Telangana: పిల్లలను ఒంటరిగా బయటకు పంపిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. లేకుంటే మీరు కూడా ఇలానే..
పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన ఘటనలు లేదా చంపేసిన ఘటనలు కూడా చాలా చూస్తూనే ఉంటాం.. తాజాగా అలాంటి ఘటనే ఒక్కటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో పాతబస్తీలో ఓ బాలిక నడుచుకుంటూ మరో ఇంటి వైపు వెళ్తూ ఉంది. ఇంతలోనే గుర్తు తెలియని ఓ వ్యక్తి వాహనంపై వచ్చి ‘నేను మీ నాన్న ఉండే షాపు వైపు వెళుతున్నా.. రా నిన్ను అక్కడ వదిలేస్తా’ అని చెప్పాడు. ఇంకేముంది.. ఆ వ్యక్తి చెప్పిన మాటలు నిజం అని నమ్మిన చిన్నారి అతనితో పాటు ఆ వాహనంపై ఎక్కడానికి సిద్ధమైంది. ఆ తర్వాత ఆ వ్యక్తి చిన్నారి తండ్రి షాపు వైపు వెళ్లాల్సింది పోయి.. మరోవైపు వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పరిస్థితి అర్థమైన చిన్నారి కేకలు పెడుతూ అక్కడి నుంచి దిగి ఇంటి వైపు పరుగులు పెట్టింది. అయితే ఈ మొత్తం తతంగం అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. జరిగిన ఘటనపై తల్లిదండ్రులకు వివరించగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వ్యవహారంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా ఎక్కడికి బయటకి పంపకూడదని.. ఒకవేళ పంపించినా కూడా గుర్తు తెలియని వ్యక్తులతో మాత్రం అసలే వెళ్లకూడదని చిన్నపిల్లలకి నేర్పించాలని పలువురు సోషల్ మీడియాలో వీడియోతో పాటు పోస్టులు చేస్తున్నారు.