పంటను అమ్మే దారేది..? మంచిర్యాల జిల్లాలో మిర్చి రైతులకు అగచాట్లు.. లాభం సరే.. పెట్టుబడి అయినా వచ్చేనా..?

మంచిర్యాల జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పండిన పంటను అమ్ముకునే దిక్కులేక రైతులకు అయోమయ పరిస్థితి నెలకొంది.

  • Ram Naramaneni
  • Publish Date - 9:00 pm, Mon, 22 February 21
పంటను అమ్మే దారేది..? మంచిర్యాల జిల్లాలో మిర్చి రైతులకు అగచాట్లు.. లాభం సరే.. పెట్టుబడి అయినా వచ్చేనా..?

మంచిర్యాల జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పండిన పంటను అమ్ముకునే దిక్కులేక రైతులకు అయోమయ పరిస్థితి నెలకొంది. లక్షలు పెట్టుబడి పెట్టి పండించిన పంటను అమ్ముకునేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. గత్యంతరం లేక పొరుగు రాష్ట్రానికి వెళ్లి అమ్ముకుంటుడగా, రవాణాచార్జీలు తడిసిమోపెడవుతున్నాయి.

మంచిర్యాల జిల్లాలో ఎక్కడా మిర్చి మార్కెట్ లేకపోవడం రైతుల ఇబ్బందులకు కారణమవుతోంది. చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ ఏడాది 1800 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. తగ్గిన దిగుబడి వర్షాభావ పరిస్థితులు.. పంట చేతికొచ్చే సమయం లో పంటను తెగుళ్లు చుట్టుముట్టాయి. సాధారణంగా ఎకరాకు 22 నుంచి 25 క్వింటాళ్ల మిర్చి దిగుబడి వస్తుంది. కానీ.. ఈ ఏడాది మాత్రం 10క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యేడు లాభం మాట దేవుడెరుగు… నష్టాలే మిగులుతున్నాయని మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రారంభంలో మార్కెట్ కు చేరిన మిర్చికి ధర అమాంతం పెరిగింది. క్వింటాలుకు 20 వేలకు పైగా పలికింది. ధర పెరగడంతో రైతులు సంతోషపడ్డారు. ధర ఇలాగే ఉంటే కాస్తోకూస్తో.. లాభం వస్తుందని ఆశించారు. కానీ… రోజురోజుకూ ధరలు పతనమవుతుండడంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ప్రస్తుతం మిర్చికి క్వింటాల్‌కు 11వేలు మాత్రమే పలుకుతోంది. జిల్లాలో ప్రధానంగా 341 నంబర్ 5 రకాల మిర్చినే సాగు చేస్తుంటారు. ఈ రకం మిర్చికి ధర ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో ఇక నష్టాలు తప్పవని రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

ఇంత కష్టపడి.. మిర్చి పంటను సాగు చేస్తున్నా, అమ్ముకుందామంటే జిల్లాలో కనీసం మార్కెట్ సౌకర్యం లేకపోవడం రైతులను మరింత కుంగదీస్తోంది. దీంతో పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని నాగాపూర్ మార్కెట్ కు తీసుకెళ్తున్నారు. నాగాపూర్ వెళ్లిరావాలంటే సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. మిర్చిని తరలించాలంటే వాహనానికి 24 వేలు చార్జీ చెల్లించాల్సిందే. ఇలా రవాణా చార్జీల భారం తడిసి మోపెడవుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో మిర్చి మార్కెట్ సౌకర్యం కల్పించాలని రైతులు ఎంత వేడుకుంటున్నా…కనీసం పట్టించుకున్న వారు లేరంటూ రైతులు వాపోతున్నారు.

నాగాపూర్ మార్కెట్లో వ్యాపారులు మరాఠీ మాట్లాడుతుంటారు. జిల్లా రైతులకు ఆ భాష రాకపోవడంతో తీరా అక్కడికెళ్లి వ్యాపారుల చేతుల్లో మోసపోతున్నారు. వ్యాపారులు మిర్చికి ముందుగా ఒక ధర నిర్ణయించి.. బండి అన్లోడ్ అయ్యాక తక్కువ ధరతో డబ్బులు ఇస్తున్నారని రైతులు అంటున్నారు. ప్రశ్నిద్దామంటే భాష అడ్డుగా వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం జిల్లాలో మిర్చి మార్కెట్ ఉన్నప్పటికీ 25 ఏళ్లుగా జిల్లా రైతులు నాగాపూర్ మార్కెట్ కే వెళ్లి విక్రయిస్తున్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో మిర్చి మార్కెట్ సౌకర్యం కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.

Also Read:

ఓటీటీ ఎపిసోడ్ల మాదిరిగా పోర్న్ కంటెంట్.. వారానికో ఎపిసోడ్ రిలీజ్.. విచారణలో దిమ్మతిరిగే విషయాలు

నల్లగా ఉన్నావ్.. వదిలేసి.. మరొకర్ని పెళ్లి చేసుకుంటానన్న భర్త.. భార్య ఊహించని పని చేసింది

చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీనే.. దెయ్యమే చంపిందా..?.. షాకింగ్ వీడియో