Wyra: ఉప్పు నిప్పులా ఉండే వాళ్లిద్దరూ కలిశారు.. ఒక్కటైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
అవును వాళ్ళిద్దరూ కలిశారు.. ఉప్పు నిప్పులా ఉండే..వారు ఒకటయ్యారు..చేతులు కలిసాయి. వైరా BRSలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్ ఇచ్చారు గులాబీ బాస్. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం మదన్ లాల్ గెలుపు కోసం పని చేస్తానని..త్వరలో నియోజక వర్గంలో కలిసి ప్రచారం చేస్తామని రాములు నాయక్ ప్రకటించారు. ఇటీవల మదన్ లాల్ నిర్వహించిన ర్యాలీలోనూ ఎమ్మెల్యే అనుచరులు అందరూ పాల్గొన్నారు.
వైరా, ఆగస్టు 28: అవును వారిద్దరూ కలిశారు.. ఉప్పు నిప్పులా ఉండే..వీరు ఒకటయ్యారు.. క్యాంపు కార్యాలయంలో ఇద్దరు భేటీ అయ్యి.. చేతులు కలిపారు. వైరా BRSలో ఎప్పుడూ అసమ్మతి ఉంటుంది..మూడు వర్గాలుగా విడిపోయిన ముగ్గురు నేతలు టికెట్స్ కోసం పోటీ పడ్డారు. చివరి వరకు గట్టి ప్రయత్నం చేశారు. 2018 ఎన్నికల్లో BRS తరపున మదన్ లాల్, ఇండిపెండెంట్‌గా రాములు నాయక్ పోటీ చేశారు. రాములు నాయక్‌కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మద్దతు ఇచ్చి గెలిపించారు. ఆ తర్వాత రాములు నాయక్ BRSలో చేరారు. అప్పటి నుంచి..రాములు నాయక్,మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి వర్గాలుగా విడిపోయారు. ఒకే వేదికపై వీరు కలిసింది లేదు. విడిగా ఎవరికి వారే సొంతంగా కార్యక్రమాలు నిర్వహించారు. అధిష్ఠానం నుంచి ఎన్నిసార్లు చెప్పినా..నేతల తీరు మారలేదు.
టికెట్స్ ప్రకటన వరకు తమకే టికెట్ ఇవ్వాలని.. ఆఖరి నిమిషం వరకు ముగ్గురూ ప్రయత్నం చేశారు. కానీ అధిష్ఠానం సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు ఝలక్ ఇచ్చింది. జిల్లాలో సిట్టింగ్‌లు అందరికీ టికెట్స్ ఇచ్చినా.. రాములు నాయక్ కి మాత్రం ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కి ఇవ్వడంతో.. నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారాయి..టికెట్ దక్కక పోవడంతో ఎమ్మెల్యే రాములు నాయక్ అసంతృప్తి వ్యక్తం చేస్తారని భావించినా..ఆయన అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ప్రకటించారు. ఇటీవల మదన్ లాల్ నిర్వహించిన ర్యాలీలోనూ రాములు నాయక్ అనుచరులు, ఆయన వర్గీయులు అందరూ పాల్గొన్నారు
తాజాగా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు వెళ్ళారు. ఇద్దరు భేటీ అయ్యారు.. చేతులు కలిపారు..సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఆయన నిర్ణయం, ఆదేశాల మేరకు పని చేస్తానని రాములు నాయక్ ప్రకటించారు.. నియోజకవర్గంలో BRS గెలవడం తమ లక్ష్యం అని తెలిపారు. త్వరలోనే కలిసి నియోజక వర్గంలో ప్రచారం చేస్తామని ప్రకటించారు. దీనితో ఇరు వర్గాల కేడర్‌లోనూ.. ఈ పరిణామాన్ని ఆసక్తి కరంగా చర్చించుకుంటున్నారు. టికెట్స్ ప్రకటన ముందు..మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న పోటోలు వైరల్ అయ్యాయి.. దీని వెనక ఎమ్మెల్యే రాములు నాయక్ కుట్ర ఉందని.. మదన్ లాల్ వర్గీయులు ఆరోపించారు. టికెట్స్ ప్రకటన ఇద్దరు చేతులు కలిపి… ఒకటి కావడంతో.. ఇంట్రెస్టింగ్‌గా మారింది. కొసమెరుపు ఏంటంటే.. ఇద్దరూ బందువులు కూడా.. ఒకరినొకరు..బావ అని పిలుచు కుంటారు..ఇప్పటి వరకు అయితే ఓకే ఎన్నికల వరకు ఐక్యత ఉంటుందా లేదా చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.