ఆగ్రాలో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టురట్టు.. తెలంగాణ ఈగల్ టీం ఆపరేషన్‌లో కీలక మలుపు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో భారీ సింథటిక్ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని తెలంగాణ ఈగల్ టీం గుర్తించింది. దాడుల్లో 10 కిలోల మెఫీడ్రిన్ డ్రగ్‌తో పాటు వెయ్యి లీటర్లకు పైగా ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి రా మెటీరియల్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు.

సింథటిక్ డ్రగ్స్ తయారీ కేంద్రాలపై తెలంగాణ పోలీసులు కట్టుదిట్టంగా నిఘా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసుల ప్రత్యేక విభాగమైన ఈగల్ టీం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని గుర్తించి కీలక ఆపరేషన్ నిర్వహించింది. ఈ దాడుల్లో 10 కిలోల మెఫీడ్రిన్ డ్రగ్‌తో పాటు సుమారు వెయ్యి లీటర్లకు పైగా డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేస్తున్న ఐదుగురిని గుర్తించిన ఈగల్ టీం వారిని ఆగ్రా పోలీసులకు అప్పగించింది. ఈ ముఠా రహస్య ప్రాంతాల్లో సింథటిక్ డ్రగ్స్ తయారు చేసి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్టు విచారణలో బయటపడింది. డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను హైదరాబాద్ నుంచి ఆగ్రాకు తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో ఈగల్ టీం నిఘా పెంచింది. దర్యాప్తులో భాగంగా ఎస్సార్ ఇన్నోవేషన్ అనే డ్రగ్ కంపెనీ పేరుతో రా మెటీరియల్ రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. అలాగే ఇండియా మార్ట్ వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా సింథటిక్ డ్రగ్స్ తయారీకి అవసరమైన పదార్థాలను కొనుగోలు చేస్తున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో ఎస్సార్ ఇన్నోవేషన్ సంస్థ డైరెక్టర్ రఫీని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని నుంచి లభించిన సమాచారంతో ఆగ్రాలోని డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఈగల్ టీం గుర్తించింది.
విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగించినట్టు తెలిసింది. సింథటిక్ డ్రగ్స్ తయారీకి అవసరమైన 15 రకాల ముడి పదార్థాలను హైదరాబాద్‌లో కొనుగోలు చేసి, షాద్‌నగర్‌లోని ఓ గోదాంలో నిల్వ చేసినట్టు అధికారులు గుర్తించారు. నెల రోజుల క్రితం షాద్నగర్‌లోనే సుమారు 6 కోట్ల రూపాయల విలువైన 25 కిలోల మెఫీడ్రిన్ డ్రగ్ తయారు చేసినట్టు ఈగల్ టీం తెలిపింది. అయితే పోలీసులు నిఘా పెంచడంతో అక్కడి డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని మూసివేసి ముఠా ఆగ్రాకు మారినట్టు సమాచారం. డ్రగ్స్ తయారీ కోసం ఆగ్రాకు చెందిన కెమిస్ట్రీ టీచర్ మనోజ్ కుమార్ సహాయం తీసుకున్నట్టు కూడా విచారణలో బయటపడింది. ప్రస్తుతం డ్రగ్స్ తయారీకి సంబంధించిన నిందితులు శిశుపాల్, మనీష్, రాజు, రఫీతో పాటు మరికొందరు ఆగ్రా పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సుమారు మూడు కోట్ల రూపాయల విలువ చేసే 10 కిలోల మెఫీడ్రిన్ డ్రగ్‌ను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. దేశవ్యాప్తంగా వ్యాపించిన ఈ సింథటిక్ డ్రగ్స్ నెట్వర్క్‌పై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
