భారీగా ఎగిసిపడిన మంటలు.. కాలి బూడిదైన 10 పడవలు.. అసలు ఏం జరిగిందంటే..?
కొల్లం జిల్లా అష్టముడి సరస్సులో భారీ అగ్నిప్రమాదం సంభవించి పదికి పైగా ఫిషింగ్ బోట్లు బూడిదయ్యాయి. ఒక పడవలో సిలిండర్ పేలుడుతో మంటలు చెలరేగాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారీ అగ్నిప్రమాదం పదికి పైగా పడవలను బూడిద చేసింది. ఉన్నట్లుండి చెలరేగిన మంటలతో బోట్లన్నీ దగ్ధమయ్యాయి. కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని అష్టముడి సరస్సులో లంగరు వేసిన పదికి పైగా ఫిషింగ్ బోట్లు ఒక పెద్ద అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఒక పడవలో సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని, భారీ ఎత్తున మంటలు చెలరేగాయని ప్రాథమిక నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ అగ్నిప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. అయ్యంకోవిల్ ఆలయానికి సమీపంలోని కురీపుళ చర్చి సమీపంలో తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు అధికారులు చెబుతున్నారు.
ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్‌కు చెందిన ఆరు యూనిట్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఉదయం 7 గంటల నాటికి మంటలను అదుపులోకి తెచ్చాయి. భారీ అగ్నిప్రమాదంపై జరిగిన నష్టంపై పూర్తిస్థాయి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. పడవలు అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని యజమానులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా అస్పష్టంగానే ఉందని అధికారులు తెలిపారు.




