వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది.. దాని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే అవాక్కే..
వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా..? ఇది కేవలం డిజైన్ మాత్రమే కాదు.. దీని వెనుక గొప్ప సైన్స్ ఉంది. ఈ ప్రత్యేక ఆకారం వడకు ఒక సాంస్కృతిక గుర్తింపును ఇచ్చింది. తరతరాలుగా వస్తున్న ఈ వంట రహస్యం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

దక్షిణ భారతీయ అల్పాహారాల్లో వడకు ప్రత్యేక స్థానం ఉంది. వేడివేడి సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో కలిపి తింటుంటే ఆ రుచే వేరు. అయితే వడను గమనిస్తే మనకు మొదట కనిపించేది దాని మధ్యలో ఉండే రంధ్రం. మనం ఎప్పుడైనా ఆలోచించామా, వడకు ఆ రంధ్రం ఎందుకు పెడతారని? అది కేవలం అలంకారం కోసమో లేదా చూడటానికి బాగుంటుందనో చేసే పని కాదు. దాని వెనుక తరతరాల వంటగది అనుభవం, విజ్ఞానం, సైన్స్ దాగి ఉన్నాయి.
సమానంగా ఉడకడం కోసం
వడను మినపప్పు రుబ్బి గట్టి పిండితో చేస్తారు. ఈ పిండి చాలా దట్టంగా ఉంటుంది. ఒకవేళ వడను రంధ్రం లేకుండా ఒక ముద్దలా నూనెలో వేస్తే, దాని పైభాగం త్వరగా వేగి ఎరుపు రంగులోకి వస్తుంది కానీ, లోపలి భాగం మాత్రం పచ్చిగానే ఉండిపోతుంది. వడ మధ్యలో రంధ్రం ఉండటం వల్ల వేడి నూనె ఆ ఖాళీ గుండా ప్రయాణించి, లోపల, వెలుపల ఒకేలా, సమానంగా ఉడికేలా చేస్తుంది.
తక్కువ నూనె.. ఎక్కువ రుచి
వడ ఆకారం వల్ల దాని ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. దీనివల్ల వడ త్వరగా వేగుతుంది. ఫలితంగా అది తక్కువ నూనెను పీల్చుకుంటుంది. బయట వైపు క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఆ విభిన్నమైన టెక్స్చర్ రావడానికి ఈ రంధ్రమే ప్రధాన కారణం. రంధ్రం లేని వడలు ఎక్కువ నూనెను గ్రహించి, తినేటప్పుడు అంత రుచిని ఇవ్వవు.
వంట చేసే విధానంలో సౌలభ్యం
సాంప్రదాయకంగా వడలు వేసేటప్పుడు తడి చేతి మధ్యలో పిండిని ఉంచి, బొటనవేలితో రంధ్రం చేసి నూనెలోకి జారుస్తారు. ఈ పద్ధతి వల్ల వడ ఆకారం చెడిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా వేయించేటప్పుడు గరిటెతో వడను తిప్పడానికి లేదా నూనె నుండి బయటకు తీయడానికి ఈ రంధ్రం వంట చేసే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
ఒక సాంస్కృతిక ముద్ర
కాలక్రమేణా.. ఈ ఆకారం వడకు ఒక ఐడెంటిటీని ఇచ్చింది. డోనట్ లాంటి ఈ ఆకారం కనిపించగానే అది వడ అని ఎవరైనా గుర్తుపట్టేలా ఇది ఒక చిహ్నంగా మారిపోయింది. రోడ్డు పక్కన బండి దగ్గరైనా ఐదు నక్షత్రాల హోటల్ లోనైనా వడ అంటే ఆ రంధ్రం ఉండాల్సిందే..
భారతీయ వంటల్లో ప్రతి చిన్న అంశం వెనుక ఒక ఆచరణాత్మక కారణం ఉంటుంది. రూపం, పనితీరు ఎలా కలిసి ఉండాలో చెప్పడానికి వడ ఒక గొప్ప ఉదాహరణ. కాబట్టి వచ్చేసారి మీరు వడను సాంబార్‌లో ముంచుతున్నప్పుడు, ఆ చిన్న రంధ్రం వెనుక ఉన్న శతాబ్దాల వంటగది విజ్ఞానాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




