షుగర్ ఉన్నవాళ్లు బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే షాకే..
బంగాళాదుంపలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మన దేశంలో డయాబెటిస్ విస్తరిస్తున్న నేపథ్యంలో బంగాళాదుంపలు తినడం వల్ల షుగర్ వస్తుందనే అపోహ ఉంది. నిజంగానే బంగాళాదుంపలు తినడం వల్ల డయాబెటిస్ వస్తుం..దా? డయాబెటిక్ రోగులు బంగాళాదుంపలను ఎలా తింటే సురక్షితం? అసలు వాస్తవాలు ఏంటీ..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మన దేశంలో డయాబెటిస్ మహమ్మారిలా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశంలో 100 మిలియన్లకు పైగా డయాబెటిక్ రోగులు ఉండగా, రాబోయే కొన్నేళ్లలో ఈ సంఖ్య 15 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ క్రమంలో చాలా మంది డయాబెటిస్ రాకుండా ఉండాలని బంగాళాదుంపలను ఆహారం నుంచి పూర్తిగా దూరం పెడుతుంటారు. మరి బంగాళాదుంపలు తినడం వల్ల నిజంగానే డయాబెటిస్ వస్తుందా..? దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
బంగాళాదుంపలు తింటే డయాబెటిస్ వస్తుందన్నది నిజమేనా?
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. కేవలం బంగాళాదుంపలు తినడం వల్ల మాత్రమే డయాబెటిస్ వచ్చే ప్రమాదం లేదు. ఇది ప్రజల్లో ఉన్న ఒక పెద్ద అపోహ. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు బంగాళాదుంపలను పరిమితంగా తీసుకోవడం వల్ల ఎటువంటి ముప్పు ఉండదు. అయితే ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం వీటిని తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత గ్లూకోజ్‌గా మారుతాయి. అందుకే బంగాళాదుంపలను హై గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం. అధిక GI ఉన్న ఆహారం తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అందుకే డయాబెటిక్ రోగులు వీటిని తీసుకునే పద్ధతిలో మార్పులు చేసుకోవాలి.
బంగాళాదుంపలను ఎలా తింటే సురక్షితం?
బంగాళాదుంపలను ఆహారం నుంచి పూర్తిగా తీసేయాల్సిన అవసరం లేదని, తెలివిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగాళాదుంపలను ఒంటరిగా తినకుండా.. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పెరుగు, ఆకుకూరలు లేదా పప్పు ధాన్యాలతో కలిపి తింటే చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. ఉడికించిన బంగాళాదుంపలను చల్లారిన తర్వాత తినడం వల్ల వాటిలో రెసిస్టెంట్ స్టార్చ్ పెరుగుతుంది. ఇది చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. నూనెలో వేయించిన చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే.. ఉడికించిన, ఆవిరిపై ఉడికించిన లేదా కాల్చిన బంగాళాదుంపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
బంగాళాదుంపలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
బంగాళాదుంప కేవలం పిండి పదార్థం మాత్రమే కాదు, ఇందులో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి:
పోషకాల గని: ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
గుండె ఆరోగ్యం: పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
జీర్ణక్రియ: ఉడికించిన బంగాళాదుంపలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి.
తక్షణ శక్తి: శారీరక శ్రమ చేసేవారికి మరియు క్రీడాకారులకు ఇది గొప్ప శక్తి వనరు.
చర్మ సౌందర్యం: ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయి.
డయాబెటిస్ ఉన్నవారు బంగాళాదుంపలను పూర్తిగా వదిలేయాల్సిన పనిలేదు. సమతుల్య ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామంతో పాటు తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఇవి ఎంతో మేలు చేస్తాయి. అయితే చిప్స్ లేదా వేపుళ్ల రూపంలో కాకుండా ఉడికించిన రూపంలో తీసుకోవడమే ఉత్తమ మార్గం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




