Ongole: 12 ఏళ్లు ప్రేమని తిరిగాడు.. చివరికి ఆ ఒక్క మాట చెప్పి తప్పుకున్నాడు.. ఆ యువతి మనసు కకావికలమై..
సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ప్రేమించినట్టు నటించాడు. 12 ఏళ్లు వెంటపడి నమ్మబలికాడు. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోన్న ఒంగోలు యువతికి.. నీవు లేక నేను లేను అని నాటకం చేశాడు. కానీ పెళ్లి మాట తేలగానే కులం అడ్డుపెట్టాడు.

కామాతురాణం.. న భయం న లజ్జ అన్నారు పెద్దలు… దాన్ని మార్చి ఇప్పుడు ప్రేమాతురాణం న భయం, న లజ్జా అంటున్నారు నేటి ప్రేమికులు. ఈ మాటలు ఈ నకిలీ ప్రేమికుడికి అక్షరాలా సెట్టవుతాయి. సోషల్‌మీడియాలో పరిచయం పెంచుకుని.. ప్రేమిస్తున్నానని వెంటపడి.. 12 ఏళ్లు ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడో ప్రబుద్దుడు బిటెక్ పూర్తి చేసిన ఆ యువతి చివరకు పెళ్లి ప్రస్తావన తేగానే మన కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని మెలిక పెట్టాడు. ఇన్నాళ్లు కలిసి తిరిగి ఇప్పుడు కులం అంటున్నావేంటి…? అంటూ ఆ యువతి కన్నీటి పర్యంతమైంది… చివరకు యువకుడి ఇంటికి వెళ్లి నేరుగా అడిగేసింది… అయితే యువకుడి తల్లిదండ్రులు ఆ యువతిని కులం పేరు చెప్పి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది ఈ విషాద ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది.
ఒంగోలు నగరానికి చెందిన ఓ యువతి (33) ఎంటెక్ చదువుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. తాను చదువుకునే సమయంలోనే 12 ఏళ్ల క్రితం నగరంలోని మహేంద్రనగర్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ప్రేమ పేరుతో యవతి వెంటపడ్డాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యాడు. నీవు లేక నేను లేనంటూ కల్లబొల్లిమాటలు చెప్పి ఆమెను వశపరుచుకున్నాడు. ఇక చదువులు పూర్తయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా పెళ్లి చేసుకోవాలని ఆ యువతి కోరడంతో ఇప్పుటు ప్లేటు ఫిరాయించాడు శ్రీనివాస్. మన ఇద్దరి కులాలు వేరుకావడంతో మా ఇంట్లో ఒప్పుకోవడం లేదంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. శ్రీనివాస్ నిజస్వరూపం బయటపడటంతో నిర్ఘాంతపోయిన ఆ యువతి తన వెంట ఇన్నేళ్లు ఎలా తిరిగావంటూ ప్రశ్నించింది. శ్రీనివాస్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నేరుగా అతని ఇంటికి వెళ్లింది. శ్రీనివాస్ తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి చెప్పి 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న తమను కులం పేరుతో విడదీయవద్దని వేడుకుంది. అయితే శ్రీనివాస్ తల్లిదండ్రులు కూడా కులం ప్రస్తావన తేవడంతో ఆ యువతి హతాశయురాలు అయింది. ఇన్నాళ్లు ప్రేమించి, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని కోరిన వెంటనే కులం ఎలా గుర్తుకువచ్చిందని నిలదీసింది. అయినా శ్రీనివాస్, అతని తల్లిదండ్రుల నుంచి స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంటికి వచ్చేసింది. తాను చనిపోతున్నట్టు సూసైడ్ నోట్ రాసి మంచం పక్కన పెట్టుకొని చీరతో ఇంటి దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె మరణానికి ప్రేమపేరుతో మోసం శ్రీనివాస్ కారణమని ఆ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
