PD Act on Counterfeit Seeds: నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా తెలంగాణ.. ఫేక్ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ః మంత్రి నిరంజన్ రెడ్డి

నకిలీ విత్తనాల చెలామణి ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రంలోని పోలీసు కమీషనర్లు, జిల్లా ఎస్‌పీలు, వ్యవసాయాధికారులతో డీజీపీ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌....

PD Act on Counterfeit Seeds: నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా తెలంగాణ.. ఫేక్ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ః మంత్రి నిరంజన్ రెడ్డి
Minister Niranjan Reddy And Dgp Mahendar Reddy Video Conference On Seeds,
Follow us

|

Updated on: Jun 01, 2021 | 5:15 PM

PD Act on Counterfeit Seeds Sales: నకిలీ విత్తనాలు రైతుల పుట్టి ముంచుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటిని పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తుండటంతో నకిలీ మాఫియా మరోసారి విజృంభిస్తోంది. క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నా, పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తున్నా నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట నకిలీ పత్తి విత్తనాలు దొరుకుతూనే ఉన్నాయి. దీంతో తెలంగాణను నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంంది. గత నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో దీని కీలకంగా చర్చించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలో పోలీస్, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేసి నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి కోరారు. నకిలీ విత్తనాల చెలామణి ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రంలోని పోలీసు కమీషనర్లు, జిల్లా ఎస్‌పీలు, వ్యవసాయాధికారులతో డీజీపీ కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో కలసి డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఉచిత కరెంట్, నీళ్లు, రైతుబంధు, రైతుభీమా, పంటల కొనుగోళ్లతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, అదే సమయంలో ప్రధానంగా విత్తనాలు విత్తే సమయంలో నకిలీ విత్తనాలతో రైతాంగం నష్టపోకూడదన్నది ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. కంపెనీలు నాణ్యమైన విత్తనాలనే అమ్మాలి.. విత్తనాలే నాణ్యత లేకుంటే రైతు తీవ్రంగా నష్టపోతాడని, నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.

రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోందని, 50 గ్రాముల పత్తి ప్యాకెట్ గరిష్ట ధర రూ.767 గా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిందని, అంతకన్నా ఎక్కువగాని, తక్కువగానీ అమ్మవద్దని తెలిపారు. వానాకాలంలో గ్లైఫోసైట్ పెస్టిసైడ్ ను అమ్మడాన్ని నిషేధించామని, ఏ షాపులో కనిపించినా లైసెన్సులు రద్దు చేయాలని మంత్రి సూచించారు. అలాగే, ఏవి నకిలీ విత్తనాలు, ఏవి సరైన విత్తనాలో వాటిని గుర్తించే విధానంపై పోలీసు అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని అన్నారు.

అయితే, ఈ క్రమంలో అమాయకులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నకిలీ విత్తనాల బెడద నివారణలో ఉత్తమ ఫలితాలు సాధించిన పోలీసు అధికారులకు తగు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారని డిజిపి తెలియజేశారు. రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా నకిలీ విత్తనాలు విక్రయించి అరెస్ట్ అయినవారి వివరాలు, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు, పంట నష్టం, విక్రయదారుల సమాచారాన్ని సేకరించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.

Read Also….  Cipla on Moderna vaccine: మోడెర్నా బూస్టర్ వ్యాక్సిన్ కోసం సిప్లా గొంతెమ్మ కోరికలు.. కేంద్రం ఓకే చెప్పేనా..?