AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Riyan Parag Vaping Row : రాజస్థాన్ కెప్టెన్‎కు ఏడాది జైలు శిక్ష ?.. డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ తాగడమే కారణమా ?

Riyan Parag Vaping Row : ఐపీఎల్ 2026లో రియాన్ పరాగ్ వేపింగ్ వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలిచాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ వాడుతూ కెమెరాలకు చిక్కడం తీవ్ర చర్చకు దారితీసింది. 2019 చట్టం ప్రకారం ఇది నేరం కావడంతో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్‌కు ఇది పెద్ద దెబ్బగా మారింది.

Riyan Parag Vaping Row : రాజస్థాన్ కెప్టెన్‎కు ఏడాది జైలు శిక్ష ?.. డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ తాగడమే కారణమా ?
Riyan Parag (1)
Rakesh
|

Updated on: Apr 30, 2026 | 10:52 AM

Share

Riyan Parag Vaping Row : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఐపీఎల్ 2026లో అనవసరపు వివాదంలో చిక్కుకున్నాడు. మైదానంలో తన ఆటతో కంటే, డ్రెస్సింగ్ రూంలో చేసిన ఒక పనితో ప్రస్తుతం వార్తలో నిలిచాడు. మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ తాగుతూ టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో ఈ దృశ్యాలు కనిపించడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా దుమారం రేగింది. భారత ప్రభుత్వం 2019లోనే ఈ-సిగరెట్లను నిషేధించిన నేపథ్యంలో, ఒక బాధ్యతాయుతమైన కెప్టెన్ ఇలా చేయడంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ బ్యాటింగ్ లో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే రాజస్థాన్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో టీవీ కెమెరాలు ఒక్కసారిగా డ్రెస్సింగ్ రూమ్ వైపు తిరిగాయి. ఆ సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ పీలుస్తూ కనిపించాడు. ఈ వీడియో క్లిప్స్ సెకన్ల వ్యవధిలోనే ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. గతంలో కూడా పరాగ్ తన ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఈసారి అది చట్టపరమైన సమస్యగా మారింది.

భారత ప్రభుత్వం 2019లో ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ యాక్ట్ (PECA) కింద ఈ-సిగరెట్ల ఉత్పత్తి, విక్రయం, వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ చట్టం ప్రకారం మొదటిసారి తప్పు చేస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. ఒక ఎలైట్ అథ్లెట్ అయ్యుండి, బహిరంగంగా ఇలాంటి నిషేధిత వస్తువులను వాడటం ప్రజలకు తప్పుడు సందేశాన్ని ఇస్తుందని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే పరాగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డు యోచిస్తోంది.

నిజానికి ఐపీఎల్ కెప్టెన్ల సమావేశంలోనే డ్రెస్సింగ్ రూమ్‎లోకి కెమెరాలు పంపడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు లేదా వ్యక్తిగత పనులు చేస్తున్నప్పుడు కెమెరాలు ఉండటం సరికాదని వాదించారు. అయితే, బ్రాడ్‌కాస్టర్లు దీన్ని వ్యూవర్ షిప్ కోసం వాడుకుంటున్నారు. కానీ, పరాగ్ విషయంలో ప్రైవసీ కంటే అతని బాధ్యతారాహిత్యంపైనే చర్చ జరుగుతోంది. “చాలామంది ఆటగాళ్లు ఈ-సిగరెట్లు వాడుతుండవచ్చు, కానీ డ్రెస్సింగ్ రూమ్ లో కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా ఇలా చేయడం నిర్లక్ష్యమే” అని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కు వివాదాలు కొత్తేమీ కాదు. గత వారమే టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్ లో ఫోన్ వాడుతూ దొరికిపోవడంతో బీసీసీఐ రూ. లక్ష జరిమానా విధించింది. ఇప్పుడు కెప్టెన్ పరాగ్ స్వయంగా వివాదంలో చిక్కుకోవడం జట్టు యాజమాన్యాన్ని ఇబ్బందుల్లో నెట్టింది. ఒక పక్క బ్యాట్ తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న పరాగ్, ఇప్పుడు ఇలాంటి అనవసరపు వివాదాలతో తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నాడు. బీసీసీఐ ఇచ్చే షోకాజ్ నోటీసులకు పరాగ్ ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us