Andhra: అలర్ట్.. ఏపీలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ టైఫస్ కేసులు.. ఈ కీటకంతో జాగ్రత్తగా ఉండాల్సిందే..
మొదట విజయనగరంపై విరుచుకుపడ్డ స్క్రబ్ టైఫస్ ఇప్పుడు ఏపీ మొత్తాన్ని గడగడలాడిస్తోంది...! కేసుల మీద కేసులు పెరుగుతుండటమే కాదు... మరణాలూ ఆందోళన కలిగిస్తున్నాయి. మరీ స్ర్రబ్ టైఫస్ కట్టడికి అధికారులు ఏం చేస్తున్నారు...? అటు అధికారులకు ఇటు ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సూచనలేంటి...? అసలు ఏపీకి స్ర్కబ్ టైఫస్ టెన్షన్ ఇంకెన్నాళ్లు...?

మూడేళ్ల కిందట ఢిల్లీ, తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ ఇప్పుడు ఏపీని వణికిస్తోంది. ఇప్పటికే.. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాల్లో కేసులు బయటపడ్డాయి. విశాఖలో రెండు నెలల్లో 43 పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించి విశాఖ కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్‌లో ప్రైమరీ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో… కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో కొత్త కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు… మరణాలు సంభవిస్తుండటం తెగ టెన్షన్ పెడుతోంది.
మొన్ననే పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్‌తో ఇంటర్ విద్యార్థిని జ్యోతి మరణించగా… లేటెస్ట్‌గా మరొకరు మృతిచెందారు. గుంటూరు GGHలో స్క్రబ్ టైఫస్ చికిత్స పొందుతూ ధనమ్మ అనే వృద్దురాలు మరణించింది. తీవ్ర జ్వరం, విరేచనాలతో గత నెల 18న ఆస్పత్రిలో చేరిన ధనమ్మకు అప్పట్నుంచి చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఆమె ప్రాణాలు నిలబెట్టేందుకు డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు. చివరకు ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. విజయనగరంలోనూ మూడు రోజుల క్రితం మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది.
ఇక లేటెస్ట్‌గా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో రెండు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. అనారోగ్యంతో ఇందిరా కాలనీకి చెందిన అమరేశ్వరి ఆస్పత్రిలో చేరింది. ఇటు పామర్రులోని కోరముక్కువారిపాలెంకు చెందిన మానస అనే మరో మహిళ కూడా జ్వరంతో బాధ పడుతోంది. గుడ్లవల్లేరులో రక్త పరీక్షలు చేయగా స్క్రబ్ టైఫస్ అని నిర్ధారించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
అలాగే ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య నాలుగు అయ్యింది. ఫలితంగా డాక్టర్లు అప్రమత్తం అయ్యారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..
ఇప్పటికే దోమలు తెగ కుట్టేస్తున్నాయ్. సందట్లో సడేమియాల్లా ఇలాంటి స్ర్కబ్ వైరస్‌లు వచ్చేస్తున్నాయ్. సో… మరో రెండు మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే.
నల్లిని పోలిన కీటకం కుట్టడంతో స్కబ్ టైఫస్ వ్యాధి సోకుతందని డాక్టర్లు పేర్కొంటున్నారు. కుట్టిన చోట దద్దుర్లు, నల్లటి మచ్చలు ఏర్పడం, జ్వరం, వాంతులు,తల, ఒంటి నొప్పులు, పొడి దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది..
మరీ ముఖ్యంగా గ్రామీణప్రాంతాల ప్రజలు ఈ కీటకాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కీటకం చిన్నదే కావచ్చు.. కానీ దాని ప్రభావం ఒక్కోసారి ప్రాణాలమీదికి తెస్తుంది.
అలాగని జ్వరం రాగానే అదేనేమో అని భయపడాల్సిన పన్లేదు. అదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగానూ ఉండొద్దు. ఎందుకంటే ఇది ఫీవర్ సీజన్. బీఅలర్ట్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




