్తారు. ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా నకిలీ సరఫరాదారులు, మధ్యవర్తుల ఆటలకు అడ్డుకట్ట పడనుంది. కేవలం నిజమైన, విశ్వసనీయత ఉన్న సంస్థలకే సమాన అవకాశాలు లభిస్తాయి. మార్కెట్ ధోరణులు, ధరల హెచ్చుతగ్గులు, సరఫరా పరిస్థితులను విశ్లేషించేందుకు ఏఐ సాంకేతికతను వాడుతున్నారు. దీనివల్ల సరైన సమయంలో సరైన ధరకే వస్తువులను కొనుగోలు చేసే వీలుంటుంది. టెండర్ ప్రక్రియ, సరుకుల సరఫరా పర్యవేక్షణ, చెల్లింపుల వ్యవస్థ.. ఇవన్నీ ఒకే వేదికపైకి రానున్నాయి. దీనివల్ల పనిలో జాప్యం తగ్గుతుంది. డిజిటల్ విధానం వల్ల సరఫరాదారులకు అందాల్సిన నిధులు సకాలంలో అందుతాయి. ఇది టీటీడీపై వ్యాపారుల్లో నమ్మకాన్ని పెంచుతుంది.
విశ్వసనీయ డేటాబేస్ ఏర్పాటు
భవిష్యత్తు అవసరాల కోసం ధ్రువీకరించిన సరఫరాదారుల వివరాలతో ఒక సమగ్ర డేటాబేస్‌ను టీటీడీ రూపొందిస్తోంది. దీనివల్ల అత్యవసర సమయాల్లో నాణ్యమైన వస్తువులను త్వరగా సేకరించడం సులువవుతుంది. పారదర్శకత పెరగడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు టీటీడీ టెండర్లలో పాల్గొనే అవకాశం ఉందని అదనపు ఈవో ఆశాభావం వ్యక్తం చేశారు.
