Telangana: అటవీశాఖ, రెవెన్యూశాఖను షేక్ చేస్తున్న “దందా”.. తీగలాగితే కదులుతున్న డొంక..!

ములుగు, మహబూబాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ నకిలీ పాస్ బుక్స్ చెలామణి చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Telangana: అటవీశాఖ, రెవెన్యూశాఖను షేక్ చేస్తున్న దందా.. తీగలాగితే కదులుతున్న డొంక..!
Fake Documbnts
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Oct 26, 2024 | 2:52 PM

వాళ్లు మహా మాయగాళ్ళు.. చదివింది ఏడో తరగతి కానీ చేసిన పని రాష్ట్రాన్ని షేక్ చేసింది.. నకిలీ అటవీ హక్కు పత్రాలు ముద్రించి అటవీ భూములకు ఎసరు పెట్టారు.. అంతేకాదు వాటిని బ్యాంక్ లో తనఖాపెట్టి లక్షలాది రూపాయల రుణాలు పొందారు. వరంగల్ కేంద్రంగా సాగిన ఆ నకిలీ అటవీ హక్కు పత్రాల హైటెక్ రాకెట్ ఇప్పుడు రెవెన్యూ, అటవీశాఖను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

దశాబ్దాల తరబడి రగులుతున్న పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తుంటే.. ఈ కేటుగాళ్లు మరో కొత్త సమస్యగా మారారు. ఏకంగా నకిలీ అటవీ హక్కు పత్రాలు సృష్టించి బ్యాంకులకు కన్నమేశారు.. వందలాది ఎకరాల అటవీ భూములకు ఎసరు పెట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట కేంద్రంగా జరిగిన ఈ దందా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. ములుగు జిల్లాలో అటవీశాఖ అధికారులు ఈ హైటెక్ రాకెట్ ను గుట్టురట్టు చేశారు. నకిలీ అటవీ హక్కు పత్రాలు ముద్రించిన ఈ ముఠా కలెక్టర్ సంతకంతో సహా DFO, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సంతకాలు ఫోర్జరీ చేశారు.

హక్కు పత్రాలపై ముద్రించే హాలో‌గ్రామ్ తో సహా, లబ్ధిదారుని డేటా క్యూ ఆర్ కోడ్ కూడా నకిలీవే క్రియేట్ చేసి నకిలీ హక్కుపత్రాలు తయారుచేశారు. ఈ నకిలీ హక్కు పత్రాలతో ఏకంగా బ్యాంకులను బురుడీ కొట్టించారు. ములుగు లో బ్యాంక్ ఇప్పటికే తొమ్మిది మంది బ్యాంక్ రుణాలు కూడా పొందారు. నకిలీ అటవీ హక్కు పత్రాల బాగోతం ములుగు ఫారెస్ట్ అధికారుల దృష్టికి రావడంతో తీగలాగితే డొంక కదిలింది. నర్సంపేట కేంద్రంగా ఈ నకిలీ హక్కుపత్రాల దందా జరిగినట్లు గుర్తించారు. ఒక్కో పాస్ బుక్ కు 25 వేల నుండి లక్ష రూపాయల వరకు తీసుకున్నారని అటవీశాఖ అధికారులు గుర్తించారు. బద్రునాయక్ అనే ప్రధాన పాత్రదారునితో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టుచేసిన అటవీశాఖ అధికారులు తెర వెనుక సూత్రధారులు పాత్రధారుల గుట్టు లాగుతున్నారు. మరో ఆరుగురు అసలు ముఠా ఉన్నట్లు గుర్తించారు. వారంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

ఇప్పటికే భారీ ఎత్తున నకిలీ పాస్ బుక్స్ గుర్తించారు. వాటిలో కొన్ని స్వాధీనం చేసుకున్నారు. ములుగు, మహబూబాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ నకిలీ పాస్ బుక్స్ చెలామణి చేసినట్లు గుర్తించారు. అసలు ఈ హైటెక్ రాకెట్ ఎలా వెలుగులోకి వచ్చింది..? బ్యాంకు లను ఎలా మోసం చేశారో మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

అయితే గత ప్రభుత్వ హయాంలో ఒక లక్ష 51 వేల మంది పోడు రైతులకు హక్కు పత్రాలు జారీ చేసింది. మొదట షెడ్యూల్ ట్రైబల్స్ కు మాత్రమే హక్కు పత్రాలు జారీ చేసింది. ఇదే అదునుగా భావించిన ఈ కేటుగాళ్లు నకిలీ హక్కుపత్రాలు సృష్టించి దర్జాగా అటవీ భూములు స్వాహా చేసే ప్రయత్నం చేశారు. గిరిజనులే కాదు.. గిరిజనేతరుల పేరుతో కూడా ఈ నకిలీ హక్కు పత్రాలు తయారు చేసే సంతలో సరుకులా అమ్మారు..

ఏడో తరగతి చదివిన భద్రునాయక్ ఈ దందాకు ప్రధాన సూత్రదారి పాత్రదారి కావడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా నకిలీ హక్కు పత్రాలు చెలామణి అవుతున్నట్లు సమాచారం. ఈ నకిలీ హక్కుపత్రాల దందా మంత్రి సీతక్క దృష్టికి రావడంతో మంత్రి సీరియస్ అయ్యారు. ఈ ముఠా పై కఠిన చర్యలు తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, SP లు, DFO ను ఆదేశించారు.

వీడియో చూడండి…

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..