75 ఏళ్ల నిస్వార్థ సేవకు ఘన నివాళి.. అట్టహాసంగా ప్రముఖ్ వర్ణి అమృత్ మహోత్సవ్.. పాల్గొన్న అమిత్ షా
ప్రముఖ్ స్వామి మహారాజ్ 75 ఏళ్ల నిస్వార్థ సేవకు ఘన నివాళిగా BAPS ప్రముఖ్ వర్ణి అమృత్ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అహ్మదాబాద్ జరిగిన వేడుకలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం భూపేంద్రపటేల్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక నాయకత్వం, వినయం, కరుణకు ఆయన జీవితం ఆదర్శం. ఈ ఉత్సవం ద్వారా ఆయన అందించిన సేవలు, బోధనలు అందరినీ స్ఫూర్తినిచ్చాయి.

BAPS స్వామినారాయణ సంస్థ ప్రముఖ్ స్వామి మహారాజ్ నిస్వార్థ సేవకు, దైవిక లక్షణాలకు నివాళిగా నిర్వహించిన ప్రముఖ్ వర్ణి అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుక అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ ఈవెంట్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ చారిత్రక కార్యక్రమానికి BAPS RSS అధ్యక్షుడు పూజ్య మహంత్ స్వామి మహారాజ్, కేంద్ర హోంమంత్రి అమిత్, గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
75 ఏళ్ల సేవకు అద్భుత నివాళి
1950లో బ్రహ్మస్వరూప్ శాస్త్రిజీ మహారాజ్, ప్రముఖ్ స్వామి మహారాజ్‌ను జీవితాధ్యక్షుడిగా నియమించిన చారిత్రాత్మక ఘట్టానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుక పూజ్య ప్రముఖ్ స్వామి మహారాజ్ అవిశ్రాంత సేవ, వినయం, కరుణ, కులం, మతం, రంగు, హోదా తేడా లేకుండా అందరి సంక్షేమం కోసం ఆయన చేసిన కృషికి హృదయపూర్వక నివాళిగా నిర్వహించారు. అధ్యక్షుడిగా నియమితులైన రోజున కూడా ఆయన వ్యక్తిగతంగా పాత్రలు కడిగి సేవ చేయడం, ఆయన నిబద్ధతకు అసాధారణ నిదర్శనంగా నిలిచింది.
కార్యక్రమం విశేషాలు
వేదికను ప్రత్యేకంగా అలంకరించారు. ప్రముఖ్ స్వామి మహారాజ్ బాధ్యతలు స్వీకరించిన అంబ్లివాలి పోల్ నుండి, ఆయన మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక కేంద్రమైన ఢిల్లీ అక్షరధామ్ వరకు ఆయన ప్రయాణాన్ని ప్రదర్శించారు. రామాయణం, భగవద్గీత వంటి గ్రంథాలలో చెప్పబడిన సాధువు లక్షణాలను వర్ణించే 75 ప్రత్యేక ఫ్లోట్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దాదాపు 50,000 మంది భక్తులు మహంత్ స్వామి మహారాజ్ సమక్షంలో ఒకేసారి హారతిలో పాల్గొన్నారు. కాగా ఆధ్యాత్మిక ఫ్లోట్‌లఅను డిసెంబర్ 9 వరకు అటల్ బ్రిడ్జి, సర్దార్ బ్రిడ్జి మధ్య ప్రదర్శిస్తారు.
విశిష్ట అతిథుల ప్రసంగాలు
ప్రముఖ్ స్వామి మహారాజ్ భక్తి, సేవను అద్భుతంగా మిళితం చేశారని అమిత్ షా అన్నారు. సనాతన ధర్మం, సమాజం ఎదుర్కొంటున్న క్లిష్ట సమయాల్లో ఆయన ఒక మార్గదర్శి అయ్యారని కొనయాడారు. ఆయన పని అన్ని వర్గాలకు ఆదర్శప్రాయమైనదని చెప్పారు. ప్రముఖ్ స్వామి మహారాజ్ తొమ్మిది దశాబ్దాలుగా మానవ సేవ కోసం కృషి చేశారని, ఈ మహోత్సవం నిజంగా ప్రజల వేడుక అని సీఎం భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు.
మహంత్ స్వామి మహారాజ్ సందేశం
ప్రముఖ్ స్వామి మహారాజ్ జీవితంలోని ప్రతిక్షణం ఇతరులకు సేవ చేయడానికే అంకితం అయింది అని మహంత్ స్వామి మహరాజ్ సందేశం ఇచ్చారు. మనం సంతోషంగా ఉండాలంటే, మన తప్పులను సరిదిద్దుకోవాలి, ఇతరుల తప్పులను క్షమించాలి అని సూచించారు. ఈ వేడుక ప్రముఖ్ స్వామి మహారాజ్ జీవితంలోని వినయం, భక్తి, నిస్వార్థ సేవ వంటి గొప్ప విలువలను అనుసరించడానికి అందరినీ ప్రేరేపించింది.




