Yadadri Temple: యాదగిరి నరసన్న భక్తులకు గుడ్ న్యూస్..
ప్రజల ఇలవేల్పుగా ఉన్న సంభోద్భవుడు.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు గుడ్ న్యూస్. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. మారుమూల ప్రాంతాల్లోని సామాన్య భక్తులు ఇంకా స్వామివారి చెంతకు రాలేకపోతున్నారు. సామాన్య భక్తుల కోసం యాదగిరిగుట్ట దేవస్థానం ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతోంది. ఆ కార్యక్రమం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ప్రధాన ఆలయం ఉద్ఘాటన తర్వాత భక్తుల కొంగు బంగారమైన నృసింహ స్వామి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కోరిన కోరికలు తీర్చే యాదగిరి శ్రీలక్ష్మీ నృసింహుడికి కల్యాణాలు.. ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. విదేశాల్లోనీ ఎన్‌ఆర్‌ఐలు, స్వామివారి భక్తుల కోసం యాదగిరీశుడి కల్యాణోత్సవాలు, వివిధ పూజాది కార్యక్రమాలను దేవస్థానం నిర్వహించేది. తొలిసారిగా 2016లో తెలంగాణ ఆటా ఉత్సవాల్లో అమెరికాలోని మెచిగాన్‌లో శ్రీస్వామి వారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఆ్రస్టేలియా, కెనడా, ఓమాన్, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటి దేశాల్లో శ్రీస్వామి వారి కల్యాణోత్సవాలు, వివిధ పూజలు నిర్వహించారు.
స్వామివారి ప్రత్యేక రథం..
మారుమూల ప్రాంతాల నుంచి సామాన్య భక్తులు యాదగిరికొండకు ఇంకా రాలేకపోతున్నారు. దీంతో సామాన్య భక్తుల చెంతకే భగవంతుడిని తీసుకువెళ్లాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. తమ ఇష్ట దైవాన్ని కనులారా వీక్షించలేని భక్త జనులకు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం.. ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కొంత కాలంగా మరమ్మతులకు నోచుకోని ప్రచార రథంపై ఈవో వెంకట్రావు దృష్టి సారించారు. రథానికి ప్రత్యేక శ్రద్ధతో మరమ్మతులు చేయించి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. పాంచనరసింహుడి వైభవాన్ని చాటి చెప్పడంతో పాటు స్వామివారిని పల్లెలకు తీసుకువెళ్లేందుకు దేవస్థానం ప్రత్యేకంగా రథాన్ని సిద్ధం చేసింది. ఈ స్వామివారి రథం ద్వారా పల్లెల్లో ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం రంగం సిద్ధం చేసింది.
20న నాగర్ కర్నూల్, 27న భూపాలపల్లిలో కళ్యాణోత్సవాలు..
మొదటగా భక్తులు తక్కువ సంఖ్యలో యాదగిరి క్షేత్రానికి వస్తున్న భూపాలపల్లి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ప్రచార రథం ద్వారా శ్రీస్వామి వారి ఆశీస్సులు భక్తులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 20వ తేదీన భూపాలపల్లి, 27వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లాల్లో శ్రీస్వామి వారి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు.
విదేశాల్లో ఉన్న స్వామివారి భక్తులు చెంతకు వెళ్లిన ఏకశిఖర వాసుడిని తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య భక్తుల చెంతకు స్వామి వారిని చేర్చాలని దేవస్థానం భావించింది. తెలంగాణాతోపాటు ఏపీలోనూ స్వామి వారి వైభవాన్ని ప్రచారం చేసే కార్యక్రమాలు చేపట్టలేదు. దీంతో ఈఓ వెంకట్రావ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యాదగిరీశుడి వైభవాన్ని చాటి చెప్పేందుకు చర్యలు చేపట్టారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వైభవాన్ని భక్తులకు తెలియజేసేందుకు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టామని ఆలయ ఈవో వెంకట్రావు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి మారుమూల పల్లెల్లో శ్రీస్వామి వారి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. యాదగిరి క్షేత్రానికి భక్తులను మరింతగా తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని వెంకట్రావు తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
