ఆమె కంటే VIP ఎవరుంటారు.. నీజంగా మీరు గ్రేట్ బ్రదర్
అందరూ ఆమెను మతిస్థిమితం లేని మహిళ అని పిలిచారు…కానీ ఆమె చేసే పని మాత్రం సమాజానికి పాఠం చెప్పింది. ప్రతి రోజు పాణ్యం బస్టాండ్, షాపుల ముందు పడేసిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు ఏరుకుంటూ… ఎవరు చెప్పకుండానే స్వచ్ఛత కోసం పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సుంకమ్మ... ఆమె మనసు, ఆమె పనితీరును గమనించిన ఒక వస్త్ర దుకాణం యజమాని…

ఆమెను చూసి చాలా మంది మతిస్థిమితం లేని మహిళ అంటారు. కానీ.. ఆమె చేసే పని మాత్రం మనలో చాలామంది చేయలేనిది. నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లెకు చెందిన సుంకమ్మ మతిస్థిమితం కోల్పోయి పాణ్యం మండల కేంద్రంలో తిరుగుతూ ఉంటుంది. ప్రతి రోజు బస్టాండ్ దగ్గర, షాపుల ముందు పడేసిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, చెత్త కనిపిస్తే.. ఎవరూ చెప్పకుండానే వాటిని ఏరి డస్ట్‌బిన్‌లో వేస్తుంది. ఎవరైనా ఏదైనా తినడానికి ఇస్తే తింటుంది.. లేకపోతే అలాగే తిరుగుతుంది. కానీ స్వచ్ఛత కోసం చేసే పని మాత్రం ఆపదు. అలాంటి సుంకమ్మను గమనించిన ఓ వస్త్ర దుకాణం యజమాని.. తన కొత్త షాప్ ఓపెనింగ్‌కు రాజకీయ నాయకులను, సెలబ్రిటీలను పిలవలేదు. సమాజానికి నిశ్శబ్దంగా సేవ చేస్తున్న ఆ పెద్దమ్మనే పిలిచాడు. మొదట ఆమెతో కుడి కాలు పెట్టించి.. తన షాపును ప్రారంభింపజేశాడు. నిజంగా చెప్పాలంటే.. ఏం ఆశించకుండా సమాజానికి మంచి చేస్తున్న ఆమె కంటే పెద్ద వీఐపీ ఇంకెవరుంటారు..? అయితే.. ఆమెకు స్నానం చేయించి.. ఒక జత కొత్త బట్టలు ఇచ్చి.. ఒక చిన్న ఆశ్రయం కూడా కల్పించి ఉంటే.. ఇంకా గొప్పగా ఉండేది. అయినా.. సుంకమ్మకు ఆ గౌరవం ఇచ్చిన ఆ వ్యక్తిని మాత్రం మనస్పూర్తిగా అభినందించాల్సిందే.
