MLC Kavitha: భారీ భద్రత మధ్య ఈడీ ముందుకు కవిత.. ప్రారంభమైన ‘లిక్కర్ స్కామ్’ విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత పిడికిలి బిగించారు. లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణలో భాగంగా ఢిల్లీ చేరుకున్న కవితను ఈడీ జాయింట్ డైరెక్టర్..
పిడికిలి బిగిసింది – పట్టుదల ఎగిసిపడింది. విప్లవవాదం, సంఘీభావానికి చిహ్నం పిడికిలి బిగించడం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత పిడికిలి బిగించారు. లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణలో భాగంగా ఢిల్లీ చేరుకున్న కవితను జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు అధికారుల టీమ్ ప్రశ్నిస్తోంది. అంతకముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన కవిత ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి సరిగ్గా 11 గంటలకు బయలుదేరి- అక్కడి నుంచి సరిగ్గా 1 కిలో మీటరు దూరంలోని ఈడీ ఆఫీసుకు 11. 08 గంటలకు చేరుకున్నారు. ED ఆఫీసులోకి ఒంటరిగా వెళ్లిన కవిత అక్కడ కూడా పిడికిలి బిగించి అభివాదం చేశారు. ఆ వెంటనే చేయి ఊపి ఈడీ ఆఫీసు లోపలికి వెళ్లారు. మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించినా ఆమె మాట్లాడకుండా వెంటనే లోనికి వెళ్లారు. పిడికిలిలో పట్టుదల కనిపించినా ఆమె ముఖంలోఒకింత దిగులు కనిపించింది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి తరలివచ్చిన ఆమెకు సంఘీభావం ప్రకటించారు. అక్కడ పిడికిలి బిగించి కార్యకర్తలకు అభివాదం చేసి కవిత ఈడీ ఆఫీసుకు బయలుదేరారు. కారులో కూర్చున్నంత సేవు కూడా ఆమె పిడికిలి బిగించి కనిపించారు.
అయితే ఈడీ ఆఫీసుకు వెళ్తున్న క్రమంలో కవిత భర్త అనిల్‌తో పాటు న్యాయవాదులు కూడా ఆమెతో ఉన్నారు. మరోవైపు కవిత ఈడీ విచారణపై ఢిల్లీలో నిరసన పెల్లుబికింది. బీజేపీలో చేరితే కేసులన్నీ మాయమంటూ ఫోటోలు వెలిశాయి. ‘కవితక్కా సంఘర్ష్ కరో.. హమ్ తుమారా సాత్ హై’ పేరుతో ఫ్లెక్సీలు కనిపించాయి. ‘ట్రూకలర్స్ నెవర్ ఫేడ్.. బైబై మోదీ’ అన్న పోస్టర్లతో ఢిల్లీ వీధులు నిండిపోయాయి. అలాగే కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు మంతనాలు ముమ్మరం చేశారు. న్యాయనిపుణులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. కవితకు సంఘీభావంగా బీఆర్‌ఎస్ మంత్రులతోపాటు పలుపార్టీల నేతలు తరలివస్తున్నారు. కవితకు అండగా నిలిచేందుకు మహిళలు వందలాదిగా చేరుకుని ధైర్యం చెప్పారు. కవితక్క నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది.
ఇటు పోలీసులు.. అటు బీఆర్ఎస్ శ్రేణుల మోహరింపుతో కేసీఆర్ నివాసం దగ్గర ఉద్రిక్తత పెరిగింది. కార్యకర్తలను నిలువరించేందుకు ఈడీ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లతోపాటు ఈడీ ఆఫీసు చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇంకా ర్యాలీలు, ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని తేల్చిచెప్పిన ఢిల్లీ పోలీసులు.. గుంపులుగా రావొద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ మైక్‌లో హెచ్చరిస్తున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది.
కాగా, లిక్కర్ స్కాంలో మొత్తం 9మందిని ఈ రోజు ప్రశ్నించేందుకు సిద్ధమైంది ఈడీ. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న మనీశ్ సిసోడియా, అరుణ్‌పిళ్లై, కవితతోపాటు మరో ఆరుగురిని అధికారులు విచారించనున్నారు. వీరిని విడివిడిగా ఓసారి.. అందరినీ కలిపి మరోసారి ప్రశ్నించనుంది. అయితే తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన కవితకు మద్దతుగా ఢిల్లీకి వచ్చామన్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కవితకు యావత్ తెలంగాణ సమాజం అండగా ఉంటుందన్నారు. BRSను ఎదుర్కొనే సత్తా లేకనే కేంద్రం.. ఈడీ దాడులకు పాల్పడుతోందన్నారు బీఆర్‌ఎస్ ఎంపీ వెంకటేశ్. వేలకోట్లతో దేశాన్ని దోచుకున్నవారిని ప్రోత్సహించడం స్కాం కాదా అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆరు ఎయిర్‌పోర్టులను అదానీకి కట్టబెట్టడం స్కాం కాదా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..