AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Graduate Election Telangana: తెలంగాణకు ఏం చేసిందని బీజేపీకి ఓటు వేయాలి.. నిలదీసిన ఆర్థిక మంత్రి మంత్రి హరీష్ రావు

MLC Graduate Election Telangana: పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని..

MLC Graduate Election Telangana: తెలంగాణకు ఏం చేసిందని బీజేపీకి ఓటు వేయాలి.. నిలదీసిన ఆర్థిక మంత్రి మంత్రి హరీష్ రావు
Shiva Prajapati
|

Updated on: Feb 28, 2021 | 9:00 PM

Share

MLC Graduate Election Telangana: పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. ‘నీళ్లు, నియామకాలు, నిధులు’ నినాదం నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం సాగగా.. ఆ నినాదాల్లోని అంశాలను సాధించి చూపింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఆదివారం నాడు.. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవి గెలుపు కోరుతూ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని భాగ్యమణి ఫంక్షన్ హాల్‌‌లో టీఆర్ఎస్ నేత సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రజలంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్‌ను రైతులకు అందిస్తున్నామని అన్నారు.

మంత్రి హరీష్ రావు మాటల్లోనే..‘ నారాయణ్‌ ఖేడ్ వెళ్తూ.. పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా గామా తండా వద్ద ఆగాను. అక్కడ‌ సంతోష్ అనే రైతుతో మాట్లాడా. ఆరు గంటల మాత్రమే కరెంటు ఇస్తున్నారు. అది కూడా గంట గంటకు వస్తూ పోతూ ఉందని చెప్పారు. మరి తెలంగాణ లో రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్నాం. ఇలా ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. అక్కడి మహిళలు కరెంటు వస్తే నీటికోసం వేచి ఉన్నామని, కిలో మీటర్ దూరం నుండి మోసుకేళ్లాలన్నారు. కానీ, ఇక్కడ ఇంటింటికి మిషన్ భగీరథ నీరు ఇస్తున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక లో రైతు బీమా, ఆడ పిల్లలకు కల్యాణ లక్ష్మి వంటి పథకాలే లేవు. ఐదు ఎకరాలకు ఆరు వేలు మాత్రమే అక్కడ ఇస్తే, ఇక్కడ 50 వేలు ఇస్తున్నాం. బీజేపీ వాళ్లు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు. వాళ్లకు ఓ బస్సు పెట్టి కర్ణాటక తీసుకెళితే‌ తెలుస్తుంది‌.’ అని చెప్పుకొచ్చారు.

‘ఇక ఉద్యోగాల విషయంలో రాంచందర్ రావు నేనే అసెంబ్లీలో సమాధానం ఇచ్చాను. లక్షా 34 ‌వేల ఉద్యోగాలిచ్చామని ఆధారాలతో సహా చూపించాను. మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సీఎం సన్నాహాలు చేస్తున్నారు. మేం లక్ష ఉద్యోగాలిస్తే బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలి. ఏడాది 2 కోట్లు ఇస్తామని నాడు మోదీ చెప్పారు. ఆ లెక్కన 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఆ 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేస్తామని ప్రధాని మోదీనే బహిరంగంగా ప్రకటించారు. దీని వల్ల ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పోగొడుతున్నారు. ప్రయివేటు పరం చేస్తే రిజర్వేషన్ ఉంటుందా..?’ అని మంత్రి హరీష్ రావు బీజేపీ నేతలను ప్రశ్నించారు.

‘తెలంగాణకు బీజేపీ ఎం చేసిందని ఓటు వేయాలి? ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ఐదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసినందుకు ఓటు వేయాలా..? మొన్నటి బడ్జెట్‌లో తెలంగాణ కు ఎం ఇచ్చారు? ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మెట్రో విస్తరించారు. తెలంగాణకు ఎందుకు బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు? తెలంగాణలో బీజేపీకి ఓట్లు మాత్రమే కావాలి‌. బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది కోతలు, వాతలే. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలోనూ కోతలు పెట్టారు. పెట్రోల్‌,‌ డీజిల్, గ్యాస్ ధరలు‌ పెంచుతూ ప్రజలకు వాతలు పెట్టిన ప్రభుత్వం బీజేపీ. క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గినా.. సెస్‌ల పేరుతో కేంద్రం ప్రజల‌ నడ్డి విరుస్తున్నారు. నల్లధనం తెప్పించి ప్రతీ అక్కౌంట్‌లో రూ. 15 లక్షలు వేస్తామన్నారు ఏమైంది? బీజేపీ ప్రశ్నించాల్సి‌వస్తే కేంద్రాన్ని ప్రశ్నించాలి. గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? వాటి మీద సమాధానం చెప్పి బీజేపీ ఓట్లు అడగాలి. బీజేపీ అబద్దఫు ప్రచారాన్ని తిప్పిగొట్టాలి.’ అంటూ బీజేపీ నేతలపై మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలపై హరీష్ రావు భగ్గుమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నా రెడ్డి పీవీని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి అని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమాన్ని మంత్రి పదవి‌కోసం మధ్యలో వదిలేసిన వ్యక్తి చిన్నా రెడ్డి అని విమర్శించారు. అలాంటి వ్యక్తిని ఎన్నుకుందామా? అని విద్యావంతులను మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బీజేపీ దుష్టప్రచారానికి వాణీ దేవీని గెలిపించడమే సరైన సమాధానం అని హరీష్ రావు పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఇతర ప్రముఖ నేతలు పాల్గొన్నారు.

Also read:

Benefits of Credit Cards: మీరు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా..! అయితే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారో..! లేదో..! చెక్ చేసుకోండి..!

Medaram Jatara 2021: కరోనా ఎఫెక్ట్.. మేడారం జాతరకు తాళం.. సెల్ఫ్ లాక్‌డౌన్ ప్రకటించిన పూజారులు, అధికారులు..