Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో డీకే ఎంట్రీ ఇవ్వనున్నారా.. ఇన్‌ఛార్జ్ మార్పుపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన థాక్రే..
Manikrao Thackrey : టీపీసీపీలో ఇన్‌చార్జ్ మార్పుపై ఉంటుందా?. డీకేపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం.. ఆయనతో సంప్రదింపులు జరుపుతుందా?. డీకే ఇన్‌చార్జ్ అంటూ వస్తున్న వార్తలపై థాక్రే ఏం చెప్పారు? పార్టీ క్యాడర్‌కి థాక్రే ఇచ్చిన క్లారిటీ ఏంటీ?.
Telangana Congress News: కర్ణాటకలో తిరుగులేని విజయాన్ని నమోదు చేసి కాంగ్రెస్ అధిష్టానం.. తర్వాత తెలంగాణపై గురిపెట్టింది. తెలంగాణలో జరగబోయే ఎన్నికలకు సమాయత్తమవుతుంది. ఇదే క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను మరో కీలక నేతకు అప్పగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లుగా ఇటీవల వార్తలు జోరందుకున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి విక్టరీని అందించడంలో ట్రబుల్ షూటర్, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు.. తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను కూడా అప్పగించాలని నిర్ణయించిందని గత కొన్నిరోజులుగా ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. టీకాంగ్రెస్ నేతల్లో నెలకొన్న సమన్వయాన్ని చక్కదిద్దేందుకు డీకే ఇప్పటికే రంగంలోకి దిగేశారని.. పార్టీలో చేరికల నుంచి అన్నీ ఇక ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. దీనిపై తెలంగాణ కీలక నేతలు గానీ.. ఢిల్లీ అగ్రనేతలుగానీ క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీ వర్గాల్లో అయోమయం నెలకొంది.
డీకే విషయం పీక్స్‌కు చేరడంతో.. ఇన్‌చార్జ్ మార్పుంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఏఐసీసీ సెక్రెటరీ మాణిక్‌రావు ఠాక్రే తేల్చి చెప్పేశారు. నల్గొండ జిల్లాలో జరుతున్న సీఎల్పీ లీడర్ భట్టి పాదయాత్రలో డీకే విషయంపై ఠాక్రే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. డీకే తెలంగాణకు రావట్లేదన్నారు. డీకే ఎన్నికల ప్రచారానికి వచ్చే విషయంలో ఏఐసీసీ పెద్దలదే తుది నిర్ణయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు జాతీయ నేతలు వచ్చి పని చేస్తారనీ ఠాక్రే చెప్పారు.
అయితే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో డీకే శివకుమార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సైతం డీకేతో మంచి ర్యాపో మెంటెయిన్ చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ విషయం నుంచి నేతల చేరిక వరకు ప్రతి విషయం డీకేతో రేవంత్ చర్చించాక అధిష్టానానికి నివేదిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటక, తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుపొందాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి టైంలో డీకేను రెండు రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌గా కొనసాగిస్తే… అటు రాజకీయంగా ఇటు ఆర్థిక అంశాల్లోనూ తిరుగుండదని భావిస్తుంది కాంగ్రెస్. అయితే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా డీకే శివకుమార్ వస్తే.. టీకాంగ్రెస్‌కు ప్లస్ అవుతుందని భావించిన నేతలు ఠాక్రే ప్రకటనతో ఒకింత ఢీలా పడ్డారు. ఎన్నికలకు ఇంకా చాలానే టైమ్ ఉంది గనుక.. ఈలోపు ఏమైనా జరగొచ్చననే భావన ఉన్నట్లు తెలుస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..