Telangana: తెలంగాణలో యమ ధర్మరాజు దేవాలయం ఉందని మీకు తెల్సా..?

ధర్మపురిని దర్శిస్తే యుమపురి ఉండదని ఓ ప్రశస్తి. అందుకే అక్కడి పవిత్ర గోదావరిలో స్నానాదికాలు ముగించుకున్నవారు ఆ తర్వాత లక్ష్మీనృసింహుణ్ని దర్శించుకుంటారు. కానీ, ఆ నర్సన్నను పూజించుకునే ముందు.. తమకు నరకముండొద్దని యుముణ్ని దర్శించుకున్నతర్వాతే.. స్వర్గలోక ప్రాప్తి కోసం ఆ నర్సన్నను ప్రార్థించడం అక్కడి దర్శనంలో కనిపించే ప్రత్యేకత. ఇంతకీ ప్రఖ్యాత నవనారసింహ క్షేత్రంలో... యుముడి గండాదీపంలో భక్తులు నూనె ఎందుకు పోస్తారు.. ? తెలుసుకోవాలంటే ఒక్కసారి ఈ కథనం చదవాల్సిందే.

Telangana: తెలంగాణలో యమ ధర్మరాజు దేవాలయం ఉందని మీకు తెల్సా..?
Yama Temple
Follow us
G Sampath Kumar

| Edited By: Rajitha Chanti

Updated on: Jan 08, 2025 | 2:55 PM

ఎక్కడా కనిపించని విధంగా ధర్మపురి లక్ష్మీనృసింహుడి ఆలయంలో యముడు కనిపిస్తాడు మనకు. పుణ్యం కోసం దర్శించుకునేచోట పాపపరిహారాన్ని కూడా పొందే అపురూప క్షేత్రం ధర్మపురి. గోదావరీ తీర్థంగా.. నర్సన్న క్షేత్రంగా.. హరిహరాదులు కొలువైన దక్షిణకాశీగా ఖ్యాతిగాంచిన ఈ ఊరు ఓ టెంపుల్ టౌన్. ఇలాంటి పవిత్రభూమిలో నర్సన్నను దర్శించుకునే పుణ్యంతో పాటు… యముణ్ని దర్శించుకుని పాపపరిహారాన్ని పొందే అవకాశాన్ని ఆ భగవంతుడు ఇక్కడి స్థానికులకూ, వచ్చే భక్తులకు కల్పించాడు.

ధర్మపురిని కుజ క్షేత్రమంటారు. కుజుడు యుముడికి గురువైతే… ఆ కుజుడి గురువు శ్రీలక్ష్మీనర్సింహస్వామి. అందుకే ఈ కుజక్షేత్రంలో మొట్టమొదట యముణ్ని దర్శించుకుని నరకలోక విముక్తి నుంచి తమ పాపపరిహారం చేసుకున్నాకే… తమకు మోక్షం కల్గించాలని స్వర్గలోక ప్రాప్తి జరగాలని నర్సన్నను దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. అంతేకాదు, ఇక్కడి గోదావరీ తీరాన, వేదపండితుల ఇళ్లలో కుజదోష నివారణకు పలు హోమసంబంధింత కార్యక్రమాలూ నిర్వహిస్తారు.

ధర్మపురి నర్సన్న ఆలయంలోకి ఎంటర్ కాగానే మొట్టమొదట దర్శించుకునే గుడే యమధర్మరాజు ఆలయం. ఇక్కడ ఒక గండా దీపం మనకు దర్శనమిస్తుంది. ఆ దీపం ఎల్లప్పుడూ వెలుగులీనుతూ ఉంటుంది. ఆ దీపం వెలుగులాగే పాపాలు లేని ఒక పుణ్యలోకాన్ని, పవిత్ర సమాజాన్ని మనం తయారు చేసుకోవాలనే ఒక అంతర్లీనమైన సందేశం అందులో ఉంటుంది. అందుకే, ఇక్కడి గండాదీపంలో పక్కనే ఉన్న నూనెను పోయడం వల్ల తమ పాపాలకు పరిహారం లభిస్తుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ధర్మపురిని కుజక్షేత్రంగా కూడా చెప్పుకుంటారు.

ఎన్నో ఆలయాలతో టెంపుల్ టౌన్ గా ప్రసిద్ధిగాంచిన దక్షిణవాహిని గోదావరీతీరాన నర్సింహా స్వామి దర్శనం చేసుకునేముందు యముణ్ని దర్శించుకోవడం ఇక్కడికొచ్చే భక్తులు తప్పకుండా చేసే కార్యం.  సాధారణంగా యముడి పేరు విన్నా.. ఆయన్ను చూసినా మరణాన్ని ఆహ్వానించినట్టేనన్న ఫీలింగ్స్ భక్తుల్లో కనిపిస్తాయి. అలాంటిది యముణ్నే పూజించే చోటుగా ధర్మపురి ఎక్కడా కనిపించని ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

యముడికి భరణీ నక్షత్రం రోజున ప్రత్యేక అర్చనలు చేస్తుంటారు. అలాగే, దీపావళి తెల్లవారి రెండరోజున వచ్చే యమద్వితీయ రోజు ఇక్కడ యుముడికి మన్యసూక్తం, మంత్రపుష్పం, ఆయుష్యహోమం వంటి ప్రత్యేక అర్చనలు చేస్తుంటారు. భాయీదూజ్ అని పిల్చుకునే యమద్వితీయ రోజు నరకానికి తాళం వేసి యముడు తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తాడని.. అలా, ఇంకెవరు ఆ ఆచారాన్ని పాటించినా.. వారికీ నరకబాధలుండవనీ పురాణగాధలు చెప్పే మాట. ఈ నేపథ్యంలో యమద్వితీయ రోజు ఇక్కడికి పెద్దఎత్తున భక్తులు వస్తుంటారు.

తమ జీవితాల్లో అడ్డంకులేర్పడకుండా ఉండేందుకు, ఏవైనా పాపాలుంటే తొలిగిపోయేందుకు కూడా గండాదీపంలో నూనె పోయడం.. నూనె పోస్తే అవి తొలగిపోతాయని, నరక విముక్తి అవుతుందన్న నమ్మకం ఇక్కడి యముడి క్షేత్రానికి ప్రాధాన్యతను కట్టబెట్టింది…

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..