AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె

దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె

Phani CH
|

Updated on: Jan 02, 2026 | 5:24 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో మానవత్వాన్ని మరిచిన కేర్ టేకర్లు దారుణానికి పాల్పడ్డారు. ఐదేళ్లుగా వృద్ధ రైల్వే ఉద్యోగిని, మానసిక వికలాంగురాలైన ఆయన కూతురిని ఆస్తి కోసం చిత్రహింసలు పెట్టారు. సరియైన తిండి, వైద్యం అందక వృద్ధుడు మరణించగా, కూతురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

ఆశ్రయమిచ్చిన వారినే కాటేసిన దుర్మార్గుల కథ ఇది. ఉత్తరప్రదేశ్‌ మహోబా జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘోరం మానవత్వానికే మచ్చగా మారింది. ఇంటి యజమానులనే బందీలుగా మార్చి నరకం చూపించారు కేర్ టేకర్లు. ఐదేళ్లపాటు సాగిన ఈ చిత్రహింసల కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో వెలుగు చూసిన ఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఓంప్రకాష్ సింగ్ రాథోడ్, అతని కూతురి పట్ల ఒక జంట అమానుషంగా ప్రవర్తించింది. 70 ఏళ్ల ఓంప్రకాష్ సింగ్ రాథోడ్.. 2016లో భార్య చనిపోవడంతో మానసిక వికలాంగురాలైన తన కూతురు రష్మిని కళ్లల్లో పెట్టి చూసుకున్నారు. తాను ముందుగా చనిపోతే..తన బిడ్డ అనాథ కాకూడదని తెలిసిన వారి ద్వారా దంపతులను తన ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. వారు.. తనకు, తన బిడ్డకు సాయంగా ఉంటారని భావించాడు. అలా..రాంప్రకాష్ కుష్వాహా, అతని భార్య రాందేవి పనివాళ్లుగా ఆ ఇంట్లో చేరారు. కానీ, ఆయన నమ్మకమే ఆయన పాలిట మృత్యుపాశమైంది. ఓంప్రకాష్ వృద్ధుడు కావటం, ఆయన కూతురు మానసిక వికలాంగురాలు కావటంతో వారిద్దరినీ ఈ దంపతులు కింద ఉన్న గదిలో బంధించి నరకం చూపించారు. పనివాళ్లుగా చేరిన ఆ దంపతులు మాత్రం పై అంతస్తులో విలాసంగా గడిపారు. యజమానులకు ఆహారం, వైద్య సంరక్షణలాంటివేవీ పట్టించుకోలేదు. రాను రాను వారికి తిండీ, నీళ్లు ఇవ్వకుండా వేధించారు. బంధువులు ఎవరైనా చూడటానికి వస్తే.. “ఓంప్రకాష్ మనసు బాగోలేదు. ఆయన ఎవరినీ కలవనని అంటున్నారు. ” అని నమ్మబలికి బంధుమిత్రులను కూడా యాజమానితో కలవనీయకుండా చేశారు. క్రమంగా ఇంటిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. అలా ఐదేళ్ల నుంచి వీరు యజమానుల ఇంట్లో దాష్టీకం సాగించారు. దీంతో నిస్సహాయుడిగా మారిన ఓం ప్రకాష్.. తన బిడ్డ గురించి ఆలోచిస్తూ మనోవేదనకు లోనయ్యాడు. దీనికి తోడు వీరు తిండి, మంచినీరు కూడా ఇవ్వకపోవటంతో ఆయన చిక్కి శల్యమై ఆ గదిలోనే కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న బంధువులు ఇంటికి వెళ్లగా.. అక్కడ అస్తిపంజరంగా మారిన ఓంప్రకాష్ శవం కనిపించటంతో వారు షాక్ అయ్యారు. మరో గదిలో ఆయన కుమార్తె రష్మీ ఎముకలగూడులా మారి.. ఓ చీకటిగదిలో ఉంది. 30 ఏళ్ల రష్మీ 80 ఏళ్ల వృద్ధురాలిగా మారిందని, ఆమె శ్వాస తీసుకుంటుంటే అస్థిపంజరం శ్వాస తీసుకున్నట్లుగా కనిపిస్తోందని బంధువులు వాపోయారు. ఎంతో హుందాగా బ్రతికిన ఆ కుటుంబం ఇలా అవ్వడాన్ని చూసిన స్థానికులు.. కేర్ టేకర్లుగా వచ్చిన జంటే దీనంతటికీ కారణమని అనుమానించి నిలదీశారు. డబ్బు, ఆస్తికోసమే పనివాళ్లుగా వచ్చిన జంట..ఈ దారుణానికి తెగించారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అప్పటికే ఓంప్రకాష్ ఇంటి కరెంట్ కనెక్షన్ ను ఆ జంట.. తమ పేరుమీదికి మార్చుకున్నట్లు గుర్తించారు. నమ్మిన వారిని ఇలా చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. 30 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకునే ఫెసిలిటీ

కలవరపెడుతున్న స్క్రబ్‌ టైఫస్‌..22 మంది మృతి

తేనెటీగకు లీగల్‌ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత

10 రోజులు షుగర్ తినడం మానేస్తే మన శరీరంలో జరిగేది తెలిస్తే

జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది