విరించి ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి కేటీఆర్.. నిబంధలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
Minister KTR: హైదరాబాద్‌లోని విరించి ఆస్పత్రి ఘటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆస్పత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విరించితోపాటు...
హైదరాబాద్‌లోని విరించి ఆస్పత్రి ఘటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆస్పత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విరించితోపాటు రాఘవేంద్ర ఆస్పత్రిపై ఫిర్యాదులు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావును ఆదేశించారు.
అయితే విరించి ఆస్పత్రి ఘటనలో ఓ కరోనా బాధితుడికి ఆస్పత్రి యాజమాన్యం రూ.20 లక్షల బిల్లు వేయడం.. చివరికి ఆ బాధితుడిని కాపాడలేకపోవడంతో ఆస్పత్రి వర్గాలకు మృతుని బంధువుల మధ్య ఘర్షణ జరిగింది. తన తమ్ముడుకి కేవలం జ్వరం వచ్చిందని హాస్పిటల్ లో చేర్పిస్తే మోతాదుకు మించి స్టెరాయిడ్స్ ఇచ్చి చంపేశారని వైద్యురాలైన మృతిని అక్క బంధువులతో కలిసి ఆసుపత్రి యాజమాన్యంతో వాదనకు దిగారు. ఇప్పటివరకూ ఆ కుటుంబం సుమారు రూ. 11 లక్షల వరకు చెల్లించగా, మిగతా సొమ్మును కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్ చేస్తోందని మృతిని బంధువులు ఆసుపత్రి మీద దాడిచేశారు.
ఇదిలావుంటే… తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు చర్యలను మొదలు పెట్టారు. కరోనా చికిత్స అందిస్తున్న 64 ప్రైవేటు ఆస్పత్రులపై అధిక బిల్లుల వసూలుకు సంబంధించి ఇప్పటి వరకు 88 ఫిర్యాదులు వచ్చాయని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. వాటిని పరిశీలించి.. 24 గంటల నుంచి 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. వారి నుంచి వచ్చే సమాధానం అనంతరం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తం ఫిర్యాదుల్లో హైదరాబాద్‌లో 39, మేడ్చల్‌లో 22, రంగారెడ్డి జిల్లాలో 15, వరంగల్ అర్బన్‌లో 7, సంగారెడ్డిలో 2, మహబూబ్‌నగర్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో ఒక్కొక్కటి వచ్చాయన్నారు. కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రిపై 6, బేగంబజార్‌లోని ఆస్పత్రిపై 5, కాచిగూడలోని ఆస్పత్రిపై 3 ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పారు. ఇప్పటికే ఒక ఆస్పత్రి అనుమతి రద్దు చేశామని తెలిపారు. ప్రజలు ఫిర్యాదులను 9154170960 నంబరుకు వాట్సాప్ చేయాలని శ్రీనివాసరావు సూచించారు.