Telangana: చూశారా ఈ చిత్రం.. విద్యార్థి ఇంటి ముందు టీచర్ల ధర్నా.. ఎందుకంటే..?
బడికి వస్తావా.. మమ్మల్ని ఇంటికి రమ్మంటావా? డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు భద్రాచలం ITDA టీచర్లు ఆందోళన ఫార్మూలాతో రోడ్డెక్కారు. ఓ స్టూడెంట్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. విద్యా హక్కును పరిరక్షించడం, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అందించడం తమ భాద్యతని తెలియజేయడం కోసమే ఇలా చేశామని ఉపాధ్యాయులు రవి తెలిపారు.

భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో ఒక విద్యార్థి బడికి రావడంలేదని టీచర్లు రోడ్డెక్కారు. స్థానిక గిరిజన పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి స్టూడెంట్ నక్క మనోవరుణ్ వారం పాటుకు బడికి డుమ్మా కొట్టాడు. టీచర్లు అతని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. రెగ్యులర్‌గా బడికి పంపాలని రిక్వెస్ట్ చేశారు. రోజు టీచర్లు ఆ పిల్లాడి ఇంటికి వెళ్లడం..బడికి పంపమని చెప్పడం జరుగుతుందే కానీ.. మనోవరుణ్ మాత్రం బడిబాట పట్టలేదు. వాడికి చదువుకోవాలనే ఉంది. కానీ ఇంట్లో వాళ్లు పంపడంలేదని గమనించారు టీచర్లు. పిల్లాణ్ని బడికి పంపిస్తారా? లేదా? అని గట్టిగానే అడిగారు. బడిలో చదువుకోవాల్సిన పిల్లలను పనికి పంపిస్తే చట్టరంగా చర్యలుంటాయని అర్ధమయ్యేలా చెప్పారు. ఐనాకానీ ఆ పేరెంట్స్ లో మార్పు కన్పించలేదు. ఇక మాటలతో ప్రయోజనం లేదనుకున్న టీచర్లు.. మిగతా స్టూడెంట్స్‌ను తీసుకెళ్లి మనోవరుణ్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. పిల్లాడి భవిష్యత్ కోసం టీచర్లు పడుతున్న శ్రమను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. టీచర్లకు అండగా నిలిచారు. మొత్తానికి మనోవరుణ్‌ను బడికి పంపిస్తామని అతని తల్లిదండ్రులు చెప్పడంతో ధర్నా విరమించారు. పిల్లల్ని బడిబాట పట్టించడం కోసం ఐటీడీఏ అధికారులు, టీచర్లు చేస్తున్న కృషిని అభినందించారు స్థానికులు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
