AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi: 200 కొట్టాడు.. ఇప్పుడు 500 కొడతాడు.. వైభవ్‌పై పీటర్సన్ భారీ అంచనా!

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సంచలన అంచనా వేశాడు. వచ్చే ఐదేళ్లలో టెస్టు క్రికెట్‌లో 500 పరుగుల ఇన్నింగ్స్ ఆడతాడని చెప్పాడు. ఇటీవల యూఏఈపై 53 బంతుల్లో 204 పరుగులు చేసిన వైభవ్ రికార్డుల వివరాలు చూద్దాం.

Vaibhav Sooryavanshi: 200 కొట్టాడు.. ఇప్పుడు 500 కొడతాడు..  వైభవ్‌పై పీటర్సన్ భారీ అంచనా!
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: Nov 26, 2026 | 4:29 PM

Share

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు వినిపిస్తోంది. అతడే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. బ్యాట్ పట్టుకుంటే బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇటీవల యూఏఈపై కేవలం 53 బంతుల్లో 204 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అతడిపై భారీ అంచనా వేశాడు. వచ్చే ఐదేళ్లలో టెస్టు క్రికెట్‌లో వైభవ్ ఏకంగా 500 పరుగుల ఇన్నింగ్స్ ఆడతాడని జోస్యం చెప్పాడు. పీటర్సన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

ఐదేళ్లలో 500 పరుగులు చేస్తాడట

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ సామర్థ్యంపై కెవిన్ పీటర్సన్‌కు ఎంత నమ్మకం ఉందో ఆయన చేసిన వ్యాఖ్యలే చెబుతున్నాయి. నవంబర్ 26న సోషల్ మీడియా వేదికగా స్పందించిన పీటర్సన్.. వచ్చే ఐదేళ్లలో వైభవ్ ఒక టెస్టు మ్యాచ్‌లో 500 పరుగులు చేస్తాడని అంచనా వేశాడు. సాధారణంగా టెస్టు క్రికెట్‌లో ఒక్క ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేయడమే గొప్ప విషయం. అలాంటిది 500 పరుగులు చేయడం అంటే అసాధారణ ఘనత. పీటర్సన్ అంచనా నిజమైతే వైభవ్ ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించినట్లవుతుంది.

53 బంతుల్లో 204.. 28 సిక్సర్లతో విధ్వంసం

పీటర్సన్ ఇంత పెద్ద అంచనా వేయడానికి కారణం వైభవ్ ఇటీవల ఆడిన అద్భుత ఇన్నింగ్సే. ఏసీసీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ తరఫున యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ ఓపెనర్ చెలరేగిపోయాడు. కేవలం 53 బంతుల్లో 204 పరుగులు చేశాడు. ఇందులో 28 సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 52 బంతుల్లోనే 200 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా ద్విశతకం సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వైభవ్ విధ్వంసంతో 250 పరుగుల లక్ష్యాన్ని ఇండియా-ఏ కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టెస్టుల్లో ఇప్పటికీ ఆడలేదు

వైభవ్ ఇప్పటివరకు భారత సీనియర్ జట్టు తరఫున టెస్టు, వన్డేల్లో ఆడలేదు. 2026 జులైలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 10 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 295 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 81 పరుగులు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చి, ఇంత తక్కువ సమయంలో ప్రపంచ స్థాయి ఆటగాళ్ల ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే టెస్టు క్రికెట్‌లో 500 పరుగులు చేయాలంటే సుదీర్ఘంగా క్రీజులో నిలబడటం, పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడం కూడా అవసరం.

టెస్టు క్రికెట్‌లో అత్యధిక స్కోరు ఎవరిదంటే?

టెస్టు క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉంది. 2004లో ఇంగ్లండ్‌తో ఆంటిగ్వాలో జరిగిన టెస్టులో లారా అజేయంగా 400 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 582 బంతులు ఎదుర్కొని 43 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. ఇప్పటికీ టెస్టు క్రికెట్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. పీటర్సన్ అంచనా ప్రకారం వైభవ్ 500 పరుగులు చేస్తే లారా రికార్డును కూడా అధిగమించినట్లే. అయితే ఇది ఇప్పటికైతే ఒక అంచనా మాత్రమే. వైభవ్ భవిష్యత్తులో టెస్టు క్రికెట్‌లోకి ఎప్పుడు వస్తాడు? ఎలాంటి ప్రదర్శన చేస్తాడు? అన్నది చూడాలి.

యూవీతో అరగంట ఫోన్ కాల్

యూఏఈతో మ్యాచ్‌కు ముందు తన బ్యాటింగ్‌లో కొన్ని సాంకేతిక లోపాల గురించి వైభవ్ ఆందోళన చెందాడట. ఈ విషయాన్ని తన అభిమాన ఆటగాడు యువరాజ్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడి పంచుకున్నాడు. దాదాపు 30 నిమిషాల పాటు యువరాజ్‌తో మాట్లాడినట్లు వైభవ్ వెల్లడించాడు. బ్యాటింగ్‌లో ఏ అంశాలపై దృష్టి పెట్టాలి? ఎలా ఆడాలి? అనే విషయాలపై యువరాజ్ సూచనలు ఇచ్చాడని చెప్పాడు. ముఖ్యంగా మొదటి 20 బంతులు క్రీజులో నిలబడితే ఆ తర్వాత స్కోరు మరో స్థాయికి వెళ్తుందని యువరాజ్ చెప్పిన మాటలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని వైభవ్ తెలిపాడు. ఆ సలహాల తర్వాతే యూఏఈపై తనదైన శైలిలో చెలరేగిపోయినట్లు వివరించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us