Telangana: అలా మొదలై.. ఇలా సమసిపోయింది.. ఉదయం ఘర్షణ.. మధ్యాహ్నం రాజీబాట..!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు.. ఉండరంటారు.. అది నిజమేనని.. దాన్ని ఒకే రోజు నిరూపించారు ఇద్దరు మహిళా నేతలు.. ఒకరు మంత్రి.. మరొకరు ఎమ్మెల్యే.. ఇద్దరూ.. ఒకే రోజు ఘర్షణకు దిగినంత పనిచేశారు.. ఇరువర్గాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు మహిళా నేతలు మళ్లీ కొన్ని గంటల తర్వాతే కలిసిపోయారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు.. ఉండరంటారు.. అది నిజమేనని.. దాన్ని ఒకే రోజు నిరూపించారు ఇద్దరు మహిళా నేతలు.. ఒకరు మంత్రి.. మరొకరు ఎమ్మెల్యే.. ఇద్దరూ.. ఒకే రోజు ఘర్షణకు దిగినంత పనిచేశారు.. ఇరువర్గాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు మహిళా నేతలు మళ్లీ కొన్ని గంటల తర్వాతే కలిసిపోయారు. మెదక్ జిల్లా ఇంఛార్జి మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఉదయం నర్సాపూర్ నియోజవర్గం కొల్చారం మండల కేంద్రంలో జరిగిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఉండటంతో ప్రొటోకాల్ సమస్య ఏర్పడింది. దీంతో పాలక, ప్రతిపక్షాల మధ్య వివాదం చెలరేగింది. పాఠశాల ఆవరణలో రిబ్బన్ కటింగ్ దగ్గర్నుంచి.. మీటింగ్ నిర్వహణ దాకా.. రచ్చరచ్చ కొనసాగింది.
అయితే.. సునీతాలక్ష్మారెడ్డి చేతిలో ఓడిన కాంగ్రెస్ నేత రాజిరెడ్డికి పాఠశాల భవన ప్రారంభోత్సవంలో… గుమ్మడికాయ కొట్టే అవకాశం ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. దీంతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే సునీతారెడ్డి నిరసన తెలిపారు. అధికారిక కార్యక్రమంలో పార్టీ నేతకు ఎలా అవకాశం ఇస్తారని మండిపడ్డారు. రిబ్బన్ కట్ చేయకుండా మంత్రి చేతుల్లోంచి కత్తెర లాక్కున్నారు సునీత. దీంతో అక్కడున్న ఇరు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ కూడా జరిగింది..
అలా మొదలైన రచ్చ.. మీటింగ్ నిర్వహణ దాకా సాగింది. సీట్ల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం ఒకరినొకరు తోసుకున్నారు ఇరు పార్టీల నాయకులు. జై కేసీఆర్, జై కాంగ్రెస్ అంటూ పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు కార్యకర్తలు. మీటింగ్ నిర్వహిస్తుండగా.. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రతిగా మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్‌ఎస్ కార్యకర్తలు..
కట్ చేస్తే కొన్ని గంటల్లోనే సీన్ మారిపోయింది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇద్దరు మహిళా నేతలు ఆలింగనం చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కొండా సురేఖకు ఉందని, అభివృద్ధి పనులు చేపడతారనే ధీమా వ్యక్తం చేశారు సునీత లక్ష్మారెడ్డి. ప్రొటోకాల్ పాటిస్తూనే నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తామని సూచించారు.
అటు మంత్రి కొండా సురేఖ కూడా సునీత లక్ష్మారెడ్డి మాటలకు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే చెప్పినట్టు నియోజకవర్గంలో కలిసి అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్దిదారులకు ఇస్తామన్నారు. ఆక్రమణలకు గురైన భూములను బాధితులకు ఇస్తామన్నారు. నర్సాపూర్‌లో ఈ ఇద్దరు మహిళా నేతలు ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఉదయం జరిగిన గొడవ.. మధ్యాహ్నానికే సమసిపోయినట్టయింది.
ఇలా ఇద్దరూ నేతలు పొద్దున్నే గొడవపడటం.. మధ్యాహ్నం ఆప్యాయంగా మాట్లాడుకోవడం జిల్లా రాజకీయాలతోపాటు.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..