AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rewind: టాలీవుడ్‌ను వణికించిన 1993 విమాన ప్రమాదం.. చిరంజీవి, బాలయ్య, వెంకీ సహా 60 మంది ఎలా బయటపడ్డారంటే?

సరిగ్గా 33 ఏళ్ల క్రితం టాలీవుడ్ చరిత్రలోనే కాదు, ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే ఒక అద్భుతం జరిగింది. గాల్లో ఎగురుతున్న ఒక భారీ ఎయిర్‌బస్ విమానం ఇంధనం అయిపోయి నేలకూలింది. అందులో ఉన్నది ఒకరిద్దరు కాదు.. ఏకంగా 272 మంది ప్రయాణికులు. కానీ ఆశ్చర్యకరంగా ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. ఆ విమానంలో సామాన్యులతో పాటు టాలీవుడ్ టాప్ స్టార్లు, దిగ్గజ దర్శకులు ఉండటం గమనార్హం. కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలో లేక దైవానుగ్రహమో కానీ.. అంతపెద్ద ప్రమాదం నుంచి వారంతా చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడటం నిజంగా ఒక మిరాకిల్. ఒకవేళ ఆరోజు ఏ చిన్న తేడా జరిగినా టాలీవుడ్ చరిత్ర ఇంకోలా ఉండేదని తలుచుకుంటేనే ఇప్పటికీ వణుకు పుడుతుంది.

Rewind: టాలీవుడ్‌ను వణికించిన 1993 విమాన ప్రమాదం.. చిరంజీవి, బాలయ్య, వెంకీ సహా 60 మంది ఎలా బయటపడ్డారంటే?
Chiranjeevi, Balakrishna, Venkatesh
Praveen Vadla
| Edited By: |

Updated on: Mar 10, 2026 | 8:25 PM

Share

ఈ ఘటన నవంబర్ 15, 1993వ తేదీన జరిగింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ-300 (ఫ్లైట్ నెంబర్ IC-440) విమానం ఉదయం అప్పటి మద్రాస్ నేటి చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఆ ఫ్లైట్‌లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, లేడీ అమితాబ్ విజయశాంతి, హాస్య నటులు అల్లు రామలింగయ్య, సుధాకర్, హీరోయిన్ మాలాశ్రీ ఉన్నారు. వీళ్ళే కాకుండా.. బాపు, కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణరావు లాంటి దిగ్గజ దర్శకులు, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, నిర్మాత కేఎస్ శేఖర్ బాబు, కాస్ట్యూమ్ కృష్ణ సహా పలువురు డ్యాన్స్, ఫైట్ మాస్టర్లు.. ఇలా దాదాపు 60 మందికి పైగా సినీ ప్రముఖులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ విమానంలోనే ప్రయాణిస్తున్నారు.

ప్రమాదం ఎలా జరిగిందనే విషయానికి వస్తే.. ఉదయం 7 గంటల ప్రాంతంలో విమానం హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అయితే దట్టమైన పొగమంచు కమ్మేయడంతో రన్‌వే ఏమాత్రం కనిపించలేదు. దాంతో పైలట్ విమానాన్ని ల్యాండ్ చేయకుండా తిరిగి మద్రాస్‌కు మళ్లించాలని నిర్ణయం తీసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో విమానంలో ఒక సాంకేతిక లోపం టెక్నికల్‌గా చెప్పాలంటే ఫ్లాప్ జామ్ తలెత్తింది. దీనివల్ల విమానాన్ని ఎక్కువ ఎత్తులో, స్పీడ్‌గా నడపలేని పరిస్థితి ఏర్పడింది. తక్కువ ఎత్తులో, తక్కువ వేగంతో ప్రయాణించడం వల్ల విమానంలో ఇంధనం వేగంగా ఖర్చయిపోయింది. మద్రాస్ చేరేలోపే ఇంధనం పూర్తిగా అయిపోతుండటంతో, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ను సంప్రదించారు. కానీ అప్పటికే విమానంలో ఉన్న ఇంధనంతో కనీసం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ను కూడా చేరుకునే పరిస్థితి లేకపోయింది.

క్షణక్షణం ఉత్కంఠ.. విమానం ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదం. పైలట్ భల్లా తన చాకచక్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించి.. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు 14 నాటికల్ మైళ్ల దూరంలో శ్రీకాళహస్తి సమీపంలోని గుండ్లపల్లె అనే గ్రామంలోని ఒక ఎండిపోయిన చెరువు, వ్యవసాయ పొలాల్లో విమానాన్ని ఎమర్జెన్సీ బెల్లీ ల్యాండింగ్ అంటే చక్రాలు లేకుండా విమానం పొట్టభాగంతో ల్యాండ్ చేయడం అన్నమాట.. పైలెట్ అదే చేశాడు. ఆ బురద పొలాల్లో విమానం దాదాపు అరకిలోమీటరు మేర రాసుకుంటూ వెళ్లి.. ఒక పెద్ద శబ్దంతో ఆగిపోయింది. అదృష్టవశాత్తూ విమానానికి ఎలాంటి మంటలు అంటుకోలేదు. భారీ శబ్దం రావడంతో సమీప గ్రామస్తులు, అప్పటి గుండ్లపల్లె సర్పంచ్ దేశిరెడ్డి వెంటనే అక్కడికి చేరుకున్నారు. విమానం ఎమర్జెన్సీ స్లైడ్స్ ద్వారా ప్రయాణికులందరూ కిందకు దిగారు.

ఇవి కూడా చదవండి

ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయంతో వణికిపోతున్న సినీ ప్రముఖులకు గ్రామస్తులు మజ్జిగ, నీళ్లు ఇచ్చి ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ సమయంలో తమ ప్రాణాలు కాపాడిన ఆ ఊరి రుణం తీర్చుకోవడానికి, అక్కడ ఒక ఆసుపత్రి కట్టిస్తామని అప్పట్లో సినీ ప్రముఖులు హామీ ఇచ్చారని.. కానీ అది ఇంకా నెరవేరలేదని ఇప్పటికీ అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. ఆ ప్రమాద సమయంలో ఇండస్ట్రీ మొత్తం ఒకే విమానంలో ఉంది. ఏదైనా జరగరానిది జరిగుంటే మాత్రం కేవలం టాలీవుడ్ చరిత్రలో కాదు.. మొత్తం ప్రపంచ సినీ చరిత్రలోనే మరిచిపోలేని చేదు సంఘటనగా మిగిలిపోయేది. కానీ దేవుడి దయ వల్ల ఎవరికీ ఏ చిన్న గాయం కూడా కాలేదు. ఆరోజు తర్వాత మళ్లీ కొన్ని రోజుల వరకు టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ విమానం ఎక్కలేదంటుంటారు. ఏదేమైనా ఆరోజు పైలట్ సమయస్ఫూర్తి, గ్రామస్తుల సహాయం వల్లే టాలీవుడ్ స్టార్ హీరోలు, వందలాది మంది ప్రయాణికులు మృత్యుంజయులుగా తిరిగి రాగలిగారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us