బంగారం Vs వెండి Vs స్టాక్స్.. 2026లో కాసుల వర్షం కురిపించేది ఏదో తెలుసా..?
2025లో బంగారం, వెండి అద్భుతమైన లాభాలు అందించాయి. వెండి ఇచ్చిన 178శాతం రిటర్న్స్‌తో ఇన్వెస్టర్లు ఖుషీగా ఉన్నారు. 2026లో పెట్టుబడి అవకాశాలు ఎందులో బాగుంటాయి. బంగారం, వెండి, స్టాక్ మార్కెట్లలో ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాాం..

గత ఏడాది పెట్టుబడిదారులకు అదిరిపోయే లాభాలు ఇచ్చింది. ముఖ్యంగా పసిడి, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరగడంతో ఇన్వెస్టర్లు పండగా చేసుకున్నారు. ఇప్పుడు 2026లో అడుగుపెట్టాం. ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగుతుందా? బంగారం, వెండి, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్..ఈ నాలుగింటిలో ఏది బెస్ట్ అనిపించుకుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందా..
2026లోనూ అదే జోరా..?
గత ఏడాది వెండి ఒక సంచలనం సృష్టించింది. 2025 ప్రారంభంలో కిలో రూ. 1,00,000 ఉన్న వెండి, ఏడాది ముగిసేసరికి ఏకంగా రూ. 2,60,000 స్థాయికి చేరుకుంది. అంటే దాదాపు 178 శాతం పెరుగుదల! ప్రస్తుతం గ్రాము వెండి రూ. 260 వద్ద ట్రేడ్ అవుతోంది. పారిశ్రామిక అవసరాలు పెరగడం, ఎలక్ట్రానిక్ వస్తువులలో వెండి వాడకం ఎక్కువవ్వడం వల్ల డిమాండ్ భారీగా పెరిగింది. రాబోయే కాలంలో ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, వెండి మార్కెట్ చాలా అస్థిరంగా ఉంటుందని, పెట్టుబడిదారులు ఆచితూచి అడుగువేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎప్పటికీ సురక్షిత పెట్టుబడి
2025లో బంగారం ధరలు వేగంగా పెరిగి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. 2026లో కూడా బంగారం తన జోరును కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా డాలర్ విలువ పడిపోవడం, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం, గోల్డ్ ETFలలో పెట్టుబడులు పెరగడం వల్ల బంగారం విలువ స్థిరంగా పెరుగుతోంది. అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం ఎప్పుడూ సేఫ్ హెవెన్ గానే ఉంటుంది.
రిస్క్ ఉంటేనే లాభం
స్టాక్ మార్కెట్ పనితీరు పూర్తిగా కంపెనీల ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంచుకున్న ప్రైవేట్ కంపెనీలు మంచి వృద్ధిని సాధిస్తే, బంగారం కంటే ఎక్కువ లాభాలను ఇక్కడ ఆశించవచ్చు. అయితే కంపెనీలు నష్టపోతే మీ పెట్టుబడి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోగల వారు మాత్రమే స్టాక్ మార్కెట్ వైపు చూడటం మంచిది.
2026లో నిపుణుల సలహా ఏంటి?
ఆర్ధిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. కేవలం ఒకే దానిపై ఆధారపడకుండా పెట్టుబడులను విభజించాలి
బంగారం: స్థిరమైన, సురక్షితమైన రాబడి కోసం.
వెండి: అధిక లాభాల కోసం (అయితే రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి).
స్టాక్ మార్కెట్: దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం.
మార్కెట్లలో కొంత అస్థిరత నెలకొన్నప్పటికీ, ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను నిశితంగా గమనించి, సరైన వ్యూహంతో ముందుకు వెళ్తే 2026లో కూడా మంచి లాభాలను గడించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




