ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా..?
మన దగ్గర గంగా, గోదావరి వంటి ఎన్నో నదులు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఒక్క నది కూడా లేని దేశం ఒకటి ఉంది. ఎడారి దేశం అయినప్పటికీ సముద్రపు నీటిని తాగునీరుగా మార్చే సాంకేతికతతో ఆ దేశం ఎలా అభివృద్ధి చెందుతోంది..? అసలు అక్కడ నదులు ఉండకపోవడానికి కారణాలు ఏంటీ..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా మానవ నాగరికతలన్నీ నది తీరాల్లోనే వెలిశాయి. వ్యవసాయం, వాణిజ్యం, సంస్కృతి.. ఇలా ఏదైనా సరే నదులపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ప్రపంచంలో ఒక దేశం మాత్రం ఒక్కటంటే ఒక్క శాశ్వత నది కూడా లేకుండానే అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తోంది. అదేంటో కాదు.. పశ్చిమ ఆసియాలోని అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. సౌదీ అరేబియా భౌగోళికంగా ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం. ప్రపంచంలోని అతిపెద్ద ఇసుక ఎడారులలో ఒకటైన రబ్ అల్-ఖలీ ఇక్కడే ఉంది. ఇక్కడి నేల ఎక్కువగా రాతి, ఇసుకతో కూడి ఉండటం, ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండటం వల్ల నీరు ఉపరితలంపై నిలవదు. ఏడాది పొడవునా వర్షపాతం చాలా తక్కువగా ఉండటంతో శాశ్వత నదులు ఏర్పడే అవకాశం లేకుండా పోయింది.
వాడిలు అంటే ఏమిటి?
సౌదీ అరేబియాలో నదులు లేకపోయినా.. నదుల లాంటి కాలువలు కనిపిస్తాయి. వీటిని వాడిలు అంటారు. భారీ వర్షం కురిసినప్పుడు మాత్రమే ఇవి కొన్ని గంటల పాటు నీటితో కళకళలాడుతాయి. వర్షం ఆగిపోగానే ఇసుకలో కలిసిపోవడం లేదా ఆవిరైపోవడం వల్ల ఇవి ఎండిపోతాయి. అందుకే వీటిని శాశ్వత నదులుగా పరిగణించరు.
నదులు లేకపోయినా నీటి కొరత ఎలా తీరుతోంది?
నదులు లేకపోయినా సౌదీ అరేబియా అద్భుతమైన సాంకేతికతతో నీటి సమస్యను అధిగమిస్తోంది. అందుకోసం ఆ దేశం ప్రధానంగా మూడు పద్ధతులను అనుసరిస్తోంది.
డీశాలినేషన్: సముద్రపు నీటిని తాగునీరుగా మార్చే సాంకేతికతలో సౌదీ అరేబియా ప్రపంచంలోనే అగ్రగామి. భారీ ప్లాంట్ల ద్వారా సముద్రపు నీటిని శుద్ధి చేసి పైప్‌లైన్ల ద్వారా నగరాలకు సరఫరా చేస్తారు.
భూగర్భ జలాలు: వేల ఏళ్లుగా భూమి లోపల నిల్వ ఉన్న నీటిని వ్యవసాయం, పరిశ్రమల కోసం వాడుకుంటున్నారు. అయితే ఇది తరిగిపోయే వనరు కావడంతో ప్రభుత్వం దీనిపై ఆంక్షలు విధిస్తోంది.
వాటర్ రీసైక్లింగ్: నగరాల్లో ఉపయోగించిన మురుగు నీటిని ఆధునిక పద్ధతుల్లో శుద్ధి చేసి తిరిగి తోటలకు, పరిశ్రమలకు వినియోగిస్తున్నారు.
ప్రకృతి సహకరించకపోయినా, అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థలు, టెక్నాలజీతో సౌదీ అరేబియా తన ఉనికిని చాటుకుంటోంది. నదులు లేని దేశంగా ఉన్నప్పటికీ ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవడం గమనార్హం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




