Watch Video: దట్టమైన అడవిలో.. రోడ్డులేని ఆ ఊరుకు మహిళా మంత్రి ఎలా వెళ్లారో తెలుసా..?
రోడ్డు లేక అభివృద్ధికి నోచుకోని మారుమూల గిరిజన గ్రామాలపై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.. అందులో భాగంగానే ములుగు జిల్లాలోని మారుమూల గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్న సీతక్క అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు.. ఈ క్రమంలోని కనీసం రోడ్డు రవాణాలేని గ్రామాలకు తనే స్వయంగా బైక్ పై వెళ్లి అక్కడ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మంత్రి సీతక్క అంటేనే సమ్‌థింగ్ స్పెషల్.. మహిళా ప్రజాప్రతినిధిగా.. సమస్యలపై గళం విప్పే ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన సీతక్క తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలలోనూ ప్రత్యేక మార్క్ చాటుకుంటున్నారు.. కనీస రవాణా వ్యవస్థ లేక ఇంతకాలం అబివృద్దికి నోచుకోని మారుమూల గిరిజన గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.. రోడ్ల నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయించిన సీతక్క తానే స్వయంగా బైక్ పై వెళ్లి ఆ గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. తాజాగా మంగళవారం మంత్రి సీతక్క ములుగు జిల్లా ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు బైక్ పై వెళ్లి ఆ గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. రోడ్డు మార్గం లేని ఆ ఊరికి వెళ్ళిన సీతక్కకు అక్కడి ప్రజలు ఆప్యాయతతో అపూర్వ స్వాగతం పలికారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కొడిశాల నుండి పోచాపూర్ వరకు నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు నిధులతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క.. అక్కడి నుండి లింగాలకు వెళ్లిన సీతక్క లింగాల నుండి బొల్లెపల్లి గ్రామం వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పోచాపూర్ నుంచి బంధాల వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు కూడా అక్కడే శంకుస్థాపన చేశారు.
పోచారం గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించి అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. అక్కడికక్కడే కొన్ని సమస్యలు పరిష్కరించి మరికొన్ని సమస్యల పరిష్కారం కోసం అధికారులకు దిశా నిర్దేశం చేశారు..
వీడియో చూడండి..
అంతటి మారుమూల గ్రామానికి మంత్రి రావడం చూసి అక్కడ ప్రజలు తన్మయత్వంతో ఉప్పొంగి పోయారు.. బైక్ పై వచ్చిన సీతక్కకు అపూర్వ స్వాగతం పలికారు.. పోచాపూర్ లోని మినీగురుకులం సందర్శనకు వెళ్లిన సీతక్క..అక్కడి విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడారు.. ఆ విద్యార్థుల ఆనందం చూసి ఉప్పొంగిపోయిన సీతక్క వారితో కలసి కోలాటం ఆడారు.
అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి వంటగదిని పరిశీలించారు.. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుతుందా..? లేదా అడిగి తెలుసుకున్నారు..
సహజంగా ఎమ్మెల్యే కూడా చూడని ఇంతటి మారుమూల గ్రామాలకు ఏకంగా మంత్రి బైక్ పై వచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయడం పట్ల అక్కడి ప్రజలు ఆనందం ఉప్పొంగిపోయారు.. మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.. ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతుంది.. తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం కాబోతుందని అక్కడి ప్రజలు ఆనందంతో పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..