Telangana: సాధారణంగా కనిపించే సత్తయ్య.. ఓ అసాధారణ మనిషి..
జగిత్యాల జిల్లా, ఇటిక్యాల గ్రామంలో ఇంటర్మీడియెట్ వరకే చదువుకున్న సుంకిసాల సత్తయ్య ప్రకృతిపై ప్రేమతో గ్రామానికే పచ్చదనం ఉట్టిపడేలా గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తి. చెట్లు కూడా మనలాంటి జీవులే.. అని చెప్పే సత్తయ్య జీవితం, పర్యావరణం పట్ల మనలో మళ్లీ ఆలోచన రేకెత్తించేలా ఉంటుంది.

ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన సత్తయ్య కొన్నేళ్ల తరువాత గ్రామానికి తిరిగివచ్చేసరికి తన మనసును కలిచివేసిన దృశ్యం ఎదురైంది. తాను ప్రేమగా పెంచుకున్న అనేక పచ్చని చెట్లు వివిధ కారణాలతో నరికివేశారు. ఆ దృశ్యం చూసి సత్తయ్య తీవ్రంగా బాధపడ్డాడు. అతని బాధను చూసి పలువురు చెట్లు కొట్టేస్తే ఏమైంది? చెట్టు మనిషి కాదు కదా.. అని ప్రశ్నించారు. వెంటనే సత్తయ్య ఇచ్చిన సమాధానం గ్రామాన్ని ఆలోచింపజేసింది. మనిషి తప్పుచేసే అవకాశం ఉంది… కానీ చెట్టు ఎప్పుడూ తప్పు చేయదు. అది ఇస్తుందే గానీ తీసుకోదు. అలాంటి చెట్టును నరికితే ఎవరికైనా బాధ కలగాలి అని వారికి క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చాడు.
చెట్లు నరికివేశారు అంటే వాటి లైఫ్ టైం అయిపోయిందిలే అని చాలామంది భావిస్తున్నా.. సత్తయ్య మాత్రం చెట్లు బతకాలి.. బ్రతికించాలి అనే సంకల్పం తీసుకున్నాడు. గ్రామంలోని రైతులు, దాతలు, పెద్దలనుఒక్కొక్కరిని కలిసి, చెట్లను కొత్త ప్రదేశానికి తరలించే ట్రీ ట్రాన్స్‌లొకేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. వాగు పక్కన ఒక ఎకరం భూమిని సిద్ధం చేశాడు. గ్రామంలో నరికివేతకు గురైన 40 పెద్ద చెట్లను అక్కడికి తరలించారు. అక్కడే వాటిని మళ్లీ ప్లాంటేషన్ చేశాడు. అందులో సుమారు 30 చెట్లు మళ్లీ పచ్చగా పెరిగి జీవం పొందాయి. తెలంగాణలో గ్రామస్థాయిలో ఇంత పెద్ద స్థాయిలో చేపట్టిన ట్రాన్స్‌లొకేషన్ ఇది మొదటిసారి కావడం విశేషం. తనకు సహాయం చేసిన చెన్నమనేని హిమవంతరావు, కాటిపల్లి నారాయణరెడ్డి, కొక్కు శేఖర్, కొమ్ముల రాధ, సింగని వీరేందర్ తదితరుల పేర్లను ప్రతి చెట్టుకు బోర్డుపై రాయించి వారి సేవను శాశ్వతం చేశాడు.
ప్రతి పండగకు మొక్కలు నాటే సంప్రదాయం…
సత్తయ్య కృషి చెట్లను బతికించడం వరకే ఆగలేదు. మొక్క నాటటం పచ్చదాన్ని పెంపొందించడం ప్రతి మనిషి బాధ్యత అనే భావనతో గ్రామవ్యాప్తంగా భారీ ఉద్యమం మొదలు పెట్టాడు. గ్రామంలో ఇప్పటి వరకు 8 వేల మొక్కలను నాటించాడు. సంక్రాంతి నుంచి బతుకమ్మ వరకు ఏ పండగ అయినా ఇటిక్యాలలో మొదట జరిగేది మొక్కలు నాటడమే. పిల్లలు, యువత, రైతులు అందరూ మొక్కల నాటడాన్ని ఒక ఆచారంలా స్వీకరించేలా సత్తయ్య తీసుకొచ్చిన మార్పు గ్రామాన్ని పూర్తిగా పచ్చగా మార్చింది.
ఇటిక్యాల గ్రామం పచ్చదానికి నిలువెత్తు నిదర్శనం…
ఒక సాధారణ వ్యక్తి పట్టుదలతో చెట్లు, ప్రకృతి, పర్యావరణం కోసం ఎలా పోరాడగలడో సత్తయ్య చూపించాడు. చెట్లను బతికించడం నుండి పచ్చ సంప్రదాయాన్ని నెలకొల్పడం వరకు అతని కృషి నేడు గ్రామానికి గుర్తింపుగా నిలుస్తోంది. సాధారణ మనిషి అసాధారణ కృషి చేయడం పట్ల గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
