ISRO: మరో రికార్డు సృష్టించేందుకు ఇస్రో సిద్ధం.. GSLV మార్క్- 3 ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Oct 15, 2022 | 9:12 PM

మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతోంది ఇస్రో. కమర్షియల్‌ శాటిలైట్స్‌ ప్రయోగాల్లో తనకెదురు లేదని మళ్లీ రుజువు చేసుకునేందుకు సిద్ధమవుతోంది. షార్‌ కేంద్రంగా 36 ఫారిన్‌ శాటిలైట్స్‌ను నింగిలోకి పంపబోతోంది.

ISRO: మరో రికార్డు సృష్టించేందుకు ఇస్రో సిద్ధం.. GSLV మార్క్- 3 ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి..
Isro

శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఒకేసారి 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు వారం రోజుల్లో కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టబోతోంది ఇస్రో. బాహుబలి రాకెట్‌గా పిలిచే GSLV మార్క్‌3ని రెడీ చేసింది. ఈనెల 23న నింగిలోకి ఎగరనుంది LVM3 రాకెట్‌. కమర్షియల్‌ శాటిలైట్స్‌కు ఏకైక డెస్టినేషన్‌గా మారిన ఇస్రో, ఇప్పుడు బ్రిటన్‌, అమెరికా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపబోతోంది. యూకే, యూఎస్‌ శాటిలైట్స్‌తోపాటు పలు దేశాల ఉపగ్రహాలను LVM3 రాకెట్‌ ద్వారా ప్రయోగించబోతోంది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకి సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది. అక్టోబర్ 23న అర్ధరాత్రి 12గంటల 12 నిమిషాల 2సెకన్లకు శ్రీహరికోటలోని సెకండ్‌ లాంచ్ ప్యాడ్‌ నుంచి GSLV మార్క్‌3 రాకెట్‌ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి షార్‌లో రాకెట్‌ అనుసంధాన పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ మేరకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.

అత్యంత హెవీ రాకెట్‌గా పిలవబడే GSLV మార్క్‌3.. సుమారు నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాలను ఈజీగా కక్ష్యలోకి చేర్చగలదు. అంతేకాకుండా తక్కువ భూమి కక్ష్యలో ఉంచుతుంది. ఈ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రో నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్ లిమిటెడ్ వన్‌వెబ్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా వన్‌వెబ్‌ సంస్థ .. ఇస్రోలో భాగమైన న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌)తో కలిసి పనిచేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత పాశ్చాత్య దేశాల చర్యలతో బ్రిటన్ రష్యాపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన వన్ వెబ్‌ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు రష్యా నిరాకరించింది. దీంతో OneWeb భారత్‌తో జతకట్టింది.

2016లో ఒకేసారి 104 శాటిలైట్స్‌ను నింగిలోకి పంపి చరిత్ర సృష్టించింది ఇస్రో. ఇప్పుడు, 36 విదేశీ శాటిలైట్స్‌ను కక్ష్యలోకి చేర్చేందుకు GSLV మార్క్‌3 రాకెట్‌ను ప్రయోగించబోతోంది. కమర్షియల్‌ శాటిలైట్స్‌ ప్రయోగాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది ఇస్రో. తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేపడుతుండటంతో ఇస్రోను ఆశ్రయిస్తున్నాయి పలు దేశాలు. ఇప్పటివరకు 33 దేశాల ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చి సత్తా చాటుకుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu