Hakimpet School Issue: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపులు.. కవిత ట్వీట్.. వెంటనే స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..
Hakimpet Sports School Harassment Issue: స్పోర్ట్స్ స్కూల్‌లో విద్యార్థినులను ఆ ఓఎస్డీ లైంగికంగా వేధిస్తున్నట్టు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వికృత చేష్టలతో అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతున్నారని, హాస్టల్‌లోకి మహిళా అధికారులు తప్ప ఇతరులు వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నా.. అవేమీ పట్టనట్టుగా వ్యవహరించిన ఆ అధికారి అసభ్యంగా ప్రవర్తించేవారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామంటున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 13: హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్‌లో దారుణమై ఘటన వెలుగులోకి వచ్చింది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లోని బాలికలపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా బయటపడింది. బాలికలను నిత్యం వేధింపులకు గురి చేస్తున్న పోకిరీ అధికారి.. అర్ధరాత్రి దాటిన తర్వాత బాలికల గదుల్లోకి రావడం.. సాయంత్రం సమయంలో ఆట విడుపు పేరుతో వికృతి చేష్టలకు తెరలేపడం. ఆ బాలికలను కారులో ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పోర్ట్స్ స్కూల్‌లోని బాలికలు ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఆ ఆఫీసర్ పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ స్కూల్ ఉన్నతాధికారుల అండదండలతోనే ఆ అధికారి తమపై వేధింపులకు పాల్పడుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు.
ఈ దారుణ ఘటనపై వరుస కథనాలు మీడియాలో వస్తుండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. ఈ ఘటనన తనను ఎంతో కలిచివేసిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాలికలకు న్యాయం చేయాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి ట్యాగ్ చేశారు.
ఒక దినపత్రిక లో వచ్చిన కథనం నన్ను ఎంతో కలిచివేసింది. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదు.
బాలిక పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధితురాళ్లకు న్యాయం…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 13, 2023
ఎమ్మెల్సీ కె. కవిత ట్వీట్ చూసిన వెంటనే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రియాక్ట్ అయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని వెంటనే సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చారు. వేధింపులపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణను సస్పెండ్ చేశాం. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వదు.. విద్యార్థుల్లో ధైర్యం నింపడానికే వెంటనే చర్యలు చేపట్టామన్నారు. ఆడవాళ్లతో చెలగాటం ఆడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అధికారులు, నేతలు ఎవరైనా ఊరుకునేది లేదన్నారు శ్రీనివాస్ గౌడ్. బ్రిజ్ భూషణ్ ఎపిసోడ్‌లో ఇప్పటి వరకు చర్యలు లేవు. కాని మేం ఆరోపణలు వచ్చిన వెంటనే స్పందించాం. విచారణ నివేదిక రాగానే చట్టపరంగా చర్యలు తీసుకున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
@raokavitha అక్క, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తాం. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల వార్తలపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి… https://t.co/O2rDflRUWU
— V Srinivas Goud (@VSrinivasGoud) August 13, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం