AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: పట్టణ ప్రజల కోసం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

Minister KTR: దేశంలోని పట్టణ ప్రాంత పేద ప్రజల కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని

KTR: పట్టణ ప్రజల కోసం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
Ktr Letter To Nirmala Sitharaman
Shaik Madar Saheb
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 28, 2022 | 12:30 PM

Share

Minister KTR: దేశంలోని పట్టణ ప్రాంత పేద ప్రజల కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని రానున్న బడ్జెట్ (Budget 2022) సమావేశాల్లో పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే. తారక రామారావు (కేటీఆర్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజల జీవన స్థితిగతులు, వాటిలో సానుకూల మార్పుకు చేపట్టాల్సిన కార్యక్రమాల పైన సవివరమైన సూచనలను మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ (nirmala sitharaman) కు రాసిన లేఖలో ప్రస్తావించారు. పట్టణీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామం (ట్రెండ్) అని, ఇందుకు భారతదేశం ఏ మాత్రం మినహాయింపు కాదని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. మెరుగైన ఉపాధి జీవన అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణాలవైపు తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణాల్లోని మౌలిక వసతులపైన తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుందన్నారు. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 31 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉంటుందని, 2030 నాటికి దేశంలోని 40 శాతానికి పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండబోతుందన్నారు. తెలంగాణ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఇది 50 శాతాన్ని దాటే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు.

పెద్ద ఎత్తున పట్టణాల్లోకి ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణ పేదరికంపైన దేశంలోని అన్ని ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. పట్టణ పేదలకు అవసరమైన హౌసింగ్, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత, జీవనోపాదుల వంటి అంశాలపైన ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పట్టణంలోని పేదలకుపైన పేర్కొన్న అంశాల్లో సరైన అవకాశాలు కల్పించినప్పుడే వారు నాణ్యమైన జీవితాన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ పేద ప్రజలు నాణ్యమైన జీవితాన్ని అందుకోవాలంటే వారి ఆదాయం పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు పట్టణ పేదలు అత్యధిక శాతం అసంఘటిత రంగంలో కార్మికులుగా, చిరు వ్యాపారులుగా, కూలీలుగా పని చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఒక్కరోజు ఉపాధి దొరకక ఉంటే వారి జీవన స్థితిగతులు తారుమారయ్యే దయనీయమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారి ఉపాధికి, ఆదాయానికి మరింత హామీ, భరోసాను ఇచ్చే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పట్టణాల్లోని పేదల కోసం చేపట్టాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి సూచించారు. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం వలన పట్టణ ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిందన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కల ప్రకారం 2019 అక్టోబర్ నుంచి 2021 మార్చ్ మధ్యలో గరిష్టంగా 21 శాతం నిరుద్యోగం నెలకొని ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణాల్లోని పేదలకు అండగా ఉండడం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అత్యవసరం అన్నారు.

స్టాండింగ్ కమిటీలో చర్చించాలి.. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన పలు కమిటీలు, దేశంలోని వివిధ సంస్థలు పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఒక ఉపాధిహామీ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన విషయాన్ని మంత్రి కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. గతంలో పార్లమెంట్ సభ్యుడు భర్తుహరి మహతాబ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మరియు సిఐఐ లాంటి సంస్థలు పట్టణ ప్రాంతాల్లోని ప్రజల సామాజిక భద్రతను పెంచేందుకు పట్టణ ఉపాధిహామీ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ప్రస్తుతం పట్టణాల్లో నెలకొని ఉన్న పరిస్థితులతో పాటు సమీప భవిష్యత్తులో పెరిగే పట్టణ పేదరికం అంచనాల నేపథ్యంలో రానున్న బడ్జెట్ సమావేశాల్లో పట్టణ పేదల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం సముచితంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ కేంద్రానికి తెలిపారు. పట్టణ ప్రాంతాల వైపు భారీగా వలస వస్తున్న గ్రామీణ పేదల కోసం పట్టణాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయస్థాయిలో అసంఘటిత రంగంలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం కేవలం పట్టణాలకే ఉందన్నారు. అయితే ఈ అసంఘటిత రంగంలో పేదలు పని చేసేందుకు వీలు కల్పించేలా వారికి నైపుణ్య అభివృద్ధి, ఫైనాన్షియల్ ఇంక్లుషన్, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం వంటి అనేక చర్యలను తాను ప్రతిపాదించే ఈ ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా చేర్చాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో దేశం చూసిన హృదయవిదారకమైన పట్టణ పేద ప్రజల వలస సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలంటే, పట్టణ అసంఘటిత రంగాన్ని మరింత బలోపేతం చేయడం మాత్రమే మార్గమని కేటీఆర్ తెలిపారు. వివిధ రాష్ట్రాల ప్రజలు భారీ ఎత్తున ఇతర రాష్ట్రాల్లోని పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితులు ఉన్నందున దేశంలోని ఎక్కడివారైనా ఏ పట్టణంలోనైనా ఈ ఉపాధి హామీ లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని కేటీఆర్ సూచించారు.

ఆర్థిక వ్యవస్థకు ఇంజన్లుగా పట్టణాలు.. దేశంలోని పట్టణాలు భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్లుగా పనిచేస్తున్న విషయాన్ని గుర్తించాలని, ఇంతటి ప్రాధాన్యత కలిగిన పట్టణ ప్రాంతాల్లోని పేదలకు చేయూత అందించాల్సిన అవసరం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగర ప్రభుత్వాలైనా పురపాలికల పై కూడా ఉందన్నారు. ఇవి తమ పరిధిలో చేపట్టే హరితహారం లాంటి గ్రీనరీ కార్యక్రమాలు, పట్టణాలలో చేపట్టే ఫుట్ పాత్ లు, డ్రైనేజీల నిర్మాణము వంటి ప్రాథమిక మౌలిక వసతుల నిర్వహణ వంటి కార్యక్రమాల్లో పట్టణ పేద ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తూ వారి ఉపాధులకు హామీ ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న అనిశ్చితమైన ఉపాధి అవకాశాలు, ఆదాయ మార్గాలను దాటుకుని పట్టణ పేద ప్రజలు నాణ్యమైన జీవన ప్రమాణాలను అందుకోవాలంటే, వారి ఉపాదులకు మరింత హామీ కల్పించడమే మాత్రమే ఏకైక పరిష్కార మార్గమని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రత్యేక పట్టణ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి పంపిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Also Read:

Election 2022: పొత్తు రాజకీయాల్లో కాంగ్రెస్ చిత్తు.. వ్యూహాలతో దూసుకెళ్తున్న బీజేపీ..

Budget 2022: సిగరేట్లు, పోగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచాలి.. అలా చేస్తే ఏమవుతుందంటే..?