చిన్నారి స్వాతికకు కలెక్టర్ భరోసా.. నల్లగొండ జిల్లాలో మనసున్న అధికారి మానవీయ కోణం!
అధికారి అంటే కేవలం చట్టాలను అమలు చేయడం, ఫైళ్లకు పరిమితం కాకుండా సామాన్యుల కష్టాలను స్వయంగా విని పరిష్కరించే వారు కొందరు మాత్రమే ఉంటారు. మరికొందరు ప్రజా సమస్యల పరిష్కారంలో మానవీయ కోణంతో పనిచేస్తుంటారు. నిత్యం జిల్లా సమస్యల పరిష్కారంలో బిజీగా ఉండే ఆఫీసర్.. ఓ ఘటనతో మానవత్వాన్ని చాటుకున్నారు. అధికారి ఎవరు..? ఆయన మానవత్వమెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఒక దివ్యాంగ చిన్నారి పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు. నిత్యం కలెక్టరేట్ కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తన కార్యాలయంలో రోజు మాదిరిగానే బాధితుల నుండి విజ్ఞాపన పత్రాలు తీసుకుంటుండగా ఓ హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆయన చలించిపోయారు. కనగల్ మండలం జి. చెన్నారం గ్రామానికి చెందిన చంద్రమౌళి దివ్యాంగుడు. చంద్రమౌళి 10 ఏళ్ల కుమార్తె స్వాతిక ఓ రోడ్డు ప్రమాదంలో తన కాలును కోల్పోయింది. దివ్యాంగురాలిగా మారిన కూతురు జీవితం అంధకారంగా మారిందని బాధపడుతున్నాడు.
కూతురు సాత్విక భవిష్యత్తు కోసం కృత్రిమ కాలును అమర్చాలని భావించాడు. అయితే తన వద్ద ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. ఓసారి జిల్లా కలెక్టర్ ను కలిసి తన గోడును వెల్లబోసుకోవాలని చంద్రమౌళి కలెక్టరేట్ కు వచ్చాడు. తన కూతురు సాత్వికకు కృత్రిమ కాలు అమర్చాలని తండ్రి చంద్రమౌళి.. కలెక్టర్ చంద్రశేఖర్ ను వేడుకున్నారు. కుటుంబ పోషణకు తనకు మూడు చక్రాల బండిని మంజూరు చేయాలని విన్నవించాడు. దీంతో చలించిపోయిన కలెక్టర్ చంద్రశేఖర్.. కేవలం వినతి పత్రం తీసుకోవడమే కాకుండా, తక్షణమే క్రింది స్థాయి అధికారులతో మాట్లాడి చిన్నారికి కృత్రిమ కాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చిన్నారి స్వాతిక సాధారణ జీవితం గడిపేలా అవసరమైన అన్ని వైద్య సహాయాలను ప్రభుత్వం తరపున అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చంద్రమౌళికి జీవనోపాధి కల్పించేందుకు ఉచితంగా మూడు చక్రాల బండిని మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
నిరుపేదలు, నిస్సహాయుల కష్టాలను తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు కలెక్టర్ చంద్రశేఖర్. ముఖ్యంగా దివ్యాంగులు, అంగవైకల్యం ఉన్న పిల్లలకు సహాయం చేసేందుకు మేము ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని, స్వాతిక చదువుకు, ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. చిన్నారి స్వాతిక ముఖంలో చిరునవ్వును చూసిన కలెక్టర్, ఆ కుటుంబానికి కొత్త ఆశలను చిగురింపజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మానవీయ కోణంతో పనిచేసే ఇలాంటి అధికారులు ఉన్నప్పుడే సామాన్యులకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది. చంద్రశేఖర్ గారి ఈ చొరవ నిజంగా అభినందనీయం.




