AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాక్సిన్ మాయ.. చనిపోయిన వ్యక్తికీ కరోనా టీకా వేసినట్లు మెసేజ్.. కంగుతిన్న కుటుంబసభ్యులు

కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) తీసుకోకుండానే తీసుకున్నట్టు సర్టిఫికెట్స్ డౌన్‌లోడ్ అయ్యాయి. అంతే కాదు.. ఏకంగా చనిపోయిన వారు కూడా టీకా వేసుకున్నట్టు మెసేజ్‌ రావడంతో...

వ్యాక్సిన్ మాయ.. చనిపోయిన వ్యక్తికీ కరోనా టీకా వేసినట్లు మెసేజ్.. కంగుతిన్న కుటుంబసభ్యులు
Ganesh Mudavath
|

Updated on: Feb 19, 2022 | 10:35 AM

Share

కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) తీసుకోకుండానే తీసుకున్నట్టు సర్టిఫికెట్స్ డౌన్‌లోడ్ అయ్యాయి. అంతే కాదు.. ఏకంగా చనిపోయిన వారు కూడా టీకా వేసుకున్నట్టు మెసేజ్‌ రావడంతో ఆ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. సమయానికి టీకాలు తీసుకున్నా కొందరికి సర్టిఫికెట్లు రావడం లేదు. కానీ చనిపోయిన వారికీ ధ్రువపత్రాలు రావడం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం(Kothagudem) జిల్లా కొత్తగూడెం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అధికారుల తప్పిదమో లేక సాంకేతిక కారణాలతో ఇలా జరిగిందా అనే అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీంతో వైద్యశాఖ పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని న్యూ గొల్లగూడెం ప్రాంతానికి చెందిన కొత్త మల్లారెడ్డి.. ప్రధానోపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఈ నెల 11న చనిపోవడంతో బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంతిమ సంస్కారం నిర్వహించిన ఆరు రోజుల తర్వాత మల్లారెడ్డి బూస్టర్ డోస్ వేసినట్లు ఆయన ఫోన్ కు మెసేజ్ వచ్చింది. లింక్ ఓపెన్ చేసి, సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసిన కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.

మల్లారెడ్డికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ 2021 ఏప్రిల్ 9 న, రెండో డోస్ 2021 మే 10న, బూస్టర్ డోస్ టీకా 2022 ఫిబ్రవరి 16న వేసినట్టు అందులో ఉండటంతో అయోమయానికి గురయ్యారు. ఇది పొరపాటుగా జరిగిందా? లేక టార్గెట్ కోసం గతంలో వేసిన ఆధార్ నంబర్లను ఫీడ్ చేసుకున్నారా ?, ఇలా అసలు ఎన్ని వ్యాక్సిన్లు వేశారు. వ్యాక్సిన్ వేయకుండా రికార్డులకు ఎక్కించినవి ఎన్ని? అనేవి అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఈ ఘటనపై వైద్యశాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయాలని మల్లారెడ్డి కుటుంబసభ్యులు, స్థానికులు కోరుతున్నారు.

మరణించిన తర్వాత వ్యాక్సిన్ వేసినట్లు వచ్చిన మెసేజ్ పై డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష స్పందించారు. మల్లారెడ్డి మరణించిన విషయం స్థానిక ఏఎన్ఎం వ్యాక్సినేషన్ రిజిస్టర్లో ఆయన పేరు రౌండ్ చేశారని, కానీ పొరపాటున చనిపోయిన వ్యక్తి సెల్ ఫోన్ కు మెసేజ్ వెళ్ళిందన్నారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read

Kisan Drones: రైతులకు మోడీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. పంట పొలాల్లో పురుగుమందు పిచికారీ కోసం కిసాన్‌ డ్రోన్‌లు

Viral Video: క్లాస్ రూంలో పాట పాడి ఫేమసైన పంతులు.. వైరల్ వీడియో

TTD: తిరుమల కొండపై ప్రైవేటు ఫుడ్‌ వ్యవస్థ నియంత్రణ సాధ్యమేనా..? టీటీడీ నిర్ణయం సక్సెస్‌ అయ్యేనా..?