Call Merging Scam: గుబులు పుట్టిస్తున్న కాల్ మెర్జింగ్ స్కాం.. ఇలాంటి కాల్ మీకు ఫోన్‌కు వస్తే బీ కేర్‌ఫుల్
కాల్ మెర్జింగ్ స్కామ్... సైబర్ నేరాల్లో ఇప్పుడు ఇది అందరినీ భయపెడుతోంది. ఫ్రెండ్ నెంబర్ ఇచ్చాడంటూ మీకు కాల్ చేసి బ్యాంక్ ఓటీపీ తెలుసుకుని డబ్బులు కాజేస్తున్నారు. అసలు ఈ స్కాం ఎలా చేస్తారు..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాల్లోకి వెళ్తే..

Cyber Attack: ఇటీవల సైబర్ నేరాలు కొత్త పంథాలో జరుగుతున్నాయి. చదువుకున్నవారు కూడా సైబర్ మోసాల బారిన పడుతున్నారు. సైబర్ క్రిమినల్స్ ఏదోక కొత్త పద్దతిలో అనుమానమనేదే రాకుండా స్మార్ట్‌గా మోసం చేసేస్తున్నారు. చివరికి మోసపోయాకగానీ సైబర్ నేరగాళ్ల చేతిలో బలయ్యామని తెలుస్తోంది. అంత తెలివితో జనాలను బురిడీ కొట్టించి కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. మోసపోయాక బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండగా.. అప్పటికీ లాభం లేకుండా పోతోంది. నేరం జరిగాక వెంటనే గోల్డెన్ అవర్స్‌లో పోలీసులను ఆశ్రయిస్తే లాభం ఉంటుందని, డబ్బులు తిరిగి రాబట్టుకోవచ్చని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
కాల్ మెర్జింగ్ స్కాం అంటే..
ఇప్పుడు కాల్ మెర్జింగ్ స్కాం బారిన చాలామంది పడుతున్నారు. ఒక తెలియని వ్యక్తి మీకు కాల్ చేసి మీ ఫ్రెండ్ నుంచి నెంబర్ తీసుకున్నానని చెబుతాడు. అదే టైమ్‌లో మీ ఫ్రెండ్ కూడా వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని చెప్పి ఇద్దరి కాల్స్‌ను మెర్జ్ చేయమని అడుగుతాడు. మీరు ఇది నిజమేనని కాల్ మెర్జ్ చేస్తే.. ఇక మీ పని ఖతమే. ఇలా చేయగానే సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ధ్రువీకరణకు అవసరమైన ఓటీపీ కాల్‌తో కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత బ్యాంక్ కాల్ నుంచి వచ్చే ఓటీపీని సేకరించి మీ అకౌంట్లోని డబ్బులు కాజేస్తారు.
క్షణాల్లోనే డబ్బులు మాయం
ఈ పద్దతిలో నిమిషాల్లోనే మీకు ఎలాంటి అనుమానం రాకుండా అకౌంట్లోని డబ్బులు స్వాహా చేస్తారు. ఇలాంటివారి బారిన పడకుండా ఉండాలంటే ఓటీపీ ఎవరితోనూ పంచుకోకూడదు. మీకు అనుమానం వస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. లేక బ్యాంక్ ప్రతినిధులను సంప్రదించాలి.దీని వల్ల మీ డబ్బులు వెంటనే తిరిగి పొందే అవకాశం ఉంటుంది.




