Aadhaar Card: ఆధార్ కార్డు ఉంటే చాలు.. ప్రతీ నెలా రూ.3 వేల పింఛన్.. కేంద్రం కొత్త స్కీమ్
కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. కొన్ని పింఛన్ పథకాలు అమలు చేస్తోంది. మీరు వృద్దాప్యంలోకి వచ్చాక ఇవి ఉపయోపడతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నెలనెలా పింఛన్ పొందవచ్చు. రోజువారీ కూలీలు, అసంఘటిత రంగంలో పనిచేసేవారి కోసం కేంద్రం ఈ స్కీమ్ అమలు చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు వివిధ వర్గాల కోసం అమలు చేస్తోంది. అందులో భాగంగా కూలీలు, వీధి వ్యాపారులు, చిన్న దుకాణాదారుల కోసం ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా వారికి నెలకు రూ.3 వేల పింఛన్ అందిస్తోంది. ఇది ఒక పింఛన్ పథకం లాంటిది. వృద్దాప్యంలో ప్రభుత్వం తరపున పింఛన్ అందుతుంది. అయితే ఇందుకోసం లబ్దిదారుడు కొంత వాటా చెల్లిస్తే.. ప్రభుత్వం మరికొంత వాటా చెల్లిస్తుంది. అసలు ఈ పథకానికి ఎవరెవరు అర్హులు..? దరఖాస్తు విధానం ఎలా? అనే విషయాలు తెలుసుకుందాం.
ఎవరెవరు అర్హులు
అసంఘటిత రంగంలో పనిచేసేవారి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు రూ.15 వేల వరకు సంపాదించేవారు మాత్రమే దీనికి అర్హులు. ఈపీఎఫ్‌వో లేదా ఇతర పింఛన్ పథకాల్లో లేని అసంఘటిత రంగంలోని కార్మికులు దీనికి అర్హులు.
ఎంత వస్తుంది..?
మీరు ఏ వయస్సులో ఈ పథకంలో చేరుతున్నారు అనే దాని బట్టి మీరు ఎంత చెల్లించాలనేది తెలుస్తుంది. మీరు 18 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.60 చెల్లించాలి. ఇక 40 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మీకు 60 ఏళ్లు వచ్చేంతవరకు కట్టాల్సి ఉంటుంది. ఇక 60 ఏళ్లు దాటిన తర్వాత మీకు నెలనెలా రూ.3 వేలు పెన్షన్ అందుతుంది. మీరు ఎంత చెల్లిస్తే.. అందుకు సమానమైన వాటా కేంద్రం చెల్లిస్తుంది. ఒకవేళ పథకం లబ్దిదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి పింఛన్ అందుతుంది.
దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
మీ సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆఫ్ లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు చెల్లించాల్సిన మొత్తం బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఆ తర్వాత మీకు పెన్షన్ కార్డు అందుతుంది. మీరు క్రమం తప్పకుండా మీ వాటా చెల్లిస్తూ ఉండాలి. ఒకవేళ మధ్యలో ఆపివేస్తే పథకం నుంచి తొలిస్తారు. ప్రస్తుతం ఈ పథకం కింద చాలామంది లబ్ది పొందుతున్నారు. ఇక కొత్తగా చాలామంది ఈ పథకంలో చేరుతున్నారు. అయితే చాలామందికి ఈ కేంద్ర ప్రభుత్వం పథకం గురించి అవగాహన ఉండటం లేదు. దీంతో చాలామంది ఈ పథకాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. దీంతో కేంద్రం కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.
