LS Polls: రామనామం జపిస్తున్న ఎమ్మెల్సీ.. బీజేపీ కీ దీటుగా భక్తి భావం!
రామనామము రామనామము రమ్యమైనది రామనామమనే పాట.. ఆ ఎమ్మెల్సీని బాగా ఇంప్రెస్ చేసిందా..? లేక, శ్రీరామాంజనేయ యుద్ధంలో రాముడి కంటే హనుమాన్ స్మరించిన రామనామమే శక్తివంతమైందనే భావనతో.. రామనామాన్ని భుజానికెత్తుకున్నారా..? ఓట్ల వేళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రామభక్తుడిగా అవతరించిన తీరు రాజకీయంగా ఒకింత ఆసక్తికర చర్చకు తెర లేపుతోంది.
రామనామము రామనామము రమ్యమైనది రామనామమనే పాట.. ఆ ఎమ్మెల్సీని బాగా ఇంప్రెస్ చేసిందా..? లేక, శ్రీరామాంజనేయ యుద్ధంలో రాముడి కంటే హనుమాన్ స్మరించిన రామనామమే శక్తివంతమైందనే భావనతో.. రామనామాన్ని భుజానికెత్తుకున్నారా..? ఓట్ల వేళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రామభక్తుడిగా అవతరించిన తీరు రాజకీయంగా ఒకింత ఆసక్తికర చర్చకు తెర లేపుతోంది. రాబోయేవి పార్లమెంట్ ఎన్నికలు. ఇప్పటికే అయోధ్య రామమందిర నిర్మాణం, బాలరాముడి ప్రతిష్ఠతో మరోసారి మోడీ హవా సర్వేల్లో ప్రస్ఫుటమవుతోంది. ఈ క్రమంలో బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఎదుర్కోవడమంటే కచ్చితంగా కత్తిమీద సామే. కానీ, రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన పార్టీగా పోరాటానికి అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేపథ్యంలో.. మరోవైపు సీనియర్ నేతగా తనను అధిష్ఠానం కూడా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిల్చోవాలని కోరుతున్న క్రమంలో.. తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఏర్పడింది.
జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలానికి ఇంకా మూడేళ్లకు పైగా సమయమున్నా.. ఎంపీ అయితే ఢిల్లీ స్థాయిలో.. తనకున్న రాజకీయ అనుభవం దృష్ట్యా పార్టీలోనూ కీలకపాత్ర పోషించొచ్చనే ఒకింత ఆశ కూడా ఉండి ఉండొచ్చు. ఈ క్రమంలో ముల్లును ముల్లుతోనే తీయాలనే వ్యూహం ఏమో.. ఈమధ్య ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రామనామ స్మరణ అందుకున్నారు. జగిత్యాల కోదండ రామాలయంలో పూజలనంతరం.. తానూ రామభక్తుణ్నేనని ప్రకటించుకున్నారు కూడా. అంతేకాదు అయోధ్య అక్షింతల కార్యక్రమంలోనూ పాల్గొనడంతో పాటు.. గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో పలు ఆలయాల చుట్టూ జీవన్ రెడ్డీ ఈమధ్య చేస్తున్న ప్రదక్షిణలు… జగిత్యాలతో పాటు.. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
జీవన్ రెడ్డి పేరు కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి మొదట వినిపించినా.. ఇప్పుడు జీవన్ రెడ్డి ఫోకస్ మాత్రం పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ గా నిజామాబాద్ పైనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ అరవింద్ బీజేపీ నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటుండటంతో.. ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ హవా, బీజేపీ హవాతో పాటు.. పసుపు బోర్డ్ ప్రకటన వంటి అంశాలను తట్టుకోవాలంటే.. తానూ అదే రామనామాన్ని భుజానికెత్తుకుని ప్రత్యర్థికి చెక్ పెట్టాలన్న యోచనో, ఏమో జీవన్ రెడ్డి ఇప్పుడు రాముడిపై ఫోకస్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిల్చేకంటే ముందు తన నామినేషన్ పత్రాలతో ఎప్పుడూ లేనివిధంగా కొండగట్టులో ముడుపులు కట్టి నామినేషన్ వేసిన జీవన్ రెడ్డి.. ఇప్పుడు రామనామ జపాన్ని మరింతగా పఠిస్తుండటం చర్చకు దారి తీస్తోంది. మరోవైపు ఇప్పటికే కొండగట్టు అభివృద్ధికి నడుం బిగించిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత కూడా ఇదే దారిలో ఉండటంతో.. ఇప్పుడు ప్రధాన పార్టీల నేతలకు.. ముఖ్యంగా ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్నవారికి రామనామం జపించక తప్పని అనివార్య పరిస్థితులేర్పడుతున్నాయి.
ఒకవైపు రామనామానికి తామే పేటెంట్ అన్నట్టుగా దూకుడు మీదున్న బీజేపీ నుంచి మరింత దూకుడు కనబర్చే సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్.. మరోవైపు రామనామ స్మరణతో పాటు, కొండగట్టు అభివృద్ధి కోసం పలుమార్లు ఆలయానికి పర్యటించిన బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత.. ఇంకోవైపు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పార్లమెంట్ బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతున్న వేళ జీవన్ రెడ్డి.. ఇలా అంతా.. ఆ రాముణ్నే నమ్ముకుని.. ఆయనపైనే భారం వేయడం ఆధ్యాత్మిక రాజకీయ ఆసక్తికర ఘట్టాలకు తెరలేపుతోంది.