AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sr.NTR Movie : 1951లో థియేటర్లలో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ మూవీ.. విదేశాల్లో 100 రోజులు ఆడిన తొలి సినిమా ఇదే..

తెలుగు చిత్రసీమలో ఎన్నో అద్భుత చిత్రాలు సందడి చేశాయి. ఇప్పటికీ పలు సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాయి. దశాబ్దాలు గడిచినా ఆ చిత్రాలు టీవీల్లో వస్తే చాలు మళ్లీ మళ్లీ చూస్తుంటారు. వాటిలో పాటలు, సాహిత్యం, సంగీతానికి పెద్ద పీట వేసిన సినిమా గా సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్టీఆర్, భానుమతి కాంబినేషన్ లో బీఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ మూవీ అప్పట్లోనే విదేశాల్లో వంద రోజులు ఆడి చరిత్ర సృష్టించింది.

Sr.NTR Movie : 1951లో థియేటర్లలో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ మూవీ.. విదేశాల్లో 100 రోజులు ఆడిన తొలి సినిమా ఇదే..
Malliswari Movie
Rajitha Chanti
|

Updated on: Nov 26, 2026 | 4:34 PM

Share

నటరత్న ఎన్టీఆర్ కెరీర్‌కు దిశానిర్దేశం చేసిన సంవత్సరం 1951. ఆ ఏడాది ఆయన నటించిన పాతాళ భైరవి, మల్లీశ్వరి చిత్రాలు విడుదలయ్యాయి. ఒకటి మాస్ చిత్రమైతే, మరొకటి ఉన్నత కళాత్మక విలువలున్న సినిమా. పాతాళ భైరవి ఎన్టీఆర్‌ను సూపర్‌ హీరోగా నిలబెడితే, మల్లీశ్వరి ఆయనలోని నటుడిని వెలికి తీసింది. ఈ చిత్రం విడుదలైన 73 ఏళ్లు దాటుతున్నా, ఈనాటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో సాహిత్యం అనగానే మొదటగా గుర్తు చేసుకునే చిత్రం మల్లీశ్వరి. దీనికి కారణం దర్శకుడు బి.ఎన్. రెడ్డి అద్భుతమైన అభిరుచి, స్పష్టమైన విజన్. నటి భానుమతి పేరుని శాశ్వతం చేసిన చిత్రంగానూ ఇది నిలిచింది. తెలుగువారు క్లాసిక్స్ తీయగలరు, సినిమాలో కళాత్మకతను జోడించగలరని మల్లీశ్వరి చాటి చెప్పింది. బి.ఎన్. రెడ్డి ఈ సినిమాతో అజరామరమైన కీర్తిని గడించారు. ఎన్టీఆర్, భానుమతుల నటన, సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు పాటలు ఈ సినిమాకు ఆయువుపట్టు. తెలుగు చిత్ర పరిశ్రమలో పాటల పందిరి అనే మాటకు అంకురార్పణ చేసిన చిత్రం మల్లీశ్వరి. పిలిచెన బిగువటరా, మనసున మల్లెల మాలలూగెనే, ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు వంటి పాటలు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిత్య నూతనంగానే ఉన్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

మల్లీశ్వరి చిత్రం 1951లో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, దాని రూపకల్పనకు 1939లోనే అంకురార్పణ జరిగింది. వందేమాతరం చిత్రం షూటింగ్ నిమిత్తం బి.ఎన్. రెడ్డి హంపి క్షేత్రాన్ని సందర్శించినప్పుడు, విరూపాక్ష స్వామివారి ఆలయంలో దేవునికి నమస్కరిస్తున్న సమయంలో ఆయన మదిలో ఒక భావన మెదిలింది. 16వ శతాబ్దంలో ఆంధ్ర దేశాన్ని పాలించిన కళా చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు సైతం ఇదే ఆలయంలో తనలాగే నమస్కరించి ఉంటారు కదా అన్నదే ఆ భావన. అప్పుడే రాయలవారి పాలన నేపథ్యంలో ఒక చిత్రం తీయాలనే ఆలోచన బి.ఎన్. రెడ్డిలో మొదలైంది. అయితే అది కార్యరూపం దాల్చడానికి ఏళ్లు పట్టింది. 1944లో రాయల కరుణ కృత్యం పేరుతో రచయిత బుచ్చిబాబు ఒక నాటిక రాశారు. అది భారతి సాహిత్య మాసపత్రికలో ప్రచురితమై, తర్వాత రేడియోలో ప్రసారమైంది. ఆ నాటికను వినగానే నాటి తన కల నిజమవుతుందని భావించిన బి.ఎన్. రెడ్డి, వెంటనే బుచ్చిబాబును కలిసి తన ఆలోచనను వివరించి స్క్రిప్ట్ రాయమన్నారు. బుచ్చిబాబు అంగీకరించడంతో వాహిని ఆఫీసులో చర్చలు మొదలయ్యాయి. సినిమాకు మల్లీశ్వరి అని టైటిల్ పెట్టారు. అయితే ట్రీట్‌మెంట్ విషయంలో బి.ఎన్. రెడ్డికి, బుచ్చిబాబుకి ఏకాభిప్రాయం కుదరక బుచ్చిబాబు ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. మల్లీశ్వరిని చెలికత్తెగా ఉంచడం ఆయనకు ఇష్టం లేదు; నాటికలో ఉన్నట్లుగానే రాణిగానే చూపించాలన్నది ఆయన వాదన. చివరికి స్క్రిప్టులో మార్పులు చేసి, దేవులపల్లి కృష్ణశాస్త్రికి రచన బాధ్యతలు అప్పగించారు. ఆయనకు ఇదే తొలిచిత్రం కావడం విశేషం. చిత్రంలోని మొత్తం 17 పాటలు ఆయనే రాశారు. సాలూరి రాజేశ్వరరావు స్వరపరచగా, అద్దేపల్లి రామారావు ఆర్కెస్ట్రా సమకూర్చారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

నటీనటుల విషయానికి వస్తే, నాగరాజు పాత్రకు బి.ఎన్. రెడ్డి మనసులో మొదటి నుంచి ఎన్టీఆర్ ఉన్నారు. అప్పటికి ఆయన విజయా వారి కాంట్రాక్టులో ఉన్నప్పటికీ, విజయా, వాహిని సంస్థలు సోదర సంస్థలే కావడంతో అడ్డంకులు లేకపోయాయి. మల్లీశ్వరి పాత్రకు హీరోయిన్‌ను ఎంపిక చేయడానికి పెద్ద కసరత్తే జరిగింది. మొదట కన్నడ నటుడు కళ్యాణ్ కుమార్ భార్య రేవతిని అనుకున్నా కుదరలేదు. తర్వాత పద్మిని పేరును పరిశీలించారు. చివరికి ఆట, పాట, నటన ఉన్న భానుమతిని ఎంపిక చేశారు. నిర్మాణ సమయంలోనూ బి.ఎన్. రెడ్డి, భానుమతిల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆ సమయంలో భానుమతి తన సొంత చిత్రం ప్రేమ షూటింగ్‌తో బిజీ అయ్యి, మల్లీశ్వరి సెట్‌కు సరిగ్గా వచ్చేవారు కాదు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

దానికి తోడు ప్రేమ చిత్రం కోసం జుట్టును వంకీలు తిప్పుకోవడంతో, మల్లీశ్వరి పాత్రకు అది పనికిరాలేదు. అందుకే కొన్ని షాట్స్ లో డూప్ ను పెట్టి తీయాల్సి వచ్చింది. ఈ చిత్ర నిర్మాణానికి 6 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. 1951, డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం 13 కేంద్రాలలో 71 రోజులు ఏకధాటిగా ఆడింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రాన్ని తమ దేశంలో ప్రదర్శించడానికి చైనా దేశీయులు హక్కులు కొని, సబ్‌టైటిల్స్‌తో అక్కడ 100 రోజులు ప్రదర్శించారు. 1951లోనే తొలి పాన్ ఇండియా చిత్రంగా నిలిచింది మళ్లీశ్వరి. ఈ చిత్రానికి ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

Follow Us