AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండలో 5 లీటర్ల నీళ్లు తాగిన యువకుడు.. కట్ చేస్తే ICUలోకి! షాకింగ్ కారణం ఏమిటంటే..?

Water Intoxication: ఒక 25 ఏళ్ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మండుటెండను పట్టించుకోకుండా, క్లయింట్ మీటింగ్‌ల కోసం ఒక చోట నుంచి మరో చోటకు రోజంతా తన మోటార్‌సైకిల్‌పై తిరుగుతున్నాడు. ఈ ప్రయాణంలో అతను తరచుగా ఎక్కువ నీళ్లు తాగుతూ, బాటిల్ రీఫిల్ చేసుకుంటూ ఉండేవాడు. ఇలా అధికంగా నీరు మాత్రమే తీసుకోవడం వల్ల అతను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

ఎండలో 5 లీటర్ల నీళ్లు తాగిన యువకుడు.. కట్ చేస్తే ICUలోకి! షాకింగ్ కారణం ఏమిటంటే..?
Young Man Drinks 5 Liters Of Water In The Sun
Rajashekher G
|

Updated on: Apr 30, 2026 | 10:29 AM

Share

Heatwave Health Risks: వేసవిలో నీరు ఎక్కువగా తాగాలని సాధారణంగా వైద్య నిపుణులు చెబుతుంటారు. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకుతరచుగా తీసుకోవాలంటారు. అయితే, ఒక్కసారిగా కాకుండా తరచుగా తీసుకోవాలని చెబుతారు. కానీ, ఇక్కడ ఓ యువకుడు మాత్రం తక్కువ సమయంలో అధిక నీరు తాగడం వల్ల తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఓ 25 ఏళ్ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మధ్యాహ్నపు మండుటెండను లెక్కచేయకుండా, ఒక క్లయింట్ మీటింగ్‌ నుంచి మరొకదానికి వెళుతూ.. రోజంతా తన మోటార్‌సైకిల్‌పై నగరం మొత్తం తిరుగుతూ గడుపుతాడు. ఆ సమయంలో చాలా నీళ్లు కూడా తాగుతాడు. బాటిల్ నింపుకోవడానికి తరచూ ఆగుతూ, రోజుకు దాదాపు ఐదు లీటర్ల కంటే ఎక్కువే నీరు తాగేవాడు.

నీరు మాత్రమే తీసుకుంటే…

కానీ, అతను మిస్ చేసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తగిన ఆహారం తీసుకోవడం, ఎలక్ట్రోలైట్ సమతుల్యత పాటించడం. ఉదయం హడావిడిలో అల్పాహారం మానేశాడు. వరుస మీటింగ్‌ల కారణంగా మధ్యాహ్న భోజనానికి కూడా సమయం కేటాయించలేకపోయాడు. పండ్లు, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఏదీ తీసుకోలేదు.. కేవలం సాధారణ నీటినే అధికంగా తాగాడు.

సాయంత్రానికి అతనికి తల తిరుగుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాత వికారం మొదలైంది. అది అలసట అనుకుని పట్టించుకోలేదు. చివరి అపాయింట్‌మెంట్లు పూర్తిచేయాలనే పట్టుదలతో కొనసాగాడు. కొన్ని గంటల్లోనే పరిస్థితి తీవ్రతరమైంది.. మాటలు మందగించాయి, గందరగోళం పెరిగింది, అతిగా నిద్రమత్తు వచ్చింది. ఆందోళన చెందిన సహోద్యోగులు అతన్ని అత్యవసర విభాగాని(ఐసీయూ)కి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

రక్త పరీక్షల్లో అతని సోడియం స్థాయి 124 mEq/Lకి పడిపోయినట్లు తేలింది (సాధారణం: 135–145 mEq/L). అధిక చెమట ద్వారా లవణాలు కోల్పోవడం, దానికి తోడు అధికంగా సాధారణ నీరు తాగడం వల్ల రక్తంలో సోడియం ప్రమాదకరంగా తగ్గిపోయింది.

వేడి వల్ల శరీరంలోని లవణాల నష్టం

చెమట శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. కానీ చెమట కేవలం నీరు మాత్రమే కాదు.. సోడియం, క్లోరైడ్, పొటాషియం వంటి కీలక ఎలక్ట్రోలైట్లు కూడా దానితో పాటు కోల్పోతాం. ఇవి నాడీ సంకేతాలు, కండరాల పని, గుండె లయ, ద్రవ సమతుల్యత కోసం అత్యంత అవసరం. సాధారణంగా ఈ నష్టం ఆహారం, పానీయాల ద్వారా భర్తీ అవుతుంది. కానీ తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు పని చేస్తే, ముఖ్యంగా తగిన ఆహారం లేకపోతే, ఈ సమతుల్యత దెబ్బతింటుంది. ఇక్కడే సమస్య మొదలవుతుంది.. కేవలం నీరు తాగడం సరిపోదు. ఎలక్ట్రోలైట్లు భర్తీ కాకపోతే రక్తంలో సోడియం తగ్గి హైపోనాట్రేమియా అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది.

తక్కువ సోడియం ఎందుకు ప్రమాదకరం?

సోడియం శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రిస్తుంది. ఇది తగ్గినప్పుడు నీరు కణాల్లోకి ప్రవేశించి అవి ఉబ్బుతాయి. మెదడులో ఇది అత్యంత ప్రమాదకరం, ఎందుకంటే పుర్రెలో విస్తరణకు స్థలం ఉండదు.

లక్షణాలు మొదట తేలికగా కనిపిస్తాయి:

  • తలనొప్పి
  • అలసట
  • తల తిరగడం
  • వికారం
  • గందరగోళం

కానీ పరిస్థితి ముదిరితే మగత, స్పృహ కోల్పోవడం, మూర్ఛలు, చివరికి కోమా కూడా సంభవించవచ్చు.

మరో ప్రమాదం: హైపర్‌నాట్రేమియా

ఎక్కువ చెమట పోయి, తగినంత నీరు తీసుకోకపోతే శరీరంలో నీరు తగ్గి సోడియం గాఢత పెరుగుతుంది. ఇది కూడా ప్రమాదకరమే. దీనిలో కణాలు కుంచించుకుపోతాయి. దీంతో.. తీవ్రమైన దాహం, నోరు ఎండిపోవడం, చిరాకు, అశాంతి, కండరాల తిమ్మిర్లు, గందరగోళం ఏర్పడతాయి. తీవ్రమైన సందర్భాల్లో ఇది కూడా నాడీ వ్యవస్థకు శాశ్వత నష్టం కలిగించవచ్చు.

పొటాషియం కూడా అంతే కీలకం

వేడి వల్ల కేవలం సోడియం మాత్రమే కాదు, పొటాషియం కూడా తగ్గుతుంది. ఇది కండరాలు, గుండె విద్యుత్ కార్యకలాపాలకు అవసరం. పొటాషియం తగ్గితే.. కండరాల బలహీనత, తిమ్మిర్లు, తీవ్రమైన అలసట, గుండె లయ లోపాలు చోటు చేసుకుంటాయి. తీవ్రమైన డీహైడ్రేషన్‌లో పొటాషియం పెరగడం కూడా ప్రమాదకరం, ఇది ఆకస్మిక గుండె సమస్యలకు దారితీయవచ్చు.

సరైన హైడ్రేషన్ ఎలా ఉండాలి?

ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాలని ముఖ్యమైన పాఠం ఏమిటంటే.. హైడ్రేషన్ అంటే కేవలం నీరు తాగడం కాదు. నీటితో పాటు ఎలక్ట్రోలైట్లు (సోడియం, పొటాషియం మొదలైనవి) ముఖ్యం. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, కొబ్బరి నీరు, మజ్జిగ (చిటికెడు ఉప్పుతో), నిమ్మరసం (ఉప్పు-చక్కెరతో), సమతుల ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే, క్రమం తప్పకుండా తినడం, మధ్యాహ్నపు తీవ్ర ఎండలో శ్రమ తగ్గించడం, నీడలో విరామాలు తీసుకోవడం, లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

చివరగా.. వడదెబ్బ అంటే ఒక్కసారిగా కుప్పకూలడం మాత్రమే కాదు. అసలు ప్రమాదం శరీరంలో నిశ్శబ్దంగా జరిగే ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలో ఉంటుంది. ఇది చిన్న లక్షణాలతో మొదలై, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం వరకు వెళ్లవచ్చు. ఆ యువ ఎగ్జిక్యూటివ్ సకాలంలో చికిత్స పొందడంతో బయటపడ్డాడు. కానీ, ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు ఆలస్యంగా గుర్తించబడతాయి. అందుకే, వేడి వాతావరణంలో పని చేసే వారు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. ప్రతి నీటి గ్లాసు సరిపోదు, ఎలక్ట్రోలైట్ సమతుల్యత కూడా అంతే ముఖ్యమైనది.

Follow Us