Life Line Express: పట్టాలపైనే వైద్య సేవలు.. రైల్లోనే కీలక ఆపరేషన్లు.. కాగజ్ నగర్ కు చేరుకున్న లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్..
రైలులో ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా అస్వస్థతకు గురైతే ఆ బోగీలో ఉన్న వాళ్లల్లో ఎవరూ ఒకరు ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో రైళ్లలోనే శిశువులు జన్మించడం, ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వంటి..

రైలులో ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా అస్వస్థతకు గురైతే ఆ బోగీలో ఉన్న వాళ్లల్లో ఎవరూ ఒకరు ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో రైళ్లలోనే శిశువులు జన్మించడం, ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వంటి ఘటనలు మనం చూసే ఉన్నాం. కానీ ఓ రైలును మాత్రం కేవలం వైద్య సదుపాయాలు అందించేదుకే ఏర్పాటు చేశారు. ఈ మొబైల్ హాస్పిటల్‌ను ముంబయికి చెందిన లాజరస్ అనే వ్యక్తి ప్రారంభించారు. 32 ఏళ్ల క్రితమే ఇది పట్టాలెక్కింది. దేశమంతా తిరుగుతూ వైద్యం చేసే మొబైల్ ట్రైన్ ధర్మాసుపత్రి. ఇందులో ఏడు బోగీలు ఉంటాయి. వాటిలో వివిధ రకాల వైద్యానికి సంబంధించిన నిపుణులైన వైద్యులతో సహా చికిత్సకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలోకి కాగజ్‌నగర్‌లో ఈ ఆస్పత్రి రైలు ఆగింది. లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్ పేరుతో నడుస్తున్న ఈ రైలు ఆస్పత్రికి ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్, రైల్వే మంత్రిత్వ శాఖలు మద్దతునిస్తున్నాయి. కనీస వసతులు లేని పేదలకు సహాయం అందించడంలో తోడ్పాటు అందిస్తున్నాయి. ఈ రైలు ఆసుపత్రిని గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఆపి రెండు నుంచి మూడు వారాలపాటు వైద్య శిబిరం నిర్వహిస్తారు. ఈ విధంగా ఏడాదికి పదకొండు శిబిరాలను ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా వైద్యం, శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు.
ఈ లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్ ఇప్పటివరకూ 25 రాష్ట్రాల్లో 224 హెల్త్ క్యాంపులను నిర్వహించింది. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 2 వరకూ కాగజ్ నగర్ లో ఈ శిబిరం కొనసాగనుంది. 22 మంది వైద్యనిపుణులు, 30 సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ఈఎన్‌టీ, గ్రహణం మొర్రి, కాలిన గాయాలు, గైనిక్, దంత, మూర్చ, కంటి సమస్యలకు ట్రీట్ మెంట్ చేస్తారు. ఇక్కడ క్యాన్సర్ పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. అలానే పోలియో బారిన పడిన పద్నాలుగేళ్ల లోపు చిన్నారుల వంపు తిరిగిన ఎముకలకు శస్త్రచికిత్స చేస్తారు. సమస్య తీవ్రతను బట్టి ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఉచితంగానే ఆ సేవలూ అందిస్తారు. అందుకోసం రెండు బోగీల్లో అత్యాధునిక సదుపాయాలతో ఆపరేషన్ థియేటర్, పాథాలజీ ల్యాబ్, మమోగ్రఫీ, ఎక్స్‌రే యూనిట్‌లతోపాటు ఫార్మసీ కూడా ఉంది.





Life Line Express
గ్రామీణ ప్రజలకు పట్టాలపైనే సేవలందించే ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకూ 15 లక్షల మందికి పైనే వైద్య సేవలూ, సుమారు లక్షన్నర మందికి ఉచితంగా ఆపరేషన్లు చేశారు. పల్లె ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తోన్న ఈ ట్రైన్‌లో వైద్యం చేయించుకోవాలనుకునేవారు తమ వెంట ఆధార్‌కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది.