Hyderabad: పైలట్ అవుదామని కోటి ఆశలతో హైదరాబాద్‌కు.. ట్యూటర్ చేసిన దారుణంతో..
నమ్మకమే మోసంగా మారితే .. అండగా ఉండాల్సిన వారే అగాయిత్యానికి ఒడిగడితే ఆ వేదన వర్ణనాతీతం. హైదరాబాద్‌లోని ఓ ఏవియేషన్ అకాడమీలో అక్షరాలు నేర్పాల్సిన ట్యూటరే, తన వద్ద చదువుకుంటున్న ట్రైనీ పైలట్‌పై కన్నేశాడు. మంచి మార్కులు వేయిస్తానంటూ నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ ఘటన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలో పనిచేస్తున్న ట్యూటర్‌పై లైంగిక ఆరోపణల కేసు నమోదు అయింది. ట్రైనీ పైలట్ అత్యాచారం ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏవిఏషన్ అకాడమీలో ట్యూటర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల నిందితుడు ప్రస్తుతం కేరళలోని తన స్వగ్రామంలో ఉన్నట్లు సమాచారం. బాధితురాలు ఇటీవల పోలీసులను ఆశ్రయించి.. కోర్సులో మంచి మార్కులు రావడానికి సహాయం చేస్తానని చెప్పి తనను మోసం చేసి లైంగిక వాంఛలు తీర్చుకోవాలని ఒత్తిడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అతని పీజీ నివాసంలో ఈ దారుణం జరిగిందని ఆమె తెలిపింది.
గత ఏడాదిలోనే ఈ ఘటన చోటుచేసుకున్నప్పటికీ ఈ వారం మాత్రమే ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కొద్ది నెలల క్రితమే నిందితుడు అకాడమీ ఉద్యోగాన్ని వదిలి కేరళకు వెళ్లిపోయినట్లు బేగంపేట ఇన్‌స్పెక్టర్ తెలిపారు. బాధితురాలు తన ఫిర్యాదులో.. నిందితుడిని తాను అన్నయ్యలా భావించేదానినని, చదువుల కోసం అతని ఇంటికి వెళ్లినట్లు తెలిపింది. 2025 డిసెంబర్‌లో నిందితుడు తన వ్యక్తిగత సమస్యలు చెబుతూ గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఈ కేసును భారతీయ న్యాయ వ్యవస్థలోని BNS సెక్షన్ 63 (అత్యాచారం) కింద నమోదు చేశారు.
ఇదిలా ఉండగా ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యులపై కేరళలో నమోదైన మరో కేసును కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడు, బాధితురాలు కొంతకాలం పరిచయం ఉన్నట్లు అనుమానిస్తున్నామని, పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వస్తాయని వెల్లడించారు. ఇక ఈ ఆరోపణల గురించి సంబంధిత ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్‌కు ఎలాంటి సమాచారం లేదని అధికారులు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
